రాష్ట్రంలో సంచలనం రేపిన తహశీల్దారు సజీవదహనం కేసులో కొత్త కోణం

  • Published By: veegamteam ,Published On : November 4, 2019 / 03:56 PM IST
రాష్ట్రంలో సంచలనం రేపిన తహశీల్దారు సజీవదహనం కేసులో కొత్త కోణం

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తహశీల్దార్ హత్య కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భూవివాదం కారణంగా సురేశ్ అనే రైతు తహశీల్దారు విజయారెడ్డిని సజీవదహనం చేశాడని పోలీసులు చెబుతుంటే.. నిందితుడు సురేశ్ కుటంబసభ్యులు మాత్రం కొత్త కోణం తెరపైకి తెచ్చారు. అసలు ఈ ఘటనకి సురేశ్ కి సంబంధమే లేనట్టుగా చెబుతున్నారు. సురేశ్ కి మతిస్థిమితం లేదంటున్నారు. భూ వివాదంతో సురేశ్ కి సంబంధం లేదని వాదిస్తున్నారు. తహశీల్దార్ హత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తహశీల్దార్‌ విజయారెడ్డి హత్యపై నిందితుడు సురేశ్‌ పెదనాన్న స్పందించారు. భూవివాదం నేపథ్యంలోనే హత్య జరిగిందని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. భూ వివాదం ఎప్పటినుంచో నడుస్తోందని.. అయితే అది తాను, తన తమ్ముడే చూసుకుంటున్నామని వివరించారు. సురేశ్‌ ఏరోజు కూడా ఈ వివాదం విషయంలో తలదూర్చలేదని స్పష్టం చేశారు.

అంతేకాదు సురేశ్‌కు మతిస్థిమితం సరిగా లేదని ఆయన తండ్రి అన్నారు. తహశీల్దార్‌ను ఎందుకు హత్య చేశాడో తనకు అర్ధం కావడం లేదన్నారు. దీనిపై అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. సురేశ్‌ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడంటే నమ్మలేకపోతున్నానని చెప్పారు.

భూవివాదం తహశీల్దార్‌ హత్యకు దారి తీసిందని పోలీసులు అంటున్నారు. సురేశ్..  తహశీల్దార్‌ విజయారెడ్డిపై పెట్రోల్‌ పోసి తగులబెట్టాడు. ఈ ఘటనలో తహశీల్దార్‌ విజయ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. తహశీల్దార్‌ను కాపాడే ప్రయత్నంలో ఇద్దరు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో తహశీల్దార్‌ చాంబర్‌లోకి వెళ్లిన దుండగుడు విజయపై పెట్రోల్‌ పోసి.. నిప్పంటించాడు. భూ రిజిస్ట్రేషన్‌ విషయంలో విజయారెడ్డి వేధించారని సురేశ్‌ ఆరోపిస్తున్నాడు. తన ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యహరిస్తుండడంతోనే హత్య చేసినట్లు నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. తహశీల్దార్‌ విజయపై దాడి చేసిన తర్వాత.. సురేశ్‌ కూడా తనకు తాను నిప్పంటించుకున్నాడు. అడ్డుపడిన డ్రైవర్‌పై కూడా దాడికి పాల్పడ్డాడు.
    
నిందితుడు సురేశ్‌ గౌరెల్లికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌, డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుండగుడు తహసీల్దార్‌ కార్యాలయంలోకి ఎలా ప్రవేశించాడనే అంశంపై ఆరా తీశారు. ఓ సంచితో లోపలికి ప్రవేశించినట్లు కార్యాలయ సిబ్బంది పోలీసులకు తెలిపారు.

తహసీల్దార్‌ విజయారెడ్డి సజీవదహనం ఘటనపై కార్యాలయ సిబ్బంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. తహసీల్దార్‌ హత్యకు కారణమైన వ్యక్తిని ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని నినాదాలు చేశారు.