Free Diagnostic Centres : నేటి నుంచి ఖరీదైన వైద్య పరీక్షలన్నీ ఫ్రీ.. 19 జిల్లాల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలు ప్రారంభం

నేడు(జూన్ 9,2021) తెలంగాణలో 19 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నస్టిక్స్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి వీటి ద్వారా కొవిడ్ సహా 57 రకాల వైద్య పరీక్షలను ఫ్రీగా చేస్తారు.

Free Diagnostic Centres : నేటి నుంచి ఖరీదైన వైద్య పరీక్షలన్నీ ఫ్రీ.. 19 జిల్లాల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలు ప్రారంభం

Free Diagnostic Centres

Free Diagnostic Centres : నేడు(జూన్ 9,2021) తెలంగాణలో 19 జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాగ్నస్టిక్స్ సెంటర్లు ప్రారంభం కానున్నాయి. ఇవాళ్టి నుంచి వీటి ద్వారా కొవిడ్ సహా 57 రకాల వైద్య పరీక్షలను ఫ్రీగా చేస్తారు. అన్ని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ, డిజిటల్ ఎక్స్ రే, అల్ట్రా సౌండ్, 2డీ ఎకోతో పాటుగా.. మామోగ్రామ్ పరికరాలను అందుబాటులోకి తేనున్నారు. మిగతా జిల్లా కేంద్రాల్లోనూ త్వరలో ఈ కేంద్రాల ఏర్పాటుకు తాజాగా కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్రంలో అందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇందుకోసం చర్యలు చేపట్టింది. హైదరాబాద్‌ కేంద్రంగా మారిన వైద్య సేవలను జిల్లా కేంద్రాలే యూనిట్‌గా విస్తరించేందుకు సిద్ధమైంది. జిల్లా స్థాయిలోనే వైద్య సేవలు అందించడంతోపాటు, వైద్య పరీక్షా కేంద్రాలనూ ఏర్పాటు చేయనుంది. అన్ని జిల్లాల్లో క్యాన్సర్‌ కేంద్రాలు, డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్థితిగతులు, ఇతర మౌలిక సౌకర్యాల కల్పనకు కేబినెట్ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంగళవారం(జూన్ 8,2021) ప్రగతిభవన్‌లో 9 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యసేవలను మెరుగుపర్చడం, పేదలకు మరింత చేరువగా వైద్యం అందించడంపై సుదీర్ఘంగా చర్చించింది. వైద్య ఆరోగ్య రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు వైద్యశాఖ అహర్నిశలు కృషి చేయాలని మంత్రిమండలి ఆదేశించింది. రాష్ట్రంలో అన్ని స్థాయిల్లోని ఆసుపత్రుల్లో రోగుల సహాయార్థం వచ్చే వారి కోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

బుధవారం 19 జిల్లాల్లో ప్రారంభించనున్న డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఇతర జిల్లాలకు విస్తరించాలని.. ఈ కేంద్రాల్లో ఈసీజీ, డిజిటల్‌ ఎక్స్‌రే, ఆల్ట్రాసౌండ్‌, టుడీ ఈకోతో పాటు మహిళల క్యాన్సర్‌ స్రీనింగ్‌ కోసం ‘మామోగ్రామ్‌’ యంత్రాలను ఏర్పాటు చేయాలని వైద్యశాఖను ఆదేశించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన డయాలసిస్‌ కేంద్రాల్లో యంత్రాల సంఖ్యను పెంచడంతో పాటు, మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కరోనా థర్డ్ వేవ్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది, ఔషధాలను సమకూర్చుకోవాలని ఆదేశించింది.

వైద్య సేవలు, వైద్య పరీక్షలు నిరుపేదలకు మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే తెలంగాణలో ఎంపిక చేసిన 19 జిల్లా కేంద్రాల్లోని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్లను ప్రారంభించి ప్రజలకు డయాగ్నస్టిక్ సేవలు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు.

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, అసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, ములుగు, నల్గొండ, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల జిల్లాల్లోని జిల్లా వైద్య కేంద్రాల్లో ఇప్పటికే ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ సెంటర్లను జిల్లా వైద్యాధికారులు ప్రారంభించనున్నారు.

ఏయే వైద్య పరీక్షలు లభిస్తాయంటే..
ప్రభుత్వ ఆస్పత్రుల్లోని ఈ డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో మొత్తం 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలతో పాటు బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, బీపీ, షుగర్, గుండె జబ్బులు, లివర్, కిడ్నీ, థైరాయిడ్ వంటి జబ్బులకు సంబంధించిన పేషెంట్స్‌కి ఆయా వ్యాధులను నిర్దారించే ఎక్స్‌‌రే, బయోకెమిస్ట్రీ, పాథాలజీకి సంబంధించిన పరీక్షలు చేస్తారు.