జూలై లేదా ఆగస్టులో.. భారత్‌లో రెండోసారి విజృంభించనున్న కరోనా వైరస్

జూలై లేదా ఆగస్టులో.. భారత్‌లో రెండోసారి విజృంభించనున్న కరోనా వైరస్

యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. కంటికి కనిపించని ఈ సూక్ష్మజీవి 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్‌ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. చాపకింద నీరులా ప్రబలుతూ లక్షలాది మంది ప్రాణాలు బలిగొంటోంది. ఇంతవరకు కొవిడ్‌-19 జన్యుక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేందుకు మరికొన్ని నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ దేశాల సంగతి పక్కన పెడితే మన దేశంలోనూ కరోనా వైరస్ పంజా విసిరింది. వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం లాక్ డౌన్ అనే అస్త్రాన్ని సంధించింది. లాక్ డౌన్ చాలావరకు మంచి ఫలితాన్నే ఇచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లాక్ డౌన్ కారణంగా కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలిగామని వైద్య నిపుణులు అంటున్నారు.

వర్షాకాలంలో భారత్ లో రెండో విడత కరోనా విజృంభణ, బాంబు పేల్చిన శాస్త్రవేత్తలు:
ఓవైపు లాక్ డౌన్, మరోవైపు మండు టెండలు.. వీటి కారణంగా దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి తగ్గు ముఖం పట్టిందనే చెప్పాలి. ప్రస్తుతం రోజువారిగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఒకింత స్థిరంగా ఉంది. ఆ తర్వాత కొన్ని వారాల పాటు అవి తగ్గే అవకాశం ఉంది. అయితే రిలాక్స్ అవడానికి లేదు. ముందు ముందు మరింత ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ప్రస్తుతం తగ్గుముఖం పడుతున్నట్టు కనిపించినా.. భారత్ లో రెండోసారి కరోనా వైరస్ విజృంభించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. వానాకాలంలో మరోసారి కరోనా వైరస్ విజృంభించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

లాక్ డౌన్ ఎత్తివేశాక జూలై చివర్లో లేదా ఆగస్టులో వైరస్‌ మళ్లీ పడగ విప్పే అవకాశం:
లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత కొన్నివారాల వరకు పరిస్థితి అదుపులోనే ఉంటుందని.. జూలై చివర్లో లేదా ఆగస్టులో వైరస్‌ మళ్లీ పడగ విప్పే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. వర్షాలు, వాతావరణం చల్లబడటం దీనికి కలిసివస్తుందన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని శివనాడార్‌ యూనివర్సిటీ, బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ), టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ (టీఐఎఫ్‌ఆర్‌)కు చెందిన పరిశోధకులు చైనా, ఇటలీ తదితర దేశాల్లోని పరిస్థితులను విశ్లేషించి ఈ మేరకు హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో కరోనా వ్యాప్తి ఉచ్ఛ స్థితిని దాటి ప్రస్తుతం ఒకేస్థాయిలో కొనసాగుతున్నదని శివనాడార్ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ సమిత్‌ భట్టాచార్య పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ విధించే నాటికి దేశంలో 618 కేసులు, 13 మరణాలు మాత్రమే ఉండగా, ఇప్పుడు కేసుల సంఖ్య 23వేలు, మరణాల సంఖ్య 700 దాటిందని, కేసుల రెట్టింపు వేగం తగ్గిందని, కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నదని గుర్తుచేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని, మే 3న లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత సైతం కొన్ని రోజులు కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు.

వ్యాధి లక్షణాలతో సంబంధం లేకుండా హాట్ స్పాట్లలో కరోనా నిర్ధారణ పరీక్షలను ముమ్మరం చేయాలి:
”జూలై చివరల్లో లేదా ఆగస్టులో రెండో విడత కేసులు పెరుగుతాయి. వాటి ఉధృత్తి, మన సామాజిక దూరాన్ని ఎంత సమర్థంగా అమలు చేస్తున్నామన్న దానిపైనే ఆధారపడి ఉంటంది. వర్షాకాలంలో అనేక చోట్ల ఫ్లూ విజృంభిస్తుంది. ఆ సమయంలో ఫ్లూ లక్షణాలను విస్మరించకూడదు. వ్యాధి లక్షణాలతో సంబంధం లేకుండా హాట్ స్పాట్లలో కరోనా నిర్ధారణ పరీక్షను ముమ్మరం చేయాలి. లాక్ డౌన్ ఆంక్షలు సడలించాలకు ఇన్ ఫెక్షన్లు మరోసారి పేట్రేగిపోయే ప్రమాదం ఉంది” అని సమిత్ అన్నారు.

అంతా ప్రభుత్వాలు, ప్రజల చేతుల్లోనే ఉంది:
లాక్ డౌన్ తర్వాత గతంలో మాదిరిగా రోజువారీ కార్యకలాపాలు మొదలైతే.. జూలై ఆఖర్లో లేదా ఆగస్టులో వైరస్‌ మళ్లీ వ్యాప్తిచెందే అవకాశం ఉందని బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ప్రొఫెసర్‌ రాజేశ్‌ సుందరేశన్‌ హెచ్చరించారు. చైనాలో ప్రస్తుతం ఇదే జరుగుతోందన్నారు. దీంతో మళ్లీ ప్రయాణ ఆంక్షలు విధిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. మన దేశంలో ప్రజలు నిర్ణీత దూరం పాటించడం, పరిశుభ్రత, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైరస్‌ కట్టడికి తీసుకునే చర్యలు, లాక్‌డౌన్‌ తర్వాత వైరస్‌ వ్యాప్తివేగంపైనే ‘రెండో విజృంభణ’ తీవ్రత ఆధారపడి ఉంటుందన్నారు.

రెండో విజృంభణలో పాత, కొత్త తేడా లేకుండా అందరికీ ప్రమాదం:
చైనా, యూరప్ దేశాల్లో జరిగిన అధ్యయనాల ప్రకారం వైరస్‌ బారిన పడి కోలుకున్నవారికి మళ్లీ సోకే అవకాశం ఉందన్నారు. కాబట్టి రెండో విజృంభణలో పాత, కొత్త తేడా లేకుండా అందరికీ ప్రమాదం పొంచి ఉందని వివరించారు. దీనికి తగ్గట్టుగా వైద్య సదుపాయాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. ‘లాక్‌డౌన్‌ మనకో మంచి అవకాశం. వేగంగా బాధితులను గుర్తించడం, పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించడం, వ్యాక్సిన్‌ కోసం ప్రయత్నించడం వంటి చర్యలు చేపడితే తీవ్రత తగ్గొచ్చు’ అని పరిశోధకులు సూచించారు.

లాక్ డౌన్ కాపాడింది:
కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి భారత్ లో లాక్ డౌన్ ప్రకటించి నెల గడిచిపోయింది. కరోనాపై పోరులో ఈ లాక్ డౌన్ అత్యుత్తమ ఆయుధంగా మారిందని, ఇది లేకుంటే పరిస్థితి చాలా దారుణంగా ఉండేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అమెరికా, యూరప్ దేశాల్లో తలెత్తిన తరహా మరణాలను భారత్ చూడాల్సి వచ్చేదని విశ్లేషిస్తున్నారు. అయితే దేశవ్యాప్త లాక్ డౌన్ క్రమంగా సడలే సమయంలో పెను సవాళ్లు ఎదురవుతాయని హెచ్చరించారు. లాక్ డౌన్ వల్ల మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడానికి వీలు కలిగిందన్నారు.

కరోనా నియంత్రణ మార్గమిదే:
* లాక్‌డౌన్‌ తర్వాత కూడా నిర్ణీత దూరం పాటించడం
* బయటికి వెళ్తే తప్పనిసరిగా మాస్కులు ధరించడం
* ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం
* కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంపు
* వేగంగా బాధితుల గుర్తింపు, ఐసొలేషన్‌
* హాట్‌స్పాట్లను గుర్తించి, కట్టడి చర్యలు చేపట్టడం