ఫణి తుఫాన్ : ఏపీలో ముందస్తు జాగ్రత్తలు..తెలంగాణపై ప్రభావం ఉండదు

  • Published By: madhu ,Published On : April 28, 2019 / 01:02 AM IST
ఫణి తుఫాన్ : ఏపీలో ముందస్తు జాగ్రత్తలు..తెలంగాణపై ప్రభావం ఉండదు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా మారింది. చెన్నైకి ఆగ్నేయ దిశగా 1,190 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఇది తీరం వైపుకు దూసుకొస్తోంది. రాగల 24 గంటల్లో ఇది పెను తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తుపాను హెచ్చరిక కేంద్రం హెచ్చరించింది. 

‘ఫణి’ తుఫాను ఏపీకి 200 కిలోమీటర్ల బయటినుంచే దిశ మార్చుకుంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఏపీపై తుఫాను ప్రభావం కనిపించకపోవడమేకాదు… వర్షాలు పడటం కూడా కష్టమేనని భావిస్తున్నారు. అయితే తుఫాను ఎటువైపుగా ప్రయాణించినా ముందు జాగ్రత్తలు మాత్రం తీసుకుంటున్నామని విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్‌ తెలిపారు. 

NDRF, ఆర్మీ, నేవీలను సహాయక చర్యల కోసం సిద్ధం చేశామని, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామన్నారు. తాడేపల్లిలోని విపత్తుల నిర్వహణ కార్యాలయంలో ఏప్రిల్ 27వ తేదీ శనివారం ఆయన సమీక్షించారు. అయితే తుఫాన్‌ ప్రభావం తెలంగాణపై ఉండబోదని వాతావరణశాఖ అధికారులు స్పష్టం చేశారు.

తుఫాన్‌ దిశ మార్చుకుని ఈశాన్యంగా పయనించే క్రమంలో భూమి నుంచి తుఫాను దిశగా గాలులు వీయనున్నాయి. దీంతో కోస్తాలో ఎండలు పెరిగి కొన్నిచోట్ల వడగాడ్పులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.