గుణాత్మక మార్పు : ‘హోదా’కు సంపూర్ణ మద్దతు – కేటీఆర్…

  • Published By: madhu ,Published On : January 16, 2019 / 10:02 AM IST
గుణాత్మక మార్పు : ‘హోదా’కు సంపూర్ణ మద్దతు – కేటీఆర్…

హైదరాబాద్ : ఏపీకి సంబంధించిన ప్రత్యేక హోదా విషయంలో టీఆర్ఎస్ స్పష్టమైన వైఖరితో ఉందని…మోడీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌తో 2019, జనవరి 16వ తేదీన కేటీఆర్ భేటీ అయ్యారు. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చించారు. అనంతరం వీరిద్దరూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు. 
ముందుగా కేటీఆర్ మాట్లాడుతూ….అన్ని అధికారాలు కేంద్రం వద్ద ఉంచుకుని రాష్ట్రాలపై నిర్లక్ష్య వైఖరి మారాలని..సమాఖ్యస్పూర్తితో ముందుకెళ్లాలని…కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా గుణాత్మక మార్పు కోసం పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, డీఎంకే అధినేత స్టాలిన్‌, అజిత్ జోగి..మరికొంత మందిని కేసీఆర్‌ కలిసి ఫెడరల్ ఫ్రంట్‌కి మద్దతివ్వాలని కోరడం జరిగిందన్నారు. అందులో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్‌కు ఫోన్ చేసి చర్చిద్దామని చెప్పడం..ఆయన ఆహ్వానించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు దగ్గరగా జాతీయ రాజకీయాలుండాలని…రాజకీయ వ్యవస్థ ఉండాలని కోరుకొనే వారందరూ కలిసి వస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే కేసీఆరే స్వయంగా వైఎస్‌ జగన్‌ను కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌పై చర్చిస్తారని కేటీఆర్ వెల్లడించారు.