Cow Saviors: పోలీసుల వలయంలో కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్

గోరక్షకులపై.. దుండగులు కత్తులతో దాడి చేసిన ఘటనలో నిందితులను శిక్షించాలంటూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు స్థానిక హనుమాన్ ఆలయం వద్ద నిరసనకు దిగగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Cow Saviors: పోలీసుల వలయంలో కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్

Goraksha

Cow Saviors: హైదరాబాద్ కర్మన్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజాము నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోరక్షకులపై.. దుండగులు కత్తులతో దాడి చేసిన ఘటనలో నిందితులను శిక్షించాలంటూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు స్థానిక హనుమాన్ ఆలయం వద్ద నిరసనకు దిగగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈక్రమంలో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు. దీంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు వజ్ర వాహనాలలో భారీగా భద్రత సిబ్బందిని రంగంలోకి దింపిన పోలీసులు.. బీజేపీ నేతలను బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు.

Also read: BJP : తెలంగాణ బీజేపీలో అసమ్మతి.. ఢిల్లీకి బండి సంజయ్ సహా కీలక నేతలు

పూర్తి వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కర్మన్ ఘాట్ పరిధిలో.. మంగళవారం అర్ధరాత్రి దాటాక గోవులను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని.. ఇన్నోవా వాహనంలో వెంబడిస్తూ గో రక్షక్ సభ్యులు అడ్డుకున్నారు. ఈక్రమంలో గో రక్షక్ సభ్యుల ఇన్నోవా వాహనాన్ని బోలెరోతో ఢీకొట్టారు దుండగులు. అనంతరం గో రక్షకులపై కత్తులతో దాడి చేసి ఇన్నోవా కారును ధ్వంసం చేశారు. దుండగులు కత్తులతో దాడి చేయడంతో.. ప్రాణాలు దక్కించుకునేందుకు గో రక్షక్ సభ్యులు స్థానిక హనుమాన్ దేవాలయంలోకి పరుగులు తీశారు. దేవాలయంలోకి ప్రవేశించిన వారిపైనా దాడి చేసిన దుండగులు.. అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న గో రక్షక్ కార్యకర్తలు అక్కడికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి.. కర్మన్ ఘాట్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చారు.

Also read: Jinnah Tower: మరోసారి తెరపైకి జిన్నాటవర్.. జాతీయ జెండా తొలగింపు

అయితే దాడికి పాల్పడిన దుండగులపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. దీంతో గోరక్షక్ కార్యకర్తలు అర్ధరాత్రి పెద్దఎత్తున పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. పోలీసులు లాఠీ ఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇక ఈ ఘటనపై బుధవారం ఉదయం సమాచారం అందుకున్న హిందూ సంఘాలు, బీజేపీ నేతలు.. కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయానికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో హిందూ సంఘాల కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని.. గో రక్షకులపై దాడికి పాల్పడ్డ నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.

Also read: Hyderabad : గోవులను తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్న గో రక్షక్ సభ్యులు.. కత్తులతో దాడి చేసిన దుండగులు

బీజేపీ నేత, మహేశ్వరం నియోజకవర్గ ఇంచార్జి అందెల శ్రీరాములు యాదవ్ కర్మన్ ఘాట్ చేరుకుని ఆందోళనకు మద్దతు ఇచ్చారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రోడ్డు పై భైఠాయించారు. బీజేపీ నేతల రాకతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కర్మన్ ఘాట్ పరిసర ప్రాంతాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. బీజేపీ నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మీర్ పెట్ పోలీస్ స్టేషన్ లో దుండగుల పై గో రక్షక్ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.