Casinor Chikoti Praveen : గల్లీ నుంచి మొదలైన..క్యాసినో గాంబ్లర్ చికోటి ప్రవీణ్‌ ప్రస్థానం

పత్తాలాడించే వ్యక్తి.. కోట్లకు పగలెత్తాడు చికోటి ప్రవీణ్. పొలిటికల్ అండదండలు అడ్డంగా సంపాదించాడు. రియల్ లైఫ్‌లో హైరేంజ్‌ లైఫ్ స్టైల్, లగ్జరీ మెయింటెన్స్. ఒళ్లు గగుర్పొడిచేలా.. పాములు, కొండ చిలువలు, ఊసరవెల్లితో సావాసాలు చేసే ప్రవీణ్‌ లైఫ్‌ చికోటి చీకటి కోణాల వెనుకున్న అసలు స్టోరీ ఇదే..గల్లీ నుంచి ఇంటర్నేషనల్ గాంబ్లర్ లా ఎదిగినతీరు..

Casinor Chikoti Praveen : గల్లీ నుంచి మొదలైన..క్యాసినో గాంబ్లర్ చికోటి ప్రవీణ్‌ ప్రస్థానం

Casino Gambler Chikoti Praveen : ఆఫ్ర్టాల్ పత్తాలాడించే వ్యక్తి.. కోట్లకు పగలెత్తాడు. చికోటికి పొలిటికల్ అండదండలు మొండుగా ఉండటమే అందుకు కారణమనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు రియల్ లైఫ్‌లోనూ మనోడిది హైరేంజ్‌, లగ్జరీ మెయింటెన్స్. ఒళ్లు గగుర్పొడిచేలా.. పాములు, కొండ చిలువలు, ఊసరవెల్లితో సావాసం చేస్తున్నాడు. ప్రవీణ్‌ లైఫ్‌ మరీ ఇంత వైల్డా అని జనం నోరెళ్లబెడుతున్నారు. చికోటి చీకటి కోణాల వెనుకున్న అసలు స్టోరీ ఏంటి?

ఫామ్‌హౌస్‌లో కోట్ల విలువైన గుర్రాలు, మాట్లాడే చిలుకలు..కొండచిలువలు, ఆస్ర్టిచ్ పక్షులతో ప్రవీణ్‌ ఎంజాయ్ చేస్తాడు.లగ్జరీ కార్లల్లో షికార్లో షికార్లు,
చికోటి ఎక్కడికెళ్లినా వెంట ఉండే ప్రైవేట్‌ సైన్యం ఇవి చికోటీ లగ్జరీలో ఓ పార్ట్ మాత్రమే..ఇంకా చాలానే ఉంది. ఆయన లైఫ్‌ స్టైల్‌ చూసిన వాళ్లేవరైనా వావ్‌ అనాల్సిందే. హైదరాబాద్‌ సైదాబాద్‌లోని వినయ్‌నగర్‌ కాలనీ నుంచి చీకోటి ప్రవీణ్‌ ప్రస్థానం మొదలైంది. 20 ఏళ్ల క్రితం చిన్న సిరామిక్‌టైల్స్‌ వ్యాపారిగా ఉన్న ప్రవీణ్‌.. ఆ తర్వాత నిర్మాతగా మారి సినిమా తీశాడు. విలన్‌గా నటించి దివాలా తీశాడు. అప్పుల ఊబిలో చిక్కుకుపోయి దాన్నుంచి బయటపడేందుకు వనస్థలిపురంలో ఒక డాక్టర్‌ను కిడ్నాప్‌ చేశారన్న ఆరోపణలున్నాయి. ఆ కేసులో జైలుకు వెళ్లొచ్చాడు. ఆ తర్వాత.. గోవాలో ఓ పేకాట క్లబ్బులో కొన్ని టేబుళ్లలను లీజుకు తీసుకుని పేకాట నిర్వహించేవాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా తన క్యాసినో సామ్రాజ్యాన్ని విస్తరించాడు. అలా కోట్లకు పడగలెత్తాడు చికోటి ప్రవీణ్‌.

మొదట బేగంపేట, వనస్థలిపురం, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్‌ ప్రాంతాల్లో సెలబ్రిటీల కోసమే క్యాసినోలు ఏర్పాటు చేసి దందా సాగించేవాడు చికోటి ప్రవీణ్‌. ఇలా చిన్న చిన్న పార్టీలతో అతడి బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. 2014 తర్వాత చికోటి ప్రవీణ్‌ బిజినెస్ టర్న్ అయింది. పొలిటీషియన్స్‌తో ఉన్న పరిచయాలతో.. ప్రవీణ్‌ తన చీకటి వ్యాపారాన్ని ఏకంగా ఫారిన్‌కు విస్తరించాడు. చికోటి చీకటి బాగోతంలో పలువురు ఏపీ, తెలంగాణ మంత్రులు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు తెలుగురాష్ట్రాల్లోని 16 మంది ఎమ్మెల్యేలు, DCCB ఛైర్మన్లు సైతం కస్టమర్ల లిస్ట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వారితో ఉన్న సాన్నిహిత్యం, సహకారంతోనే చికోటి వ్యవహారం విదేశాలకు విస్తరించింది. ప్రత్యేక విమానాల్లో ఇండోనేషియా, నేపాల్‌కు తీసుకెళ్లి కోట్లలో పేకాట ఆడించడం వరకు వెళ్లాడు.

చికోటి ప్రవీణ్‌ మూడు ముక్కలాట సామ్రాజ్యం ఇంతలా ఉంటే… ఇక అతడి లైఫ్‌ స్టైల్‌ చాలా లగ్జరీ. చీకోటి కుటుంబం ప్రస్తుతం ఐఎస్‌ సదన్‌ డివిజన్‌ వినయ్‌నగర్‌ కాలనీలోని సాయికిరణ్‌ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తోంది. కడ్తాల్‌లోని ఫామ్‌హౌస్‌లో ఓ ప్రైవేట్‌ జూ ఉంది. అందులో కోట్ల విలువైన గుర్రాలతో పాటు.. మాట్లాడే చిలుకలు, కొండచిలువలు, ఆస్ర్టిచ్ పక్షులు.. ఇలా అనేక రకాల జంతువులు, పక్షులను పెంచుతున్నాడు. పెంచుకుంటున్న కొండచిలువలతో ఆడుకుంటాడు. ఆస్ర్టిచ్‌ పక్షులతో కాలక్షేపం చేస్తాడు.. కోట్ల విలువ చేసే గుర్రాలతో పరుగులు పెడతాడు. ఊసరవెల్లులను భుజంపై వేసుకొని జో కొడతాడు. పాములతో సావాసం చేస్తాడు.. తన రేంజ్‌రోవర్‌ కారు డ్యాష్‌ బోర్డుపై కొండచిలువ పారుతుందంటే.. ప్రవీణ్‌ క్యారెక్టర్‌ ఎంత వైల్డో అర్థమవుతోంది.

ఎంతో హైక్లాస్‌గా గడిపే ప్రవీణ్‌ వెంట అనునిత్యం ఓ ప్రైవేట్‌ సైన్యమే ఉంటుంది. సికింద్రాబాద్‌ మహాంకాళి బోనాలకు వెళ్లిన ప్రవీణ్‌ వెంట.. గన్‌లతో ఉన్న బాడీ గార్డ్స్‌ ఉన్నారంటే మనోడి రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కర్మాన్‌ఘాట్‌లో నిర్వహించిన ఆయన బర్త్‌డే వేడుకలు.. నభూతో నభవిష్యతి అన్న రేంజ్‌లో జరిగాయట. ఈ బర్త్‌డే పార్టీలో సెలబ్రిటీలే. బర్త్‌డే సందర్భంగా తాను ఇష్టపడి బుక్‌ చేసుకున్న రేంజ్‌ రోవర్‌ ఆటో బయోగ్రఫీ కారును సొంతం చేసుకున్నాడు ప్రవీణ్‌. క్యాసినో కింగ్‌ మేకర్‌గా ఉన్న చికోటి… గతంలో అనేకసార్లు పోలీసులకు పట్టుబడిన సందర్భాలున్నాయి. 2017లో హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో పేకాట ఆడిస్తూ పోలీసులకు చిక్కాడు. ఈ ఏడాది సంక్రాంతికి గుడివాడలో క్యాసినో నిర్వహించింది ప్రవీణే. గుడివాడ క్యాసినోతో అప్పట్లో రాజకీయ దుమారమే రేగింది.

ఇటు చికోటి ప్రవీణ్‌ పార్ట్నర్ మాధవరెడ్డి ప్రస్థానం పాలు, పెరుగు అమ్ముకునే స్థాయి నుంచి ప్రారంభమైంది. ఆ తర్వాత క్రికెట్‌ బెట్టింగులకు పాల్పడి.. లక్షల రూపాయలు కోల్పోయాడు. ఆ సమయంలో కొంతమంది పొలిటికల్ లీడర్స్‌, చికోటి ప్రవీణ్‌తో పరిచయం క్యాసినో సామ్రాజ్య విస్తరణకు దారితీసింది. ఇటీవల బోనాల పండుగలో మాధవరెడ్డి ఒంటిపై దాదాపు కిలో బంగారంతో ఆభరణాలు కనిపించడంతో అక్కడున్న వారు షాక్‌కు గురయ్యారు. మాధవరెడ్డికి రక్షణగా బౌన్సర్లనే పెట్టుకున్నాడంటే క్యాసినో మాస్టర్ మైండ్ రేంజ్‌ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొత్తంమ్మీద ఈడీ రంగ ప్రవేశంతో మరోసారి చికోటి ప్రవీణ్‌, మాధవరెడ్డి తెలుగురాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. మరి ఈడీ విచారణ తర్వాత ఇంకెలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.