నంబర్ ప్లేట్‌పై సీఎం జగన్ పేరు: కారు సీజ్ చేసిన పోలీసులు

  • Published By: vamsi ,Published On : October 23, 2019 / 02:27 AM IST
నంబర్ ప్లేట్‌పై సీఎం జగన్ పేరు: కారు సీజ్ చేసిన పోలీసులు

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అయితే ఓ అభిమాని ఆయన క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు  ‘ఏపీ సీఎం జగన్’ అనే పేరు కారు నెంబర్ ప్లేట్‌ మీద రాయించుకున్నాడు. కారు నెంబర్ ప్లేట్‌పై నెంబర్‌కు బదులు AP CM JAGAN అని రాయించుకుని తెలంగాణలో యథేచ్ఛగా తిరుగుతూ పోలీసు చలాన్‌ల నుంచి తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. కానీ అతగాడి ఆలోచనకు ట్రాఫిక్ పోలీసులు బ్రేక్ వేశారు.

తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించగా.. అదే సమయంలో అటుగా వచ్చిన కారును పోలీసులు పట్టుకున్నారు. కారు నెంబర్ ప్లేట్‌కు బదులు AP CM JAGAN అని ఉండటంతో ఇదేంటని ప్రశ్నించారు. చలాన్లు, టోల్ గేట్‌ల వద్ద ఫీజు మినహాయింపు కోసం ఇలా చేసినట్లు యువకుడు ముప్పిడి హరి రాకేష్ తెలిపాడు. ఈ మేరకు కారును జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌కు తరలించి లా అండ్ ఆర్డర్ పోలీస్‌లకు అప్పగించారు పోలీసులు.

ముప్పిడి హరి రాకేష్ స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంగా పోలీసులు గుర్తించారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. రాకేష్ తండ్రి పేరు సూర్యా రెడ్డి కాగా.. రాకేష్ వయస్సు 27ఏళ్లుగా పోలీసులు తెలిపారు. AP10 BD 7299 నంబర్‌కు బదులు AP CM JAGAN అని పేరు రాయించుకోగా.. ఆ కారు ఏసు రెడ్డి అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ఐపీసీ క్రైమ్ సెక్షన్ నం. 761/19, U/s 420, 210 కింద అతనిపై కేసు నమోదు చేశారు పోలీసులు.