ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : 4 లక్షల మందితో మెట్రో రికార్డు

  • Published By: chvmurthy ,Published On : October 22, 2019 / 03:16 AM IST
ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్ : 4 లక్షల మందితో మెట్రో రికార్డు

రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో, ప్రజలకు మెట్రో రైలు వరంగా మారింది. హైదరాబాద్ నగరంలో ప్రయాణికులను గమ్యస్ధానాలకు చేరవేస్తూ మెట్రో రైలు రికార్డులు నెలకొల్పుతోంది. హైదరాబాదు మెట్రో రైలు ప్రయాణికుల సంఖ్య  అక్టోబరు21, సోమవారంనాడు 4 లక్షల మార్కును దాటినట్లు మెట్రో ఎఁడీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు. మెట్రో రైలు ప్రారంభించిన రోజు 3.65 లక్షల మంది ప్రయాణించగా, అక్టోబరు 21వ తేదీన 4లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకున్నారు. గతంలో ప్రతి 7 నిమిషాలకు ఒక మెట్రో సర్వీసు ఉండగా ఆర్టీసీ కార్మికుల సమ్మె దృష్టిలో ఉంచుకుని ప్రతి మూడున్నర నిమిషాలకు ఒక సర్వీసు నడుపుతున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి  చెప్పారు. 

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సోమవారం అక్టోబరు21న కాంగ్రెస్ పార్టీ ప్రగతి భవన్ ముట్టడికి పిలుపు నిచ్చింది. దీంతో రోడ్లన్నీ జామ్ అయ్యాయి. ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో బేగంపేట మెట్రో స్టేషన్ను మూసివేశారు. మెట్రో స్టేషన్కు తాళం వేసినట్లు అధికారులు చెప్పారు. ఆందోళనకారులు  మెట్రో స్టేషన్లోకి దూసుకువచ్చే ప్రమాదం ఉన్నదృష్ట్యా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఆ పని చేశారు.

ఆర్టీసీ సమ్మె నేపధ్యంలో ప్రత్యామ్నాయ రవాణా మార్గంగా ప్రజలందరూ మెట్రో సేవలను వినియోగించుకోవటంతో మెట్రో రికార్డు నెలకొల్పింది. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నప్పటి నుంచి మెట్రో రైళ్లు క్రిక్కిరిసి నడుస్తున్నాయి. హైదరాబాద్‌ మెట్రో రైళ్లలో ప్రస్తుతం రోజూ సరాసరి 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. వారానికి 5 వేల మంది ప్రయాణికులు పెరుగుతున్నట్లు మెట్రో అధికారులు చెప్పారు. సాధారణంగా అమీర్ పేట ఇంటర్ ఛేంజ్, ఉప్పల్, మాదాపూర్ లాంటి మెయిన్ స్టేషన్లలోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆర్టీసీ సమ్మె ప్రారంభమైన తర్వాత ఈ రద్దీ విపరీతంగా పెరిగింది. కార్యాలయాల వేళల్లో (ఉదయం, సాయంత్రం) ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటోంది. ఇప్పటి వరకు రోజుకు 810 ట్రిప్పులు తిరుగుతుండగా, సోమవారం ఒక్కరోజు అదనంగా 4 మెట్రో రైళ్లను, 120 ట్రిప్పులను తిప్పారు. దీంతో రికార్డు స్థాయిలో మెట్రోలో ప్రయాణం చేశారు. ఇంతకు మునుపు వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్లో ఏర్పాటు చేసిన గణేషుడ్ని చూడటానికి గత నెలలో ఒకేరోజు ఖైరతాబాద్ స్టేషన్ నుంచి 70 వేల మంది  రాకపోకలు సాగించారు.

మెట్రో రైలు సేవలు ప్రస్తుతం కారిడార్‌-1 (మియాపూర్‌-ఎల్‌బీనగర్‌) 29 కి.మీ, కారిడార్‌-3(నాగోల్‌-హైటెక్‌ సిటీ) 27 కి.మీ మేర మొత్తం 56 కి.మీ పరిధిలో పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలు కొనసాగుతున్నాయి.కారిడార్‌-1లో మియాపూర్‌, జేఎన్‌టీయూ, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, ఎస్సార్‌నగర్‌, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎర్రమంజిల్‌ ,లక్డీకాపూల్‌ , దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, ఎల్‌బీనగర్‌,

కారిడార్‌-3లో నాగోల్‌ , ఉప్పల్‌ , సికింద్రాబాద్‌, పరేడ్‌గ్రౌండ్‌ , బేగంపేట, దుర్గం చెరువు, హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌ల నుంచి నిత్యం వేల సంఖ్యలో ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణికుల రద్దీ  దృష్టిలో ఉంచుకిని మెట్రో అధికారులు  చర్యలు చేపడుతున్నారు. రాత్రివేళ అర్ధగంటపాటు మెట్రో సేవలు పొడింగించారు. ఖైరతాబాద్ నుంచి అన్ని వైపులకూ చివరి మెట్రో రైలు 11.30 గంటల వరకు నడుపుతున్నారు.