ఒక భార్య …ముగ్గురు మొగుళ్లు

  • Published By: murthy ,Published On : July 25, 2020 / 11:33 AM IST
ఒక భార్య …ముగ్గురు మొగుళ్లు

మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో నకిలీ ఎకౌంట్ రిజిష్టర్ చేసి పెళ్లి కాని యువకుడిని మోసం చేసిన మహిళ ఉదంతం వెలుగు చూసింది. అప్పటికే ఆమెకు రెండు వివాహాలు కాగా ఇప్పుడు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న ప్రకాశం జిల్లా యువకుడిని మోసం చేసింది.

ప్రకాశం జిల్లా దొనకొండ మండలం వీరేపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే యువకుడు విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో తన ప్రోఫైల్ ను మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకున్నాడు.

అక్కడ అతనికి స్వప్న అనే యువతి పరిచయం అయ్యింది. తాను ఢిల్లీలో ఢిఫెన్స్ సర్వీసులో పనిచేసే ఐపీఎస్ స్ధాయి అధికారిణి అని, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దగ్గర పని చేస్తుంటానని పరిచయం చేసుకుంది. ఇద్దరికీ ప్రాధమిక సమాచారం నచ్చటంతో మాట్లాడుకోవటం మొదలెట్టారు.

తన తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపోయారని కష్టపడి చదువుకుని ఈ స్ధాయికి వచ్చానని చెప్పింది స్వప్న. ఈ క్రమంలో 2019, డిసెంబర్ 12న భద్రాచలం రాముల వారి గుళ్ళో బంధుమిత్రుల సమక్షంలో వారి పెళ్ళి జరిగింది. ఆతర్వాత రామాంజనేయులు స్వప్నతో హైదరాబాద్ లో కాపురం పెట్టాడు. కాపురం పెట్టిన నెల రోజులకు రామాంజనేయులుకు భార్యపై అనుమానం కలిగింది.

స్వప్న ఢిల్లీలో ఉద్యోగం చేయటంలేదని.. ఐపీఎస్ స్ధాయి అధికారిణి కాదని తెలుసుకున్నాడు. భార్యను నిలదీశాడు. ఈవిషయమై ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. గొడవలు మొదలయ్యాయి. తనకు విడాకులు ఇచ్చేయమని రామాంజనేయులు స్వప్నను కోరాడు.

ఈలోగా తనకు, స్వప్నకు గతంలోనే వివాహం అయ్యిందంటూ తిరుపతికి చెందిన పృధ్వీరాజ్ అనే వ్యక్తి ఆధారాలతో సహా తెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో రామాంజనేయులు స్వప్నకు చెప్పకుండానే విదేశాలకు వెళ్ళిపోయాడు.

ఏప్రిల్ లో స్వప్న దొనకొండ పోలీసు స్టేషన్ కు వచ్చి భర్త తనను వదిలేసి  విదేశాలకు వెళ్లిపోయాడని ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి రెండు నెలలైనా  పోలీసులు స్పందించటం లేదంటూ స్వప్న వారం రోజుల క్రితం తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో పోలీసులపై ఫిర్యాదు చేసింది.

అనంతరం వీరేపల్లి గ్రామానికి వచ్చి అత్తగారింటిలోకి వెళ్లబోయింది. దీంతో వారు అడ్డుకున్నారు. తనను లోపలికి రానిచ్చేంతవరకు ఎక్కడకు వెళ్లనని గ్రామంలో తిష్ట వేసుకు కూర్చుంది. ఈ ఘటనతో గ్రామస్తులు రెండుగా చీలిపోయారు. స్వప్న అనుకూల వర్గం, రామాంజనేయులు అనుకూల వర్గంగా విడిపోయారు.

ఈక్రమంలో రామాంజనేయులు తల్లి తండ్రులు స్వప్నపై  పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మోసం చేసి తమ కొడుకును పెళ్లి చేసుకుందని..ఆమెకు ఇంతకు ముందే రెండు పెళ్లిళ్లు అయ్యాయని ఫిర్యాదు చేశారు. మొదట మేనమామను, తర్వాత తిరుపతికి చెందిన  పృధ్వీరాజ్ ను పెళ్ళి చేసుకున్నట్లు వారు ఫిర్యాదులో పేర్కోన్నారు. భర్తకు వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉందని అందుకే తనను వదిలేశాడని స్వప్న ఇప్పుడు ఆరోపిస్తోంది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు పృధ్వీరాజ్ ను వీరేపల్లి రప్పించి గ్రామంలో పంచాయతీ పెట్టారు. పృధ్వీరాజ్ ఎవరో తనకు తెలియదంటూ స్వప్న అడ్డం తిరిగింది. స్వప్న తనకు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యిందని… అనాధ అయిన స్వప్నను తాను పెళ్లి చేసుకున్నట్లు….గతంలో స్వప్నతో జరిగిన పెళ్ళి ఫోటోలు, అతను పెట్టిన పోలీసు కేసు ఆధారాలు చూపించాడు పృధ్వీరాజ్.

పృధ్వీరాజ్ తో రెండేళ్లు కాపురం చేసిన స్వప్న అతని వద్దనుంచి డబ్బు తీసుకుని పరారయ్యింది. ఆతర్వాత వేరే వ్యక్తితో సహజీవనం చేస్తూ, పృధ్వీరాజ్ పై కేసు పెట్టిందని అతను ఆధారాలు చూపించాడు. ఆ తర్వాత ఢిల్లీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో ఆమెపై ఆత్మకూరు పోలీసు స్టేషన్లోనూ కేసు నమోదైంది.

కరోనా సమయంలో రామాంజనేయులును ఇండియా రప్పించటం కష్టంతో కూడుకున్నది కావటంతో స్వప్నపై వచ్చిన ఆరోపణలపై దృష్టి సారించారు పోలీసులు. కదిరి సీఐ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.