Hyderabad : హైదరాబాద్ సనత్ నగర్ లో దారుణం.. బాలుడు అనుమానాస్పద మృతి, నరబలిగా అనుమానం!
బాలుడు గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లినట్లుగా బాధిత బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదృశ్యమై 24 గంటలు కాకముందే సమీపంలోని నాలాలో బాలుడు మృతదేహాన్ని స్థానికులు గమనించారు.

Hyderabad
Hyderabad : హైదరాబాద్ సనత్ నగర్ లో దారుణం జరిగింది. అమావాస్య రోజు బాలుడు అబ్దుల్ వహీద్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా హిజ్రాపై ఆరోపణలు కలకలంగా మారాయి. నాలాలో బాలుడి మృత దేహం లభ్యం అయ్యింది. దీంతో అక్కడి స్థానికులు హిజ్రా ఇంటిని ధ్వంసం చేశారు. హైదరాబాద్ సనత్ నగర్ లో 8 ఏండ్ల అబ్దుల్ వహీద్ తప్పిపోయినట్లుగా బంధువులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ బాలుడి మృతదేహం సమీపంలోని నాలాలో పడి ఉండటాన్ని స్థానికులు గ్రహించారు.
ఇంటి పక్కన ఉన్న హిజ్రాలే బాలుడిని ఎత్తుకెళ్లి చంపారని బాలుడి బంధువులు హిజ్రా ఇంటిపై దాడి చేశారు. అదే విధంగా హిజ్రాలను చితకబాదారు. దీంతో సనత్ నగర్ లోని అబ్దుల్ కోఠిలో ఉద్రిక్తత నెలకొంది. బాలుడు గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లినట్లుగా బాధిత బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అదృశ్యమై 24 గంటలు కాకముందే సమీపంలోని నాలాలో బాలుడు మృతదేహాన్ని స్థానికులు గమనించారు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఇంటిపక్కనే ఉన్న హిజ్రాలే అమవాస్య కావడంతో బాలుడిని ఎత్తుకెళ్లి చంపేశారని ఆరోపించారు. బాలుడి ఒంటిపై కొన్ని గాయాల ఆనవాళ్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతానికి ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.