నర బలులు: 40పుర్రెలు, ఎముకలతో నిండిపోయిన స్మగ్లర్ల డెన్

  • Published By: veegamteam ,Published On : October 28, 2019 / 07:36 AM IST
నర బలులు: 40పుర్రెలు, ఎముకలతో నిండిపోయిన స్మగ్లర్ల డెన్

డ్రగ్స్ మాఫియాకి అడ్డాగా చెప్పుకునే మెక్సికోలో ఓ కేసులో దర్యాప్తు మొదలుపెడితే మరో కోణం వెలుగు చూసింది. ప్రపంచంలోని చాలా దేశాలకు అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేసే మెక్సికోలో జరిగిన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా సంచలనంగా మారింది. డ్రగ్స్ స్మగ్లింగ్ జరుగుతుందనే అనుమానంతో మంగళవారం (అక్టోబర్ 22, 2019)న మెక్సికోలోని ఓ డెన్‌లో పోలీసులు సోదాలు జరిపారు. 

అక్కడకు వెళ్లి చూస్తే షాక్.. 40కి పైగా పుర్రెలు, డజన్ల కొద్దీ ఎముకలు, గ్లాస్‌లో నిల్వ ఉంచిన పిండం కనిపించాయి. వీటికి కారణం డ్రగ్స్ స్మగ్లర్ల మూడనమ్మకాలే. స్మగ్లింగ్ చేస్తున్నారనే అనుమానంతో గత వారం 31మంది వ్యక్తులను అరెస్టు చేశారు. విచారణలో కీలక వ్యక్తులైన నలుగురి నుంచి ముఖ్యమైన సమాచారం రాబట్టారు. వాళ్ల స్థావరం గురించి తెలుసుకున్న పోలీసులు రైడ్ చేశారు. అక్కడ కనిపించిన పుర్రెలు, ఎముకలు ఎవరివని దర్యాప్తు చేశారు. 

అప్పుడే అసలు విషయం బయటకొచ్చింది. ఆ డెన్ లో ఓ చెక్కపై మొహం ఆకారం ఉంది. అదే దేవుడిగా భావించి మనుషుల్ని బలి ఇచ్చేవాళ్లట. దాని పక్కన గోడపై ఓ పెయింటింగ్.. అందులో పిరమిడ్ ఆకారం దాని పైన ఓ చెయ్యి గుర్తు ఉంది.

మెక్సికో ఇతర దక్షిణ అమెరికా దేశాల్లో పూర్వం ప్రజలు మనుషులు బతికి ఉండగానే వాళ్ల గుండెను బయటకు తీసి సూర్యుడికి చూపించేవాళ్లు. పిరమిడ్ పై భాగంలో మనిషి తల నరికి కిందకు విసిరేవాళ్లు. ఇలా చేస్తే దైవం కరుణిస్తుందని నమ్మేవారట. ఇప్పటికీ అలాంటి మూడ నమ్మకాలు ఉన్నవాళ్లు దక్షిణ అమెరికాలో చాలా మంది ఉన్నారని.. పోలీసులు కనిపెట్టిన డెన్‌లో కూడా అలాంటివి జరుగుతున్నట్లుగా భావిస్తున్నారు.