రాయదుర్గంలో నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడీ, డిన్నర్‌లో మత్తుమందు కలిసి రూ.30లక్షల విలువైన బంగారం చోరీ

  • Published By: naveen ,Published On : October 6, 2020 / 01:14 PM IST
రాయదుర్గంలో నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడీ, డిన్నర్‌లో మత్తుమందు కలిసి రూ.30లక్షల విలువైన బంగారం చోరీ

nepali gang: హైదరాబాద్ రాయదుర్గంలో నేపాలీ గ్యాంగ్ భారీ చోరీకి పాల్పడింది. ఓ ఇంట్లో పని మనుషులుగా చేరిన దంపతులు దొంగతనానికి ఒడిగట్టారు. నిన్న(అక్టోబర్ 5,2020) రాత్రి డిన్నర్ లో మత్తుమందు కలిపి చోరీ చేశారు. ఇంటి యజమానులు స్పృహ కోల్పోయాక దంపతులు తమ పని కానిచ్చారు. రూ.30లక్షల విలువైన బంగారం చోరీ చేసి పారిపోయారు.




సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అగ్ర వ్యాపారవేత్తలే టార్గెట్:
నేపాలీ గ్యాంగ్ టార్గెట్ సినీ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అగ్ర వ్యాపారవేత్తలే. ఈ ముఠా సంపన్నులు నివసించే ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకొని దోపిడీలకు పాల్పడుతుందని పోలీసులు తెలిపారు. నగరంలోని పలువురు సంపన్నుల ఇళ్ల దగ్గర నేపాల్‌కు చెందిన వారు సెక్యూరిటీ గార్డులుగా, పని వారిగా చేస్తున్నారు. ఈ ముఠా సభ్యులు వారిని సంప్రదించి తమను ఎక్కడైనా సెక్యూరిటీ గార్డుగా, ఇళ్లల్లో పని చేయడానికి నియమించాలంటూ నమ్మిస్తారు. వారి ద్వారా విధుల్లో చేరిన తర్వాత సదరు ఇంటి పూర్తి సమాచారం, యజమానుల కదలికలు తెలుసుకొని దొంగతనాలు చేసి ఉడాయిస్తారు.

గతంలో బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఉత్తమ్‌ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 28లో విల్లామేరి కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఫిలోమినా ఇంట్లో రూ.30 లక్షల విలువైన ఆభరణాలు, ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రూ.25 లక్షల విలువైన వస్తువులు దొంగిలించారు.




సెక్యూరిటీ గార్డులుగా చేర్చుకునే ముందు జాగ్రత్త:
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ప్రశాసన్‌నగర్, పంజాగుట్ట, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, సోమాజిగూడ, బేగంపేట తదితర ప్రాంతాల్లో సంపన్నులు తమ ఇళ్ల దగ్గర సెక్యూరిటీ గార్డులుగా విధులు నిర్వహించే నేపాలీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. వారి పూర్తి వివరాలు, గత చరిత్ర తెలుసుకున్న తర్వాతే పనిలో చేర్చుకోవాలన్నారు. సెక్యూరిటీ గార్డులుగా చేర్చుకునే ముందు ఇతర నేపాలీలను సంప్రదించాలని సూచించారు.