విటమిన్ సి, జింక్.. కరోనా లక్షణాలను తగ్గించలేవు : కొత్త స్టడీ

విటమిన్ సి, జింక్.. కరోనా లక్షణాలను తగ్గించలేవు : కొత్త స్టడీ

Vitamin C, zinc not lessen Covid-19 symptoms : కరోనా సోకినవారిలో విటమిన్ సి, జింక్ వంటి విటమిన్లను వాడినప్పటికీ వైరస్ లక్షణాలను ఎంతమాత్రం తగ్గించలేవని కొత్త అధ్యయనంలో తేలింది. తీవ్రమైన వైరల్ జలుబు, జ్వరాలను కూడా ఈ రెండు సప్లిమెంట్లు తగ్గించలేకపోయాయని తెలింది. కరోనా పాజిటివ్ వచ్చి ఇంట్లోనే ఐసోలేషన్ ఉన్న బాధితులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా వారికి విటమిన్ సి, జింక్ సప్లిమెంట్లను ఇచ్చారు. అయితే విటమిన్లు తీసుకున్న కరోనా బాధితుల్లో ఎవరిలోనూ ఎలాంటి లక్షణాలు తగ్గినట్టు కనిపించలేదు.

ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో అధ్యయనాన్ని పరిశోధకులు నిలిపివేశారు. వాస్తవానికి ఈ రెండు విటమిన్ సప్లిమెంట్లు కరోనా లక్షణాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని డాక్టర్ ఎరిన్ మికోస్ చెప్పారు. హోం ఐసోలేషన్ లో ఉన్న కరోనా బాధితుల్లో ఒక్కొక్కరిగా ఒకో సప్లిమెంట్ ఇవ్వగా.. మూడు గ్రూపుల్లో కలిపి 214 మందికి అధిక మోతాదులో సప్లిమెంట్లు ఇచ్చారు. నాల్గో గ్రూపులో మాత్రం ఎలాంటి సప్లిమెంట్లు ఇవ్వలేదు. కేవలం విశ్రాంతి, హైడ్రేషన్ ఉండేలా కేర్ తీసుకున్నారు. వీరికి ఇచ్చిన సాధారణ మందులతోనే జ్వరం లక్షణాలు తగ్గినట్టు గుర్తించారు. అధిక మోతాదు కలిగిన జింక్ గ్లూకోనేట్ (జింక్), అస్కార్బిక్ యాసిడ్ (విటమిన్ సి) లేదా రెండు సప్లిమెంట్లను ఇచ్చినా కరోనా బాధితుల్లో లక్షణాలు తగ్గలేదని క్లినిక్ కార్డియాలిజిస్ట్ మిల్లింద్ దేశాయ్ పేర్కొన్నారు.

అధిక మోతాదు సప్లిమెంట్లు తీసుకున్న బాధితుల్లో కొందరికి వికారం, డయేరియా, కడపులో తిప్పడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించినట్టు పరిశోధకులు తెలిపారు. కరోనా నివారణపై విటమిన్లు, సప్లిమెంట్లతో చికిత్స చేసేందుకు ఇప్పటికీ సైంటిస్టులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న కొన్ని ట్రయల్స్ లో కరోనా బాధితులపై విటమిన్ డి మాత్రమే పనిచేస్తుందని, ఎముక ఆరోగ్యంతో పాటు బలంగా పెరిగేందుకు సాయపడుతుందని పరిశోధకులు తేల్చేశారు.