Apple Employee Fraud : రూ. 138 కోట్లు కాజేసిన ఆపిల్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష.. కొల్లగొట్టిన మొత్తం కంపెనీకి చెల్లించాల్సిందే..!
Apple Employee Fraud : ఆపిల్ కంపెనీలో ఏళ్లతరబడి పనిచేస్తూ కోట్లు కొల్లగొట్టాడు.. దాదాపు రూ.138 కోట్లు ఆపిల్ కంపెనీ నుంచి కాజేశాడు. ఇన్నాళ్లకు ధీరేంద్ర ప్రసాద్ పాపం పండింది. విచారణలో అతడికి మూడేళ్ల జైలు శిక్ష పడింది.

Apple employee Dhirendra Prasad gets 3 years jail for Rs 138 crore fraud
Apple Employee Fraud : భారతీయ సంతతికి చెందిన ఆపిల్ మాజీ ఉద్యోగి ధీరేంద్ర ప్రసాద్ (Dhirendra Prasad)కి మూడేళ్ల జైలు శిక్ష పడింది. ఆపిల్ కంపెనీలో 138 కోట్ల మోసానికి పాల్పడినట్టు నేరాన్ని అంగీకరించడంతో అతడికి జైలుశిక్ష విధించింది యునైటెడ్ స్టేట్స్ అటార్నీ. కుపర్టినో ఆధారిత కంపెనీ ఆపిల్ నుంచి 17 మిలియన్ డాలర్లను స్వాహా చేసినందుకు కంపెనీకి 19 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించాలని ఆదేశించింది. యునైటెడ్ స్టేట్స్ అటార్నీ కార్యాలయం ప్రకారం.. ఆపిల్ కంపెనీలో 10 ఏళ్లకు పైగా పనిచేసిన ధీరేంద్ర ప్రసాద్.. ఆపిల్ అందించని సర్వీసులకు కూడా డబ్బులు వసూలు చేయడం, కిక్‌బ్యాక్‌లు తీసుకోవడం, ఇన్‌వాయిస్‌లను పెంచడం, స్పేర్ పార్టులను దొంగిలించినట్టు విచారణలో వెల్లడైంది. ఆపిల్ కంపెనీని మోసం చేసిన వారిలో ధీరేంద్ర ప్రసాద్ సహా రాబర్ట్ గ్యారీ హాన్సెన్, డాన్ ఎం. బేకర్ అనే మరో ఇద్దరు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు పక్కా ప్లాన్ ప్రకారం.. ఆపిల్ నుంచి డబ్బును దొంగలించినట్టు విచారణలో అంగీకరించారు.
కోట్లు సంపాదించి.. పన్ను ఎగవేసిన ప్రసాద్ :
2008 నుంచి 2018 వరకు ఆపిల్ గ్లోబల్ సర్వీస్ సప్లయ్ చైన్‌లో కొనుగోలుదారునిగా ప్రసాద్ పనిచేశాడు. ఈ నిందితులపై మార్చి 2022లో అభియోగాలు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో ఆపిల్, సంబంధిత ట్యాక్స్ ఎగవేత మోసాలకు పాల్పడినట్టు నేరాన్ని అంగీకరించారు. కిక్‌బ్యాక్‌లను స్వీకరించడంతో పాటు కంపెనీ విడిభాగాలను దొంగిలించడం, ఇన్‌వాయిస్‌లను పెంచడం, డెలివరీ చేయని వస్తువులకు కంపెనీ ఛార్జీలు వసూలు చేయడం ద్వారా ప్రసాద్ ఆపిల్ నుంచి కోట్ల మొత్తంలో నగదును స్వాహా చేసినట్లు నివేదిక పేర్కొంది. ఈ కార్యకలాపాలపై రెండు వెండర్ కంపెనీల యజమానులతో కలిసి కుట్ర పన్నినట్లు, ఆపై వచ్చిన ఆదాయంపై పన్ను కూడా ఎగవేసినట్లు విచారణలో ప్రసాద్ అంగీకరించినట్టు ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

Apple employee Dhirendra Prasad gets 3 years jail for Rs 138 crore fraud
ధీరేంద్ర ప్రసాద్ ఆపిల్‌లో చట్టవిరుద్ధ కార్యకలాపాలను దాచడానికి ప్రయత్నించారని, కంపెనీ మోసాలను గుర్తించే పద్ధతులపై అంతర్గత సమాచారాన్ని ఉపయోగించారని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ పేర్కొంది. ఆపిల్ కంపెనీలో ఇప్పటికీ వారంటీలో ఉన్న పాత డివైజ్‌లను సరిచేయడానికి ఆపిల్ విడిభాగాలను కొనుగోలు చేయడం అతని పని. ఆపిల్ విడిభాగాలను విక్రయించిన రెండు కంపెనీలతో కలిసి ప్రసాద్ పనిచేశాడు. అంతేకాదు.. ఆపిల్‌ను 17 మిలియన్ డాలర్లకు పైగా మోసం చేశాడు. దీంతో వచ్చిన డబ్బుకు కూడా ప్రసాద్ పన్ను కట్టలేదని నివేదిక తెలిపింది. జీతం, బోనస్‌ల రూపంలో ఆపిల్ నుంచి వందల-వేల డాలర్ల విలువైన నష్టపరిహారాన్ని పొందాడు. అదనంగా, ప్రసాద్ తన నేరపూరిత చర్యలను గుర్తించకుండా ఉండటానికి కంపెనీ అంతర్గత సమాచారాన్ని కూడా ఉపయోగించాడని నివేదిక పేర్కొంది.
ఆపిల్ ద్వారా సంపాదించిన ఆస్తులన్నీ ఇవ్వాల్సిందే :
ఆపిల్ కంపెనీలో సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రసాద్‌కు ఉంది. కానీ, అతడు తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ప్రసాద్ కారణంగా ఆపిల్ చాలా డబ్బును కోల్పోయింది. చివరికి ప్రసాద్ పాపం పండింది. అతడు చేసిన అన్ని మోసాలు విచారణలో బయటపడ్డాయి. ఎట్టకేలకు ప్రసాద్ మూడు సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఆపిల్‌ను మోసం చేసి సంపాదించిన డబ్బు, ఆస్తులన్నీ తిరిగి ఇవ్వాలని మెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ఆదేశించినట్టు నివేదిక తెలిపింది. అతను పన్నులు చెల్లించని డబ్బును కూడా తిరిగి చెల్లించాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొంది. ప్రసాద్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అతన్ని మరో మూడు ఏళ్లు నిశితంగా పరిశీలిస్తారు.