సరైన నిద్ర లేకపోతే కరోనాను తట్టుకోలేం

  • Published By: Subhan ,Published On : May 5, 2020 / 03:19 PM IST
సరైన నిద్ర లేకపోతే కరోనాను తట్టుకోలేం

మహమ్మారి కరోనా వైరస్ ను ఎదుర్కోవాలంటే రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. ఇది పుట్టి నెలలు గడుస్తున్నా.. సైంటిస్టులకు పూర్తి వివరాలు అంతుచిక్కకపోవడంతో వ్యాక్సిన్ తయారీ కావడం లేదు. వైరస్ ను దరికి చేరకుండా ఉండేందుకు శుభ్రత ఎంత ముఖ్యమో.. రోగ నిరోధక శక్తి పెంచడం అంతే కీలకం. రోగ నిరోధక శక్తి పెరగాలంటే అన్ని విటమిన్‌లకు సంబంధించిన పండ్లు, కూరగాయలు తినాలని మన వైద్యులు చెబుతుంటారు. ఎన్నితిన్నప్పటికీ వేళకు సరిపడ నిద్ర లేకపోతే రోగ నిరోధక శక్తి శరీరంపై సరిగా పనిచేయలేదట. 

అమెరికాలోని జాతీయ ఆరోగ్య సంస్థ ఓ ఇంటర్నేషనల్ మీటింగ్ ఏర్పాటు చేసి వెల్లడించింది. మానవ శరీర నిర్మాణం.. బయటి నుంచి దాడి చేసే మైక్రోబ్స్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుంది. శరీరానికి కవచంలా బిగుతుగా ఉండి చర్మంపై బ్యాక్టీరియా, వైరస్ లాంటివి రాకుండా కాపాడుతుంటాయి. ఈ ప్రక్రియకు అనుకూలంగా చర్మం బయట డెడ్ సెల్స్(మృత కణాలు) ఉంటాయి.

బయటనుంచి దాడి చేయడానికి వీలుండదు కాబట్టి వైరస్.. కళ్లు, ముక్కు, నోరు ద్వారా మైక్రోబ్స్‌ రూపంలో శరీరంలోకి చొరబడతాయి. ఓ దశ వరకూ కళ్లలో ఉండే యాంటీసెప్టిక్‌ పదార్థం మైక్రోబ్స్‌ను అడ్డుకుంటుంది. కాలేయంలో ఏర్పడే శ్లేష్మం ముక్కులో ఉండి.. తన వంతు పోరాటం చేస్తుంది. ఏదైనా అడ్డుపడినా.. శరీరానికి సరిపడని పదార్థం వచ్చినా వెంటనే తుమ్ము రూపంలో బయటకు పంపేందుకు ప్రయత్నిస్తుంది. 

వైరస్ తీవ్రతను బట్టి.. కొన్ని తుమ్మును కూడా తట్టుకుని శరీర జన్యువుల్లోకి ప్రవేశిస్తాయి. లోపలికి వచ్చిన వైరస్‌ను రక్తంలోని యాంటీ బాడీస్‌ గుర్తించి చంపేస్తాయి. మొట్టమొదటగా ‘బి–లింపోసైట్స్‌’గా పిలిచే తెల్ల రక్త కణాల గుంపు మైక్రోబ్స్‌ను ఎదుర్కొనేందుకు యాంటీ బాడీస్‌ సృష్టికి సంకేతాలు పంపిస్తాయి. అప్పుడు టీ–సెల్స్‌గా పిలిచే రక్తంలోకి  మరికొన్ని తెల్ల రక్తకణాలు వైరస్‌ మీద దాడి చేస్తాయి. 

రసాయనిక సంకేతాలతో మైక్రోబ్స్‌ను నాశనం చేస్తాయి. కొన్ని సంవత్సరాలుగా రక్తంలోని ప్లాస్మాలో నిల్వ ఉండే యాంటీ బాడీస్.. వైరస్ పై పోరాడతాయి. వీటి శక్తికి మించి వైరస్ అటాక్ చేస్తేనే మనిషి అనారోగ్యానికి గురవుతాడు. మనిషి శరీరాన్ని కాపాడటానికి చర్మం, మిగిలిన శరీర భాగాలు సరిగ్గా పనిచేయాలంటే బయోలాజికల్ క్లాక్ కరెక్ట్ పనిచేయాలి. 

శరీరానికి సరిపడ నిద్ర తప్పనిసరి. అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ నిపుణులు సైతం ఇదే తెలియజేస్తున్నారు. వేళకు తినడం, వేళకు నిద్రపోవడం, సరిపడ నిద్రలను గుర్తించి మనిషిని నడిపేదే బయోలాజికల్ క్లాక్. దీనికి ప్రధానంగా సరిపడ నిద్ర తప్పనిసరి.