Covid 19 Vaccine : ఇండియాకు ఇది నిజంగా గుడ్ న్యూస్… కరోనా విజేతలకు ఒక్క డోసు టీకా చాలు..!

కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు వ్యాక్సిన్‌ ఒక్క డోస్‌ సరిపోతుందా? రెండో డోసుతో ప్రయోజనం తక్కువేనా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన పలు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఆయా దేశాలు వ్యాక్సినేషన్‌ వ్యూహాన్ని మార్చేసి, ఒక్క డోస్‌తోనే సరిపెడుతున్నాయి.

Covid 19 Vaccine : ఇండియాకు ఇది నిజంగా గుడ్ న్యూస్… కరోనా విజేతలకు ఒక్క డోసు టీకా చాలు..!

Covid 19 Vaccine

Covid 19 Vaccine : కరోనా వచ్చి తగ్గిన వాళ్లకు వ్యాక్సిన్‌ ఒక్క డోస్‌ సరిపోతుందా? రెండో డోసుతో ప్రయోజనం తక్కువేనా? అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. పాశ్చాత్య దేశాల్లో జరిగిన పలు అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో ఆయా దేశాలు వ్యాక్సినేషన్‌ వ్యూహాన్ని మార్చేసి, ఒక్క డోస్‌తోనే సరిపెడుతున్నాయి. దీనిపై మనదేశంలోనూ పరిశోధన జరిగి, ఇవే ఫలితాలు వస్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతకన్నా శుభవార్త ఇంకోటి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కరోనా వచ్చి పోతే ఒక్క డోసు చాలు:
కరోనా నుంచి కోలుకున్న వారికి వ్యాక్సిన్‌ ఒక్క డోస్‌ సరిపోతుందని విదేశీ శాస్త్రవేత్తలు చేసిన పలు అధ్యయనాల్లో తేలింది. వైరస్‌ను జయించిన వాళ్ల శరీరంలో యాంటీబాడీలు చురుకుగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలయ్యాక అమెరికాలో అధ్యయనాలు ప్రారంభమయ్యాయి. కరోనా సోకిన, సోకని వాళ్లపై టీకాల ప్రభావాన్ని అమెరికాలోని పెన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యునాలజీ అధ్యయనం చేసింది. వాటి వివరాలను గత వారం సైన్స్‌ ఇమ్యూనాలజీ మ్యాగజైన్‌లో ప్రచురించారు.

మొదటి డోసుకే వేల రెట్లు పెరిగిన యాంటీబాడీలు:
దీని ప్రకారం.. కరోనాను జయించిన వారికి ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ మొదటి డోస్‌ ఇచ్చిన తర్వాత యాంటీబాడీల రెస్పాన్స్‌ చాలా బాగుంది. రెండో డోస్‌ తర్వాత పెద్దగా మార్పు లేదు. కరోనా సోకని వారికి రెండో డోస్‌ ఇచ్చినా కొన్ని రోజులవరకు యాంటీబాడీల ప్రభావం కనిపించ లేదు. ఇటలీ, ఇజ్రాయెల్‌ తదితర దేశాల్లోనూ ఇలాంటి అధ్యయనాలే జరిగాయి. సియోటెల్‌లోని ఫ్రెడ్‌ హచిసన్‌ క్యాన్సర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు 10 మందిపై పరిశోధనలు చేయగా కరోనా వచ్చిపోయిన వాళ్లలో రెండో డోస్‌ తర్వాత పెద్ద మార్పులేమీ కన్పించ లేదట. మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చాక వారి శరీరంలో యాంటీబాడీలు కొన్ని వేల రెట్లు పెరగ్గా, రెండో డోస్‌ ఇచ్చాక యాంటీబాడీలు ఆ స్థాయిలో పెరగలేదని న్యూయార్క్‌ వర్సిటీ అధ్యయనంలో తేలింది.

మిగిలిన అధ్యయనాలు కూడా పరిశీలించాక కరోనా వచ్చిపోయిన వాళ్లకు వ్యాక్సిన్‌ ఒక్క డోస్‌ ఇస్తే చాలని నిర్ధారణకు వచ్చినట్టు న్యూయార్క్‌కు చెందిన మౌంట్‌ సినాయిలోని ఇకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ఇమ్యూనాలజిస్టు ఫ్లోరియన్‌ క్రెమర్‌ తెలిపారు. అయితే పూర్తి డాటా లేనందున ఈ వాదనను తాత్కాలికంగా పక్కనబెడుతున్నట్టు అమెరికాలోని సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ వెల్లడించింది.

యాంటీబాడీలు ఏం చేస్తాయి?
యాంటీబాడీల్లో మొదటిది టీ కిల్లర్‌ సెల్స్‌, రెండోది మెమొరీ బీ సెల్స్‌. టీ కిల్లర్స్‌ సెల్స్‌ వైరస్‌ను చంపే పని చేస్తే, మెమొరీ బీ సెల్స్‌ భవిష్యత్తులో వైరస్‌ మళ్లీ విజృంభిస్తే దాన్ని పసిగట్టి ఇమ్యూన్‌ సిస్టమ్‌ను అలర్ట్‌ చేస్తుంది. దీంతో టీ కిల్లర్‌ సెల్స్‌ తయారై వైరస్‌ను చంపేస్తాయి.

ఒక్క డోసే ఇస్తున్న యూరప్‌ దేశాలు:
కరోనాను జయించిన వారికి ఒకే డోస్‌ సరిపోతుందన్న అధ్యయనాలతో ఫ్రాన్స్‌, స్పెయిన్‌, ఇటలీ, జర్మనీ తదితర దేశాలు తమ వ్యాక్సినేషన్‌ వ్యూహాన్ని మార్చుకొని ఒకే డోస్‌తో సరిపెడుతున్నాయి. వైరస్‌ సోకి, కోలుకున్నవారికి ఒకే డోస్‌ ఇవ్వాలని ఇజ్రాయెల్‌ గత ఫిబ్రవరిలోనే నిర్ణయించి, అమలు చేస్తోంది.

భారత్ లోనూ పరిశోధన చేయాల్సిందే:
సెకండ్‌ వేవ్‌తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న భారత్‌లో పరిశోధనలు చాలా అవసరమని శాస్త్రవేత్తలు అంటున్నారు. వ్యాక్సిన్‌ కొరత ఉన్నందున కరోనా వచ్చిపోయిన వాళ్లలో మొదటి డోస్‌, రెండో డోస్‌ ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. దేశంలో ఇప్పటికే లక్షలమంది రికవర్‌ అయ్యారు. ఆరోగ్య శాఖ, లేదా ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ ఈ దిశగా అధ్యయనాలు నిర్వహిస్తే.. కోలుకున్నవారికి ఒకే డోస్‌ ఇవ్వడం ద్వారా మరింత ఎక్కువమందికి త్వరగా వ్యాక్సిన్‌ ఇచ్చే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు.