డేటా లీక్ కేసు.. ఐటీ గ్రిడ్ కథ ఏంటి?

ఐటీ గ్రిడ్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. రెండు ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేసిన కంపెనీ. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరి నోట

  • Published By: veegamteam ,Published On : March 5, 2019 / 07:00 AM IST
డేటా లీక్ కేసు.. ఐటీ గ్రిడ్ కథ ఏంటి?

ఐటీ గ్రిడ్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. రెండు ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేసిన కంపెనీ. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరి నోట

ఐటీ గ్రిడ్.. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. రెండు ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేసిన కంపెనీ. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకు అందరి నోట వినిపిస్తున్న పదం. దీని  కారణంగా రెండు ప్రభుత్వాలు సై అంటే సై అంటున్నాయి. కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. రెండు రాష్ట్రాల నడుమ ఇంతటి వివాదానికి కారణమైన ఐటీ గ్రిడ్ కంపెనీ గురించి తెలుసుకునేందుకు  అంతా ఆసక్తి చూపుతున్నారు. అసలు ఐటీ గ్రిడ్ కంపెనీ అంటే ఏమిటి? ఆ కంపెనీలో ఎవరు ఉంటారు? ఏం చేస్తారు? వివాదం ఎక్కడ మొదలైంది? అందులో ఎలాంటి కుట్ర జరిగింది? టీడీపీ  ప్రభుత్వానికి, ఐటీ గ్రిడ్ కంపెనీకి లింక్ ఏంటి? ఇప్పుడీ విషయాలు హాట్ టాపిక్‌గా మారాయి.

సేవామిత్ర యాప్‌తో డేటా సేకరణ:
హైదరాబాద్ మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఏడాదిన్నర క్రితం ఐటీ గ్రిడ్ అనే సంస్థ ఏర్పాటైంది. టీడీపీకి ఐటీ సేవలు అందించే కంపెనీ ఇది అని తెలుస్తోంది. టీడీపీకి సేవామిత్ర మొబైల్  యాప్‌ను ఈ సంస్థే తయారు చేసినట్టు సమాచారం. ఐటీ గ్రిడ్ సంస్థ నిర్వాహకులు ఏపీలోని ఆయా నియోజవకర్గాల ఓటరు జాబితాలు తీసుకుని, సేవామిత్ర యాప్‌లో ఓటర్ల పేర్లను ఫీడ్‌ చేసి, పేరు, కులం, మతం, ఆధార్ నంబర్, సెల్‌ఫోన్ నంబర్ తదితర వివరాలను పొందుపరిచేలా ఒక ఫార్మాట్ తయారు చేశారని సమాచారం. ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల వివరాలు, వారు ఎవరికి మొగ్గుచూపుతున్నారనే విషయాలు సహా 15 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళి రూపొందించారు.

ఓట్ల తొలగింపు ప్రాసెస్:
ఈ కంపెనీ ద్వారా ఏపీలో ఓట్ల తొలిగింపు తతంగం పకడ్బందీగా సాగిందని సమాచారం. వైసీపీతోపాటు ఇతర పార్టీలవైపు మొగ్గుచూపే ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకొని.. తమకు మరో ప్రాంతంలో ఓటు ఉందని, ఇక్కడున్న ఓటును రద్దు చేసుకుంటున్నామంటూ నకిలీ సెల్ఫ్‌ డిక్లరేషన్ పెట్టించి.. ఆయా ఓట్లను డిలీట్ చేస్తున్నారని తెలిసింది. ఓట్లు తొలగించాలని కోరుతూ ఆన్‌లైన్‌లో  హైదరాబాద్ నుంచే సెల్ఫ్‌ డిక్లరేషన్ ఫారాలను అప్‌లోడ్ చేశారని సమాచారం. దీంతో ఓటర్ల జాబితా నుంచి వైసీపీ అనుకూల ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని ఆ పార్టీ సానుభూతిపరులు  ఆరోపిస్తూ.. ఏపీలో 50 చోట్ల పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఓట్ల తొలిగింపులో ఓటరు తన వ్యక్తిగతమైన డిక్లరేషన్ ఇవ్వాలి. టీడీపీ నాయకులే ఓటర్ల మాదిరిగా డిక్లరేషన్ ఇచ్చారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ.

ఏపీకి తెలంగాణ పోలీసులు:
ఇదంతా హైదరాబాద్‌లోని ఐటీ గ్రిడ్ సంస్థ నుంచే జరిగిందనేందుకు తగిన ఆధారాలను పోలీసులు సేకరించారని సమాచారం. ఈ తతంగం మొత్తం హైదరాబాద్ కేంద్రంగా జరగడంతో ఇప్పుడు ఎన్నికల కమిషన్ సూచనలతో హైదరాబాద్ పోలీసులు దీనిపై లోతైన దర్యాప్తునకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఏపీలో పేర్లు తొలిగింపునకు గురైనవారి కలిసి వివరాలు తీసుకునే  అవకాశాలున్నాయని చెబుతున్నారు. అదే విధంగా సంబంధిత గ్రామ కార్యదర్శి, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లను కూడా హైదరాబాద్ పోలీసులు విచారించనున్నారు. ఆన్‌లైన్‌తోపాటు  మాన్యువల్‌గా కూడా సెల్ఫ్‌ డిక్లరేషన్ ఇచ్చే అవకాశముండడంతో పోలీసులు ఈ రెండింటిపై స్పష్టత ఇవ్వనున్నారు.

పార్టీల వారీగా జాబితా:
సుమారు 500 ట్యాబ్‌లను సమకూర్చి నియోజకవర్గాల వారీగా సర్వేలు చేయించారు. ఏపీలో సర్వే చేసిన డాటా అంతా హైదరాబాద్‌కు తరలించి, ఇక్కడే పార్టీల వారీగా జాబితాను వేరు చేశారని, మధ్యస్తంగా ఉన్నవారిని తమవైపు తిప్పుకోవాలని టీడీపీ నాయకులకు సూచనలు చేస్తూ ఆ రిపోర్టును, వైసీపీకి చెందిన వారి జాబితాలను అందించారని తెలిసింది. ఎక్కడైతే నువ్వా? నేనా? అనే విధంగా పోటీ ఉంటుందో, టీడీపీ ఓడిపోయే అవకాశాలు ఎక్కడ ఉంటాయో అక్కడ సర్వేలు చేశారని తెలుస్తున్నది. ఈ సర్వేల్లో కచ్చితంగా టీడీపీకి ఓటు వేసేవారు.. మధ్యస్తంగా ఉన్నవారు.. వైసీపీకి కచ్చితంగా ఓటేసేవారు.. జనసేన సానుభూతిపరులు.. ఇలా జాబితాను వేరుచేశారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఎన్నికల్లో లబ్ది కోసం డేటా చోరీ:
ప్రభుత్వ వెబ్‌సైట్లలో నిక్షిప్తంగా ఉండాల్సిన ఏపీ ప్రజల డేటాను ఐటీ గ్రిడ్ సంస్థ అక్రమంగా దొంగిలించి దుర్వినియోగం చేస్తోందని హైదరాబాద్‌లో నివాసం ఉండే ఏపీ వాసి లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ సంస్థపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంస్థపై దాడి చేసి నలుగురు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. ఏపీకి చెందిన కంపెనీలో తెలంగాణ పోలీసులు ఎలా సోదాలు చేస్తారని ఏపీ ప్రభుత్వ పెద్దలు మండిపడ్డారు. ఐటీ గ్రిడ్ కంపెనీ ఎలాంటి డేటాను చోరీ చేయలేదని చెబుతున్నారు. ఆ సంస్థ దగ్గర టీడీపీ కార్యకర్తలకు సంబంధించిన విలువైన సమాచారం  ఉందని, దాన్ని టీఆర్ఎస్ సాయంతో దొంగిలించేందుకు జగన్ కుట్రపన్నారని ఆరోపిస్తున్నారు.

జగన్‌తో చేతులు కలిపిన కేసీఆర్.. టీడీపీ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని  చంద్రబాబు మండిపడ్డారు. ఈ కేసులో బాధ్యులు ఎవరైనా వదిలిపెట్టేది లేదని, ఏపీ ప్రభుత్వ పెద్దలు ఉన్నా అరెస్ట్ చేస్తామని తెలంగాణ పోలీసులు అనడం మ్యాటర్‌ను మరింత సీరియస్ చేసింది.  ఎన్నికల వేళ డేటా చోరీ వివాదం కేసు తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెంచేసింది. ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుందోనని రాజకీయవర్గాలతో పాటు ప్రజల్లో ఆసక్తికరంగా మారింది.