గ్రేట్ : 105 ఏళ్ల బామ్మ..4వ తరగతి పూర్తి

  • Published By: madhu ,Published On : February 6, 2020 / 02:24 PM IST
గ్రేట్ : 105 ఏళ్ల బామ్మ..4వ తరగతి పూర్తి

చదువుకు వయస్సుతో ఏమి పని ఉందని నిరూపించారు ఓ బామ్మ. ఏకంగా 105 ఏళ్ల వయస్సులో 4వ తరగతి పరీక్షను కంప్లీట్ చేసి ఉత్తీర్ణత సాధించి రికార్డు సృష్టించారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాష్ట్ర అక్షరాస్యత మిషన్ అథార్టీ చరిత్రలో పురాతన విద్యార్థిగా ఈ బామ్మ అవతరించింది. గత ఏడాది నవంబర్ నెలలో KSLMA రిసోర్స్ పర్సన్‌ల సహాయంతో మలయాళం, ఇంగ్లీష్, ఎన్విరాన్ మెంట్, మ్యాథమెటిక్స్‌లలో మూడు పేపర్లను బామ్మ కంప్లీట్ చేసింది. పరీక్షా ఫలితాలను 2020, ఫిబ్రవరి 05వ తేదీ బుధవారం ప్రకటించారు. 275 మార్కులకు గాను..205 మార్కులు సాధించారు. 

భగీరథి అమ్మ తన చిన్నతనంలోనే చదువుకు దూరమయ్యారు. తోడపుట్టిన వారిని చూసుకొనేందుకు..మూడో తరగతి నుంచే చదువు మానేశారు చాలా చిన్న వయస్సులోనే భర్తను కోల్పోయారు. ఆరుగురు పిల్లలను పెంచడంలోనే కాలం గడిసిపోయింది. అయితే..KSLMA కోర్సు ద్వారా ..2019లో తిరిగి క్లాస్ రూంలోకి ప్రవేశించారు. 70 సంవత్సరాలున్న కుమార్తె ఆమెకు సహకరించారు. 275 మార్కులకు గాను..205 మార్కులు సాధించడమే కాకుండా..మ్యాథ్స్‌లో పూర్తి మార్కులు సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అక్షరాస్యత మిషన్ డైరెక్టర్ పి.ఎస్. శ్రీ కళ బామ్మ ఇంటికి వెళ్లి మరీ ఆమెను అభినందించారు. 

చదువుకోవడానికి భగీరథి చాలా ఆసక్తి కనబరిచారని రిసోర్స్ వ్యక్తులు వెల్లడించారు. 4వ తరగతి సమానత్వ పరీక్షను 11 వేల 593 మంది రాస్తే..10 వేల 012 మంది క్లియర్ చేశారని, ఉత్తీర్ణత శాత 86గా ఉందని అధికారులు వెల్లడించారు. అందులో 9 వేల 456 మంది మహిళలు ఉన్నారని తెలిపారు. భగీరథి అమ్మకు ఆరుగురు పిల్లలు కాగా..15 మంది మనవరాళ్లు ఉన్నారు. వారిలో ముగ్గురు చనిపోయారు. 

2018 సంవత్సరం అక్టోబర్‌లో అక్షరాస్యత మిషన్ అక్షర లక్ష్యం అక్షరాస్యత కార్యక్రమంలో నిర్వహించిన పరీక్షలో చెప్పాడ్ ప్రాంతానికి చెందిన 96 సంవత్సరాలున్న కార్తియని అమ్మ…100 మార్కులకు గాను..98 మార్కులు సాధించారు.