హింసాప్రవృత్తికి నిదర్శనం : కత్తితో యువకుడు వీరంగం

  • Published By: madhu ,Published On : February 15, 2019 / 02:59 AM IST
హింసాప్రవృత్తికి నిదర్శనం : కత్తితో యువకుడు వీరంగం

కత్తి వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడూ వాడలేడు అనే సినిమా డైలాగ్‌ను బాగా పట్టించుకున్నాడో ఏమో కానీ ఓ యువకుడి కత్తి వీరంగానికి ఒకరు బలయ్యారు. మరొక యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. దీనికంతటికీ కారణం ప్రమే వ్యవహారమే కారణమని తెలుస్తోంది. ఆ యువకుడిలో హింసా ప్రవృత్తి నిదర్శనాలివి. ఈ ఘటన నల్గొండ జిల్లా కనగల్ మండలం దొరెపల్లిలో చోటు చేసుకుంది. వరుసకు మరదలయ్యే అమ్మాయితో లక్ష్మణ్ సన్నిహితంగా మెలిగేవాడు. ప్రవీణ్ అనే యువకుడు కూడా ఆ అమ్మాయితో చనువుగా మెలుగుతూ ప్రేమిస్తున్నానని చెప్పినట్లు సమాచారం.

వారం రోజుల క్రితం లక్ష్మణ్, అతని సోదరుడు చందూ.., ప్రవీణ్‌లు.. గతంలో ఘర్షణ పడ్డారు. ఫిబ్రవరి 13వ తేదీ బుధవారం లక్ష్మణ్, చందూలు వాహనంపై వెళుతున్నారు. ప్రవీణ్ తారసపడ్డాడు. ముగ్గురి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తన వద్ద ఉన్న కత్తితో ప్రవీణ్ మొదట లక్ష్మణ్ ఛాతిలో పొడిచేశాడు. దీనితో లక్ష్మణ్ అక్కడికక్కడనే కుప్పకూలిపోయాడు. అనంతరం చందూ కడుపులో పొడిచాడు. ఈ దాడిని అడ్డుకోవడానికి వచ్చిన శివాజీ, శ్రీధర్‌లపై ప్రవీణ్ కత్తితో అటాక్ చేశాడు. తీవ్రగాయాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చందూ పరిస్థితి విషమంగా ఉంది. లక్ష్మణ్ చనిపోవడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. 

ఇక్కడ ప్రవీణ్ వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. పెద్ద కత్తితో పుట్టిన రోజు కేక్ కోయడం, చేతితో కత్తి పట్టుకుని స్టూల్‌పై కాలు పెట్టడం..మోటార్ సైకిల్‌పై హీరోలా ఫోజులివ్వడం…వంటి చిత్రాలు హల్ చల్ చేస్తున్నాయి. కేవలం సరదా కోసమే చేస్తున్నారి అనుకున్నారే కానీ అతనిలో హింసాప్రవృత్తి దాగి ఉందనే విషయాలు గుర్తించలేకపోయారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పిల్లల తీరును పేరెంట్స్ గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.