హైదరాబాద్‌లో 33వ నేషనల్ బుక్ ఫెయిర్

హైదరాబాద్‌లో 33వ నేషనల్ బుక్ ఫెయిర్

పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ మొదలుకానుంది. డిసెంబరు 23నుంచి జనవరి 1వరకూ ఈ ప్రదర్శన కొనసాగుతుంది. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేతులు మీదుగా సోమవారం 5గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతోంది. హైదరాబాద్ బుక్ ఫెయర్ ప్రెసిడెంట్ గౌరీ శంకర్ మాట్లాడుతూ,, రచయితలు, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 

మూడు దశాబ్దాల నాటి పబ్లిషర్ల పుస్తకాలను సైతం అందుబాటులో ఉంచుతూ కొన్ని సంవత్సరాలుగా ఈ బుక్ ఫెయిర్ అమితాదరణ పొందుతుంది. ఈ 33వ హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్‌లో 330 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 80మంది కొత్త రచయితల పుస్తకాలు ఎగ్జిబిషన్ లో ఉంచుతున్నారు. 

ఇంగ్లీష్, తెలుగు, హిందీ, కన్నడ, మళయాళం భాషల్లో క్రైమ్, కామిక్, డ్రామా, థ్రిల్లర్, ఫాంటసీ, చరిత్ర, ఆధ్యాత్మికం పలు జానర్స్‌లో నవలలు, పద్యాలు, సైన్స్, రొమాన్స్, ట్రావెల్, సైన్స్, అడ్వెంచర్, వార్ వంటి పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. గతేడాది ఈ కార్యక్రమానికి 10లక్షల మంది వచ్చారని ఈ ఏడాది అంతకంటే ఎక్కవ మంది రావొచ్చని భావిస్తున్నట్లు సెక్రటరీ కే.చంద్రమోహన్ తెలిపారు. 

బాలమేళా:
ఈ సారి ప్రత్యేకంగా బాలమేళా నిర్వహిస్తున్నారు. ఇందులో స్టోరీ టెల్లింగ్, పెయింటింగ్, డ్యాన్సింగ్, కళా ప్రదర్శనలు, కళలు, వ్యాస రచనలకు సంబంధించిన పుస్తకాలు ఉంచుతారు. బుక్ ఫెయిర్ లోకి వచ్చిన పిల్లలను ఆకట్టుకునేందుకు ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బుక్ ఫెయిర్ సొసైటీ 2020లో రాష్ట్రవ్యాప్తంగా నగరాల్లో, పట్టణాల్లో గ్రామాల్లో్ 2వేల బుక్ ఫెయిర్స్ నిర్వహించనుంది.