Warangal Chit Funds : 10టీవీ ఎఫెక్ట్ : వరంగల్‌లో చిట్‌ఫండ్ వ్యాపారులపై పోలీసుల దాడులు

వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిధిలో చిట్ ఫండ్ కంపెనీలు చేస్తున్న మోసాలపై 10 టీవీ ప్రసారం చేసిన  కధనాలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యింది.

Warangal Chit Funds  : 10టీవీ ఎఫెక్ట్ : వరంగల్‌లో చిట్‌ఫండ్ వ్యాపారులపై పోలీసుల దాడులు

Warangal Chit Fund case

Warangal Chit Funds Cheating  :  వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిధిలో చిట్ ఫండ్ కంపెనీలు చేస్తున్న మోసాలపై 10 టీవీ ప్రసారం చేసిన  కధనాలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. చిట్‌ఫండ్ సిండికేట్‌కు సంబంధించి ముగ్గురు చిట్ వ్యాపారులపై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసారు. హన్మకొండ, సుబేదారి, మట్టెవాడ పీఎస్ పరిధిల్లో కొందరు చిట్స్ యజమానులను అదుపులోకి  తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు.

కాజీపేట,వరంగల్,హన్మకొండ   ప్రాంతాల్లో బృందాలుగా విడిపోయిన టాస్క్ ఫోర్స్ పోలీసు సిబ్బంది ముగ్గురు బడా చిట్ వ్యాపారులను అదుపులోకి తీసుకుని టాస్క్ ఫోర్స్ స్టేషన్‌లో విచారించారు. మరో ముగ్గురు చిట్‌ఫండ్ వ్యాపారుల కోసం పోలీసు బృందాలు వేట కొనసాగిస్తున్నాయి.  చిట్స్ యజమానుల విచారణలో వెలుగు చూస్తున్న విషయాలను పోలీసులు రికార్డు చేసారు.

సభ్యులు చిట్  పాడుకున్నా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు  పెడుతుండటంతో బాధితులు పెద్ద ఎత్తున పోలీసులకు ఫిర్యాదు చేశారు.  బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, చిట్ ఫండ్ యాజమానులతో వరంగల్ సీపీ తరుణ్ జోషి గతంలో ప్రజా దర్బార్ నిర్వహించారు.  సామాన్యులకు చిట్స్ డబ్బులు చెల్లించాలని చిట్స్ యజమానులకు సూచించారు.

చిట్‌ఫండ్ డబ్బు  చెల్లింపులపై చిట్‌ఫండ్ యజమానులకు పోలీసు కమీషనర్ కొంత సమయమిచ్చారు. కాగా…. చిట్స్ చీటింగ్‌పై అడ్డుకట్ట వేసేందుకు సీపీ నిర్వహించిన ప్రజాదర్బార్‌ను చిట్స్ సిండికేట్ పట్టించుకోలేదు.  వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో చిట్ ఫండ్ బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. బాధితుల్లో అత్యధికులు చిరుద్యోగులు, పోలీస్, ప్రభుత్వ ఉద్యోగులు, రైతులు ఉన్నారు.

ఖాతాదారులకు  డబ్బుల చెల్లింపునకు బదులు చిట్స్ సిండికేట్ వేసిన   రియల్ ఎస్టేట్   వెంచర్లలో ప్లాట్స్ తీసుకోవాలని చిట్స్ వేసిన వారు వేధించసాగారు.   ఈ సిండికేట్‌లో వరంగల్ లోని బడా రాజకీయ నాయకులు, చిట్స్ యజమానులు సిండికేట్‌ అయ్యి ప్రజల సొమ్ముతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయసాగారు.
Also Read : Chain Snatching : సికింద్రాబాద్‌లో వరుస చైన్‌స్నాచింగ్ లు
పేద, మధ్య తరగతి ప్రజలను ఇబ్బందులు పెట్ట వద్దన్న సీపీ తరుణ్ జోషి ఆదేశాలను భేఖాతర్ చేసిన చిట్స్ వ్యాపారులు అదే పంధా కొనసాగించసాగారు. దీంతో 10 టీవీ రంగంలోకి దిగి వరంగల్ పోలీసు కమీషనరేట్ పరిధిలో జరుగుతున్న చిట్ ఫండ్ మోసాలపై వరస కధనాలు ప్రసారం చేయటంతో ఈరోజు టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు.