MLAs in Drugs case : డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు ?

MLAs in Drugs case : డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేలు ?

Drugs Telangana Mla S

Telangana MLAs Involved in Drugs case ? : బెంగళూరు డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలూ ఈ మత్తు గబ్బులో చిక్కుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు.. పూర్తిస్థాయిలో కూపీ లాగుతున్నారు. కొన్ని రోజుల క్రితం డ్రగ్స్ సరఫరా చేస్తున్న నైజీరియన్లను పోలీసులు పట్టుకున్నారు. వారిని విచారించగా కీలక విషయాలు బయటకు వచ్చాయి.

బెంగళూరులో పబ్ లు, హోటళ్లను నిర్వహిస్తున్న హైదరాబాద్ వ్యాపారవేత్తలు  సందీప్, కలహర్ రెడ్డిలకు, కన్నడ సినీ నిర్మాత శంకర్ గౌడ్ కు డ్రగ్స్ సప్లై చేసినట్టు నైజీరియన్లు పోలీసుకు చెప్పేశారు. ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసిన పోలీసులు.. ఇప్పటికే సందీప్‌ను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అనేక సంచలన విషయాలు బయటకు వచ్చాయి. తెలంగాణకు చెందిన  ప్రజాప్రతినిధులకు, ప్రముఖులకు   కలహార్ రెడ్డి పార్టీలు ఇచ్చేవాడని సందీప్ పోలీసులకు విచారణలో చెప్పినట్లు తెలుస్తోంది.

తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఈ పార్టీల్లో పాల్గొన్నారని, నలుగురు ఎమ్మెల్యేలు డ్రగ్స్ తీసుకున్నారని సందీప్ వెల్లడించాడంటున్నారు. ఓ ఎమ్మెల్యే కోరిక మేరకు పలుమార్లు  కొకైన్ పంపించానని సందీప్ అంగీకరించాడు.

కలహర్ రెడ్డి, శంకర్ గౌడ్ తో పాటు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కూడా బెంగళూరు పోలీసులు ప్రశ్నించనున్నారు. వీరికి త్వరలోనే నోటీసులు జారీ చేయనున్నారు. మరోవైపు,.. ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరనే విషయం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కాగా …డ్రగ్స్ కేసులో నటుడు తనీష్‌ను బెంగళూరు పోలీసులు ఇప్పటికే పిలిచి ప్రశ్నించారు. ఈ కేసులోనే ఇప్పుడు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ కేసుకు హైదరాబాద్‌తో ప్రధానంగా లింకులు కనిపిస్తూండటంతో బెంగళూరు పోలీసులు అరెస్టులకు కూడా సిద్ధమవుతున్నారు.

నలుగురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే అరెస్ట్ కోసం బెంగళూరు పోలీసులు ఏర్పాట్లు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలు ఎవరన్నదానిపై స్పష్టత ఉన్నప్పటికీ.. వారి అరెస్ట్ కు మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది.

నేడో..రేపో అందుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ వెలువడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడినని చెప్పుకునే ఒక వ్యక్తికి తన వ్యాపారంలో భాగంగా సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయాలు డ్రగ్స్ మార్కెట్‌లో పాలు పంచుకునేదాకా తీసుకెళ్లాయని తెలుస్తోంది.

డ్రగ్స్ కేసును సీరియస్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు… శాండల్ ఉడ్ లో సినీతారల్ని కూడా అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తీగ లాగుతూంటే కేసు ఎక్కడెక్కడికో వెళ్తోంది. తాజాగా డ్రగ్స్ కేసులో తెలంగాణ ఎమ్మెల్యేల   పేర్లు వినపడటం సంచలనంగా మారింది.   పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నట్లుగా భావిస్తున్న ఎమ్మెల్యేలను   అరెస్ట్ చేస్తే.. రాజకీయాల్లో అది పెను సంచలనమవుతుందని  విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.