బిడ్డల కోసం భార్య ఇంటి ముందు ఐపీఎస్ అధికారి ధర్నా

  • Published By: chvmurthy ,Published On : February 10, 2020 / 10:40 AM IST
బిడ్డల కోసం భార్య ఇంటి ముందు ఐపీఎస్ అధికారి ధర్నా

ఐపీఎస్ అధికారికీ కుటుంబ కష్టాలు తప్పలేదు. ఒక చిన్న కారణం వారి కుటుంబంలో చిచ్చు రేపింది. వారిద్దరినీ వేరు చేసింది. చివరికి కన్నబిడ్డల్ని చూడటానికి భార్య ఇంటి ముందు అర్ధరాత్రి వేళ ఐపీఎస్ భర్త ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సమాజంలో వచ్చే గృహ హింస కేసులను పరిష్కరిస్తున్న పోలీసు అధికారుల కుటుంబాల్లోనే ఇలాంటి కష్టాలు వస్తే ఇంక వాళ్లు ఎవరికి చెప్పుకుంటారు. భార్యా భర్తలిద్దరూ ఐపీఎస్ అధికారులే అవటంతో స్థానిక పోలీసులు ఎవరికీ సర్ది చెప్పలేక తలలు పట్టుకున్నారు.

ips
 

భర్త అరుణ్ రంగరాజన్ కర్ణాటకలోని కాలబురిగి ఇంటిలిజెన్స్ విభాగంలో ఎస్పీ గా విధులు నిర్వహిస్తుంటే, భార్య ఇలాకియా కరుణాకరన్ బెంగుళూరులోని వీవీఐపీ భద్రతా విభాగంలో డీసీపీగా పని చేస్తున్నారు. వీరిద్దరూ 2012 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు. వీరిద్దరికి సర్వీసులో మంచి పేరుంది. అరుణ్ రంగరాజన్ చత్తీస్ ఘడ్ కేడర్ ఆఫీసర్ కాగా, ఇలాకియా కర్ణాటక కేడర్ ఆఫీసర్. ఇద్దరూ చత్తీస్ ఘడ్ లో పని చేస్తున్న సమయంలో ప్రేమించుకున్నారు. పెళ్లికి ఇరువైపుల పెద్దలను ఒప్పించారు. ఇద్దరూ ఐపీఎస్ అధికారులే కాబట్టి పెద్దలు అభ్యంతరం చెప్పలేదు. అంగీకరించి పెళ్లి జరిపించారు. పెళ్లైన తర్వాత కర్ణాటకకు బదిలీ చేయించుకోవాలని.. భార్య ఇలాకియా.. తన భర్త అరుణ్ కు చెప్పారు.

కర్ణాటకకు బదిలీ చేయించుకోవటం అరుణ్ కి ఇష్టం లేదని తెలిసింది. ఆ సమయంలో అరుణ్ కు ఇష్టం లేకపోయినా ఆయన సంతకంతోనే ఇలాకియా బదిలీ కోసం ప్రభుత్వానికి లేఖ రాశారట. అక్కడ ఉన్న సమయంలోనే వారికి ఒక సంతానం కలిగింది. కర్ణాటకకు అప్పట్లో ట్రాన్సఫర్ అవటానికి అవకాశం లేక పోవటంతో కొంతకాలానికి వారిద్దరూ ఉన్నతాధికారులను కలిసి కర్ణాటకకు బదిలీ చేయించుకున్నారు. ఇష్టం లేకపోయినా అరుణ్ కర్ణాటకకు వచ్చారు. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు మరింత పెరిగాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి విడాకుల వరకు వెళ్లింది. 2015లో కోర్టులో విడాకులు తీసుకున్నారు.
 

కాగా, రెండు కుటుంబాల పెద్దలు జోక్యం చేసుకుని ఇద్దరికీ రాజీ కుదిర్చారు. దీంతో అరుణ్, ఇలాకియా మళ్లీ ఒకటయ్యారు. విడాకులు తీసుకుని ఒక్కటైన వీరికి మళ్లీ ఒక పాప పుట్టింది. ఈలోగా అరుణ్ కాలబురిగి ఇంటిలిజెన్స్ డిపార్ట్ మెంట్ ఎస్పీగా బదిలీ అయ్యారు. 

ఇలాకియా బెంగుళూరు లో.. అరుణ్ కాలబురిగి లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో 2020, ఫిబ్రవరి 9 సాయంత్రం అరుణ్ కాలబురిగి నుంచి బెంగుళూరు వసంత నగర్ లో ఉన్న భార్య దగ్గరికి వచ్చారు. అయితే భార్య ఇలాకియా భర్తను లోపలికి రానివ్వలేదు. దీంతో తన పిల్లల్ని చూసే వరకు వెళ్లేది లేదని ఇంటి ముందు అరుణ్ రంగరాజన్ బైఠాయించారు.
 

ఇలా ఉండగా.. తన మాజీ భర్త వేధిస్తున్నాడని డీఎస్పీగా ఉన్న ఇలాకియా పోలీస్ కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు ఇద్దరికీ నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అరుణ్ మాత్రం పిల్లల్ని చూసేంత వరకు నిరసన కొనసాగిస్తానని చెప్పటంతో.. సీనియర్ ఐపీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. పిల్లల్ని చూపిస్తామని నచ్చ చెప్పటంతో తెల్లవారుజామున 3 గంటల సమయంలో అరుణ్ తన ధర్నా విరమించారు. ఐపీఎస్ దంపతుల గొడవ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.