సీఎం సారు చెప్పిన ‘బలుసు ఆకు’ అంటే ఏంటో తెలుసా?

సీఎం సారు చెప్పిన ‘బలుసు ఆకు’ అంటే ఏంటో తెలుసా?

కరోనా వైరస్ మహమ్మారి వస్తుందరయ్యా.. జర ఇంట్లోనే ఉండండి.. బయటకు రాకండి అని ప్రభుత్వం నెత్తి నోరు బాదుకుని చెబుతున్నా వింటేనా? పోలీసులు రోడ్లపై పరిగెత్తించి లాఠీలకు పనిచెబుతున్నా కొందరు అవసరం ఉన్నా లేకున్నా రోడ్లపైకి వచ్చేస్తున్నారు.. కరోనాను నయం చేసే మందు మనదగ్గర లేదు.. దవాఖానల్లో చేరి అందుబాటులో ఉన్న మందులు మింగడం తప్ప.. గుంపులుగా బయటకు వస్తే.. ఒకరి నుంచి మరొకరికి కరోనా సోకుతుంది.. అందుకే ఇంట్లోనే ఉండండి.. 21 రోజుల లాక్ డౌన్ వరకు బయటకు రావద్దని మోడీ సార్ కూడా చెప్తిరి..

ఆయన మాట వింటేనే కదా.. చాలామంది లాక్ డౌన్ అనగానే అదేదో ఇంట్లో పెట్టి లాక్ వేసినట్టుగా బెదిరిపోతుంటిరి.. లాక్ డౌన్ ఎప్పుడు ఎత్తివేస్తారా? రోడ్లపై ఎప్పుడు తిరుగుదామా? అని ఎదురుచూడబట్టే.. కరోనా కేసులేమో రోజుకు పెరిగిపోతున్నాయి.. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు తీసిందా కరోనా రక్కసి.. కరోనా కోరలు పీకాలంటే అందరూ ఇంట్లోనే ఉండాలి. కరోనా బారినపడి ప్రాణాలు పొగట్టుకునే కంటే ఇంట్లోనే ఉండి బతికి బట్ట కట్టొచ్చు..

బతికి ఉంటే బలుసు ఆకు అయినా తిని బ్రతకవచ్చు అని సీఎం సారూ సెలవిచ్చారు. ఇంతకీ నిజంగా బలుసు ఆకు అనేది ఉందా? అంటే అవుననే చెప్పాలి. బతికి ఉంటె బలుసు ఆకులని తిని బతికేస్తామనే సామెత తెలియని వారు ఉండరు. అసలు ఈ బలసు ఆకు అంటే ఏంటి? నిజంగా బలుసు ఆకు తినొచ్చా? పేరు వినడమే తప్పా బలుసు ఆకు గురించి చాలామందికి తెలియకపోవచ్చు. అది ఎలా ఉంటుంది? అందులో ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయి.. ఏంటో తెలియకపోవచ్చు.. బలుసు ఆకుతో కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఏంటో ఓసారి చూద్దాం..

బలుసు ఆకు శాస్త్రీయ నామం..  ఇదే :
బలుసు ఆకు శాస్త్రీయ నామం.. Webera Tetrandra, Canthium Parviflorum.. దీన్ని సంస్కృతంలో వృక్షగ్రంధి అని కూడా పిలుస్తారు. దీని వేరు నుండి లేదా మాను చెక్క నుండి.. ఆకుల నుండి తీసిన కషాయంతో ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ముఖ్యంగా అతిసార, నీళ్ల విరేచనాలను వెంటనే అరికట్టేస్తుంది. బలుసు ఆకుతో కూర చేసుకోవచ్చు. ఇది పైత్యాన్ని, జ్వరాన్ని తగ్గిస్తుంది కూడా. బలుసు కాయలతో కూడా కూర చేసుకుంటారు. వగరుగానూ ఎంతో రుచిగా ఉంటుంది. బలుసు పండు కాస్త వగరుగా ఉన్నప్పటికీ మధురంగా ఉంటుంది. అంతేకాదు.. బలుసు ఆకుల్లో ఇనుము ఎక్కువగా ఉంటుంది. “ఫైతృకం” అనేది దీని సంస్కృత నామం. ఇది దేవతలకి ప్రియమైనదిగా చెబుతుంటారు. బలుసు కూర ఆకులను వేయించి పచ్చడి కూడా చేస్తారు.

బలుసు ఆకులను కూరలా వండుకుని తింటే గౌట్‌ వ్యాధి తగ్గిస్తుంది. ఆకు రసాన్ని రోజూ 10మిల్లీలీటర్ల చొప్పున చక్కెరతో కలిపి తాగితే మూత్రపు మంట తగ్గిపోతుంది. బలుసు వేరు రసాన్ని లేదా కషాయాన్ని తాగితే పొట్టలోని క్రిములన్నీ నశిస్తాయి. రోజుకు ఐదు నుంచి ఆరు బలుసు ఆకుల చొప్పున అప్పుడప్పుడు తింటూ ఉంటే అజీర్తి తగ్గి ఆకలి బాగా పెరుగుతుంది. బలుసు పండ్లను తింటూ ఉంటే మలబద్ధకం సమస్య నివారించుకోవచ్చు. బలుసు కూరను పచ్చడిగా చేసుకుని ఆహారంలో కలుపుకుని తింటే వానాకాలంలో వచ్చే అనేక వ్యాధులకు స్వస్తిచెప్పొచ్చు.

Also Read | ఇంటి నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తుండగా జర్నలిస్టు పక్కనే నిలబడిన కుక్కపిల్ల