కేసీఆర్ కొత్త టార్గెట్ : అక్షర తెలంగాణ

  • Published By: chvmurthy ,Published On : January 1, 2020 / 02:06 AM IST
కేసీఆర్ కొత్త టార్గెట్ : అక్షర తెలంగాణ

కొత్త సంవత్సరం ప్రారంభం  సందర్భంగా సీఎం కేసీఆర్ కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్న సంకల్పంతో ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌ నినాదమిచ్చారు. వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తెలంగాణను తిర్చిదిద్దాలని పిలుపునిచ్చారు.
 

రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధించిన విజయాలను గుర్తుచేశారు. రాష్ట్రం ఆవిర్భవించిన కేవలం ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక విషయాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలవడం గర్వకారణమని సీఎం అన్నారు. ఆ విజయాలను స్ఫూర్తిగా తీసుకుని 2020లో రాష్ట్రం మరింత ముందడుగు వేస్తుందని ఆకాంక్షించారు.
 

తెలంగాణను వంద శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు సీఎం కేసీఆర్. Each One – Teach One నినాదంతో  ప్రతి ఒక్కరూ నిరక్షరాస్యుడైన మరొకరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడానికి సంకల్పం తీసుకోవాలని కేసీఆర్ కోరారు. ‘ఆరేళ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తూ గొప్ప విజయాలను సాధించింది. అనేక అంశాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచి.. అనేక మంది ప్రశంసలను అందుకొన్నది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను తెలంగాణ రాష్ట్రం సొంతం చేసుకొన్నది. అనతికాలంలోనే దేశంలో అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ నిలువడం మనందరికీ గర్వకారణం అన్నారు కేసీఆర్. 
 

ఉద్యమ సమయంలో అనుకున్న విధంగానే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని సీఎం కేసీఆర్ అన్నారు. విద్యుత్, మంచినీటి సమస్యను పరిష్కరించిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుతాలు సృష్టిస్తోందని చెప్పారు.జూన్ నాటికి కాళేశ్వరం ఫలితాలు వందకు వంద శాతం అందుతాయని, రాష్ట్రం సుభిక్షం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. తెలంగాణను ఆదర్శంగా తీసుకొని తమ రాష్ట్రంలో కూడా మిషన్‌ భగీరథ లాంటి పథకం తీసుకురావడానికి మిగతా రాష్ర్టాలు ఉవ్విళ్లూరుతున్నాయి. 
 

ప్రజాసంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. అనేక రకాల సంక్షేమ పథకాలతో నిరుపేదలకు జీవన భద్రత కల్పించుకోగలిగాం. పారిశ్రామిక ఐటీ రంగాల్లో దూసుకుపోతున్నాం’ అని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తంచేశారు. అక్షరాస్యతలో తెలంగాణ వెనుకంజ వేయడం ఓ మచ్చగా మిగిలిందని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం.. ఈ దుస్థితిని అధిగమించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రాన్ని వంద శాతం అక్షరాస్యత స్టేట్‌గా మార్చేందుకు అందరూ ప్రతిజ్ఞ చేయాలన్నారు.  ఒకే ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించుకోగలిగాం. అదేవిధమైన స్ఫూర్తితో తెలంగాణను వందశాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా మార్చేందుకు అందరూ కృషిచేయాలి. తెలంగాణలో సంపూర్ణ అక్షరాస్యత సాధించే కార్యాచరణను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభిస్తుంది. ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములై అక్షరాస్యత విషయంలో అప్రతిష్ఠను రూపుమాపాలి. తద్వారా తెలంగాణ గొప్ప ప్రగతికాముక రాష్ట్రంగా భాసిల్లాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు.