Swiss bank : స్విస్ బ్యాంక్‌లో పెరిగిన భారతీయుల సొమ్ము

స్విస్ బ్యాంకులో భారతీయులు, భారతీయ సంస్థలు దాచుకున్న సొమ్ము 20 వేల 700 కోట్ల రూపాయలకు పెరిగింది. బ్యాంకుల్లో సెక్యూరిటీల విలువ గణనీయంగా పెరగ్గా.. కస్టమర్ డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి.

Swiss bank : స్విస్ బ్యాంక్‌లో పెరిగిన భారతీయుల సొమ్ము

Swiss Bank

Swiss bank : స్విస్ బ్యాంకులో భారతీయులు, భారతీయ సంస్థలు దాచుకున్న సొమ్ము 20 వేల 700 కోట్ల రూపాయలకు పెరిగింది. బ్యాంకుల్లో సెక్యూరిటీల విలువ గణనీయంగా పెరగ్గా.. కస్టమర్ డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి. ఈ మేరకు స్విట్జర్లాండ్ సెంట్రల్ బ్యాంకు వార్షిక నివేదిక వెల్లడించింది. గడిచిన 13ఏళ్లల్లో ఇవే అత్యధిక భారతీయ డిపాజిట్లుగా అధికారులు తెలిపారు. 2019లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 6 వేల 625 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. అంతకుముందు రెండేళ్ల పాటు డిపాజిట్లు తగ్గుతూ వచ్చాయి. 2006లో అత్యధికంగా 52 వేల 264 కోట్లకు చేరాయి.

మొత్తం డిపాజిట్లలో 4 వేల కోట్ల రూపాయలకు పైగా కస్టమర్ డిపాజిట్లు ఉన్నాయి. బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర ఆర్థిక సాధనాల విభాగంలో డిపాజిట్లు 2019తో పోలిస్తే ఆరు రెట్లు పెరిగాయి. 2019లో.. మిగిలిన నాలుగు విభాగాల డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి. అయితే, ఈ వివరాలన్నీ స్విస్ నేషనల్ బ్యాంకుకు దేశంలోని బ్యాంకులు అందించిన అధికారిక గణాంకాలు మాత్రమే. ఇవన్నీ.. సిట్జర్లాండ్​లో భారతీయులు దాచిపెట్టిన ‘నల్లధనం’ కాదు. భారతీయులు, ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లోని సంస్థల పేర్లతో డిపాజిట్ చేసిన మొత్తాల విలువ ఇందులో ఉండదు.

భారతీయులు స్విట్జర్లాండ్‌లో ఉంచిన నిధులను నల్లధనంగా పరిగణించబోమని ఆ దేశం ఇప్పటికే ప్రకటించింది. పన్ను ఎగవేతలు, అక్రమ ధనార్జన వంటి కేసుల విషయంలో విచారణకు భారత్‌కు మద్దుతు, సహకారం ఇస్తామని కూడా స్పష్టం చేస్తోంది. ఇందుకు సంబంధించి రెండు దేశాల మధ్య 2018 నుంచి ఒక అవగాహనా ఒప్పందం కూడా అమల్లో ఉంది. తమ దేశంలో భారతీయుల అకౌంట్ల సమాచారాన్ని 2019 సెప్టెంబర్‌లో మొట్టమొదటిసారి అందజేసింది. ప్రతి సంవత్సరం ఈ విధానాన్ని కొనసాగిస్తోంది.