26ఏళ్లకే.. లండన్ లో గుండెపోటుతో వరంగల్ విద్యార్థి మృతి

ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన వరంగల్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. భారత కాలమానం ప్రకారం నిన్న(ఏప్రిల్ 12,2020) తెల్లవారుజామున నిద్రలో ఉండగానే

  • Published By: veegamteam ,Published On : April 13, 2020 / 05:00 AM IST
26ఏళ్లకే.. లండన్ లో గుండెపోటుతో వరంగల్ విద్యార్థి మృతి

ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన వరంగల్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. భారత కాలమానం ప్రకారం నిన్న(ఏప్రిల్ 12,2020) తెల్లవారుజామున నిద్రలో ఉండగానే

ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన వరంగల్ విద్యార్థి గుండెపోటుతో మృతి చెందాడు. భారత కాలమానం ప్రకారం నిన్న(ఏప్రిల్ 12,2020) తెల్లవారుజామున నిద్రలో ఉండగానే గుండెపోటుకు గురయ్యాడు. నిద్రిస్తున్న సమయంలో మంచంపై నుంచి కిందపడిపోవడంతో గమనించిన స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థిని రాయల్ ప్రిస్టిన్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

వరంగల్ జిల్లాలోని ఐనవోలు మండలం రాంనగర్‌కు చెందిన కాయిత సతీశ్ (26) 2019 జనవరిలో ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లాడు. ఇంతలో అకాల మరణం చెందాడు. సతీశ్ మృతి విషయాన్ని అతడి స్నేహితులు అతడి తల్లిదండ్రులు కుమారస్వామి, శారదకు వీడియో కాల్ ద్వారా తెలిపారు. విషయం విన్న వారు గుండె పగిలేలా రోదించారు. ఇటీవలే కుమారుడితో మాట్లాడామని, కరోనా వైరస్ నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సూచించామని, అంతలోనే ఇలా జరిగిందని కన్నీరుమున్నీరయ్యారు. సతీశ్ అన్న రంజిత్ అమెరికాలో ఉంటాడు. చిన్న తమ్ముడు దేవేందర్ లండన్‌లోనే మరో ప్రాంతంలో ఎంఎస్ చదువుతున్నాడు. సతీశ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడంలో సహకరించాలని అతడి తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వాన్ని వేడుకున్నారు.

శనివారం(ఏప్రిల్ 11,2020) సాయంత్రం వీడియో కాల్‌ ద్వారా తల్లిదండ్రులు కుమారస్వామి, శారదతో సతీశ్ మాట్లాడాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి పట్ల జాగ్రత్తగా ఉండాలని తమ కుమారుడికి సూచించామని, ఇక్కడ మేమంతా క్షేమంగానే ఉన్నామని చెప్పామని సతీశ్‌ తల్లిదండ్రులు విలపించారు. సతీశ్ తల్లిదండ్రులు రేకుల షెడ్డులో ఉంటారు. వ్యవసాయ పనులు చేస్తూ కుమారులను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. సతీశ్ అకాల మరణంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో విషాదం అలుముకుంది.

కొడుకు ప్రయోజకుడైతే చూడాలని తల్లిదండ్రులు కలలు కన్నారు. ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. కానీ ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. 26ఏళ్లకే సతీశ్ కు నూరేళ్లు నిండాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీంతో మృతదేహాన్ని స్వస్థలం తీసుకొచ్చేందుకు సాయం చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు సతీశ్ తల్లిదండ్రులు.

Also Read | లాక్‌డౌన్ ఉల్లంఘించేవారికి పోలీసుల కొత్త శిక్షలు.. ‘Masakali 2.0’ వినాల్సిందే!