America Gun Culture : అమెరికాలో రోజుకు 53 మందిని బలి తీసుకుంటున్న తుపాకి

అమెరికాలో గన్ కల్చర్ విస్తరించడానికి మరో ప్రధాన కారణం అక్కడ జాతీయ రైఫిల్ అసోసియేషన్ అత్యంత బలంగా ఉండడమే. ఈ అసోసియేషన్ లాబీయింగ్‌తో కాంగ్రెస్ సభ్యులను ప్రభావితం చేస్తూ కఠిన నిబంధనలు రూపొందించకుండా జాగ్రత్త పడుతోంది.

America Gun Culture : అమెరికాలో రోజుకు 53 మందిని బలి తీసుకుంటున్న తుపాకి

America

America Gun Culture : అమెరికాలో గన్‌కల్చర్‌ పెట్రేగిపోతోంది. రోజుకు 53 మంది….అమెరికా తుపాకి సంస్కృతి బలితీసుకుంటున్న అమాయకుల సంఖ్య ఇది. అగ్రరాజ్యంలో జరిగే హత్యల్లో 79శాతం గన్‌లు ఉపయోగించి జరుగుతున్నవే. ఈ సంస్కృతి అమెరికాలో ఈ ఏడాదో, గత సంవత్సరమో లేదంటే ఈ పదేళ్ల కాలంలోనో పెరగలేదు. ఐదు దశాబ్దాలపై నుంచి అమెరికాలో గన్ కల్చర్ అదుపుతప్పింది. చిన్న పిల్లలు బొమ్మ తుపాకీలు కొనుక్కున్నంత తేలిగ్గా అక్కడ గన్‌లు దొరుకుతాయి. అభివృద్ధి చెందిన దేశమంటే ప్రతి ఒక్కరి చేతిలో ఆయుధముండడమన్న భావన అక్కడ పాలకులది. గన్ ఉండడం స్టేటస్ సింబల్‌గా భావించే మనస్తత్వం ఆ దేశ ప్రజలది. వీటన్నింటి ఫలితమే దేశంలో ప్రతీరోజూ ఎక్కడో చోట జరిగే విచ్చలవిడి కాల్పులు.

అమెరికా నేరాలకు ఆయుధాలే అసలు కారణమని 50 ఏళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు లిండన్ బైనెస్ జాన్సన్ ప్రకటించారు. గన్ ఉండడం సహజసిద్ధ పరిణామమనే మన సంస్కృతి ఈ భయంకర పరిణామాలకు కారణమని హెచ్చరించారు. అప్పట్లోనే ఆ దేశంలో ప్రజల దగ్గర 9 కోట్ల ఆయుధాలున్నాయి. ఈ 50 ఏళ్ల కాలంలో వాటి సంఖ్య ఊహించని స్థాయిలో పెరిగింది. అదే సమయంలో ఆ తుపాకులు బలికోరుతున్న ప్రాణాల సంఖ్యా పెరిగింది. కాల్పుల్లో ప్రజలు మరణించడం అక్కడ సర్వసాధారణం.

Texas shooting: అమెరికాలోని ఓ స్కూల్‌లో కాల్పులు.. 18 మంది విద్యార్థులతో సహా 21 మంది మృతి

1968 నుంచి 2017 మధ్య తుపాకి విష సంస్కృతికి 15 లక్షల మంది అమాయకులు చనిపోయారు. 1775లో అమెరికా స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక యుద్ధాల్లో మరణించిన అమెరికా సైనికుల సంఖ్య కంటే…గన్ కల్చర్ బలితీసుకున్న సాధారణ ప్రజల సంఖ్యే ఎక్కువ. దీన్ని బట్టే ఆయుధానికి అమెరికన్ల జీవితాల్లో ఎంత ప్రాధాన్యముందో అర్థం చేసుకోవచ్చు. 2020లో అయితే ఎన్నడూ లేని విధంగా తుపాకులు హత్యలు, ఆత్మహత్యల రూపంలో 45వేలమంది అమెరికన్ల ఉసురు తీశాయి.

2018 నాటికి అమెరికాలో 39కోట్ల ఆయుధాలున్నాయి. గడచిన దశాబ్దకాలంలో ఆయుధాల సంఖ్య మరింత పెరిగింది. 2011 నాటికి ప్రతి వందమంది దగ్గర 88ఆయుధాలుంటే…ఇప్పుడు ప్రతి వందమంది దగ్గర 120 ఆయుధాలున్నాయి. ప్రస్తుతం కోటీ 10లక్షల మంది అమెరికా ప్రజల దగ్గర ఆయుధాలున్నాయి. 50ఏళ్ల క్రితమే ఆందోళనకర సమస్యగా ఉన్న గన్‌కల్చర్‌ను అగ్రరాజ్యమని చెప్పుకునే అమెరికా ఇప్పటికీ ఎందుకు పరిష్కరించలేకపోయింది..అన్న ప్రశ్నకు సమాధానం ఆయుధం కావాలని అక్కడి మెజార్టీ ప్రజలు కోరుకోవడమే.

Biden Emotional : అమెరికాలో మారణహోమం.. బైడెన్‌ భావోద్వేగం..!

తుపాకి ఉంటేనే భద్రత ఉందని ఆ దేశ ప్రజలు అనుకోవడమే. గన్ కల్చర్‌తో ఇంత విధ్వంసం జరుగుతోందని తెలిసినా ప్రజలు ఆయుధాన్ని దగ్గర ఉంచుకోవాలన్న ఆలోచన మానుకోవడం లేదు. తుపాకి సంస్కృతి విషయంలో కఠిన నిబంధనలుండాలని 52శాతం ప్రజలు కోరుకుంటుండగా, 35శాతం ప్రజలు ప్రస్తుత పరిస్థితే కొనసాగాలనుకుంటున్నారు. డెమోక్రట్లు 91శాతం కఠిన నిబంధనలుండాలంటున్నపటికీ…వాటికి మద్దతిస్తున్న రిపబ్లికన్ల సంఖ్య 24శాతంగానే ఉంది. ఫలితంగా ఎలాంటి చట్టాలూ రూపొందించుకోవడం లేదు. టెక్సాస్ విషాదంపై మాట్లాడుతూ అధ్యక్షుడు బైడన్ ఇంత నీచసంస్కృతి ఏ దేశంలోనూ లేదని వ్యాఖ్యానించడానికి కారణమిదే

అమెరికాలో గన్ కల్చర్ విస్తరించడానికి మరో ప్రధాన కారణం అక్కడ జాతీయ రైఫిల్ అసోసియేషన్ అత్యంత బలంగా ఉండడమే. ఈ అసోసియేషన్ లాబీయింగ్‌తో కాంగ్రెస్ సభ్యులను ప్రభావితం చేస్తూ కఠిన నిబంధనలు రూపొందించకుండా జాగ్రత్త పడుతోంది. గన్ కల్చర్‌తో తాను విసిగిపోయానని, ఇప్పటికైనామనం స్పందించాలని అమెరికా అధ్యక్షుడు నిస్సహాయంగా అర్థించడం గమనిస్తే..పార్టీలకతీతంగా తపాకీ దేశంపై ఎలా పట్టుసాధించిందో స్పష్టమైపోతోంది.