Afghanistan : అప్ఘానిస్తాన్ లో మరికొద్ది గంటల్లో తాలిబన్ ప్రభుత్వం

అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం పూర్తిగా నిష్క్రమించిన నేపథ్యంలో దేశంలో పరిపాలనా వ్యవహారాలపై తాలిబన్లు దృష్టి పెట్టారు.

Afghanistan : అప్ఘానిస్తాన్ లో మరికొద్ది గంటల్లో తాలిబన్ ప్రభుత్వం

Taliban (8)

Afghanistan అప్ఘానిస్తాన్ నుంచి అమెరికా సైన్యం పూర్తిగా నిష్క్రమించిన నేపథ్యంలో దేశంలో పరిపాలనా వ్యవహారాలపై తాలిబన్లు దృష్టి పెట్టారు. ఇప్పటికే అఫ్ఘాన్ లోని గత ప్రభుత్వాలలోని కొందరు ముఖ్య నేతలు,ఇతర ప్రముఖులతో విసృత స్థాయిలో సంప్రదింపులు జరిపిన తాలిబన్లు..మరికొన్ని గంటల్లోనే అప్ఘానిస్తాన్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారని సమాచారం.

ఒక్క పంజ్ షీర్ ఫ్రావిన్స్ తప్ప అప్ఘాన్ లోని అన్ని రాష్ట్రాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్..శుక్రవారం ప్రార్థనలు ముగిసిన తర్వాత దేశంలో నూతన ప్రభుత్వానికి సంబంధించిన వివరాలను వెల్లడించనుందని తాలిబన్ వర్గాలు తెలిపాయి. రాజధాని కాబూల్ లోని అధ్యక్ష భవనంలో ఈ కార్యక్రమం ఉంటుందని తాలిబన్ అధికార ప్రతినిధి అహ్మదుల్లా ముత్తఖీ తెలిపారు. తాలిబన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రోజువారీ పరిపాలనా వ్యవహారాలను తాలిబన్ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వంలోని ప్రత్యేక మండలి చూసుకునే అవకాశముందని తాలిబన్ ప్రతినిధులు తెలిపారు. అయితే పరిపాలన కోసం ఎటువంటి మండలి ఏర్పాటైనా దానికి అధినాయకుడిగా తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుంజాదా ఉంటారని తెలిపారు. అయితే, అప్ఘానిస్తాన్‌లో ప్రజస్వామ్యం ఇక ఉండబోదని…అటువంటి వ్యవస్థకు తమ దేశంలో పునాది లేదని తాలిబన్ ఇప్పటికే సృష్టం చేసిన విషయం తెలిసిందే.

తాలిబన్ లీడర్ షిప్ కౌన్సిల్ ద్వారా అప్ఘానిస్తాన్ లో ఇకపై పరిపాలన సాగనుంది. అయితే అఫ్గానిస్తాన్‌లో తాలిబన్‌ కౌన్సిల్‌ పాలన కొత్తేమీ కాదు. 1996 నుంచి 2001 వరకు తాలిబన్‌ చీఫ్‌గా ముల్లా ఒమర్‌ వ్యవహరించారు. ఆయన చాలా కాలం అజ్ఞాతంలోనే ఉన్నారు. రోజువారీ పాలన మాత్రం కౌన్సిల్‌ చూసుకొనేది. అదే విధంగా ఇప్పుడు కూడా అఖుండ్‌జాదా కౌన్సిల్‌ పై స్థానంలో ఉంటారు. ఆయన కింద ఉన్న వ్యక్తి అధ్యక్షుడి బాధ్యతలను నిర్వహిస్తారు. అఖుండ్‌జాదా కింద అబ్దుల్‌ ఘనీ బరాదర్‌, మౌల్వీ యాకూబ్‌, సిరాజుద్దీన్‌ హక్కానీ ఉన్నారు.

ఎవరీ ముల్లా అబ్దుల్ ఘనీ బారదార్

53 ఏళ్ల ముల్లా బారదార్‌… అఫ్గానిస్థాన్‌లోని కాందహార్ నగరంలో పెరిగారు. ఈ ప్రాంతంలోనే తాలిబన్ల ఉద్యమం పురుడు పోసుకుంది. 1970 ల చివర్లో అప్ఘానిస్తాన్ లో సోవియట్ దండయాత్ర ద్వారా క్లిష్టమైన జీవితాన్ని గడిపిన బరదార్ తిరుగుబాటుదారుడిగా ఎదిగాడు. 1980 వ దశకంలో సోవియట్-ఆఫ్ఘన్ యుద్ధంలో ఒక కన్ను కలిగిన తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌తో కలిసి బరాదర్ పోరాడాడని చెప్పుకుంటారు.

1990 లలో సోవియట్ యూనియన్ ఈ ప్రాంతం నుండి వైదొలగడంతో కొనసాగుతున్న అంతర్యుద్ధం మధ్య ముల్లా ఒమర్ తో కలిసి తాలిబాన్ సంస్థ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించాడు. 1994లో తాలిబాన్ల ఏర్పాటు తర్వాత బరాదర్ ఒక కమాండర్‌గా, వ్యూహకర్తగా కీలక పాత్రలు పోషించారు. ముల్లా ఒమర్ సజీవంగా ఉన్న సమయంలోనే ఆయన తాలిబాన్ల నిధుల సేకరణ, రోజువారీ కార్యకలాపాలకు బాధ్యులుగా ఉన్నారు. తాలిబాన్ల ఖర్చుల చిట్టా మొత్తం ఆయనే చూసుకుంటారు.

2001లో అమెరికా నేతృత్వంలో అఫ్గానిస్తాన్ మీద దాడులు జరిగి, తాలిబాన్లు అధికారం కోల్పోయినపుడు నాటో బలగాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ నాయకత్వం వహించారు. తాలిబాన్లు అధికారం కోల్పోయిన సమయంలో తాలిబాన్ల ప్రభుత్వంలో ఆయన రక్షణ శాఖ ఉప మంత్రిగా ఉన్నారు. ఇక, ఆ సమయంలో ఉగ్రవాదులకు కొత్త నాయకత్వాన్ని అందించాలని.. అప్పటి తాలిబాన్ తాత్కాలిక నాయకుడు హమీద్ కర్జాయ్ పై సాగిన ఒక చిన్న తిరుగుబాటు దారులలో బరదార్ ఉన్నాడని అంటారు.

2010 లో పాకిస్తాన్‌లోని కరాచీ సమీపంలో ముల్లా బరదార్‌ను పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌, సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారులు అరెస్ట్‌ చేశారు. అప్పటి నుంచే పాక్‌ జైలులోనే ఉన్న ముల్లా బరదార్. 2018లో శాంతి చర్చలను ప్రోత్సహించడానికి అప్పటి అఫ్గానిస్తాన్ ప్రభుత్వం కొంతమంది బందీల విడుదలకు సంబంధించి ఒక జాబితాను ప్రచురించింది. వారిలో బరాదర్ పేరు కూడా ఉంది. 2018 అక్టోబర్‌ 24న బరాదర్ ని అమెరికా విజ్ణప్తి మేరకు జైలు నుంచి విడుదల చేసింది పాకిస్తాన్.

పాకిస్తాన్ జైలు నుంచి విడుదలైన తర్వాత ఖతార్‌కు వెళ్లిన ముల్లా బరాదర్.. అక్కడే తాలిబన్ల రాజకీయ పార్టీ అధిపతిగా బాధ్యతలు నిర్వహించాడు. అప్పటి నుంచి దోహాలోఅమెరికన్లతో కీలక చర్చలను ఆయనే పర్యవేక్షించారు. అఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా బలగాలను పూర్తిగా తొలగించాలని కోరుతూ అమెరికా ఉపసంహరణ ఒప్పందంపై సంతకం చేయడాన్ని కూడా ఆయన పర్యవేక్షించారు.

హైబతుల్లా అఖుంజాదా
తాలిబన్ గ్రూప్ సుప్రీం లీడర్. మతపర వ్యవహరాలకు అధిపతిగా ఉన్నారు. విశ్వాసం గల వ్యక్తి అని ఇతనికి పేరుంది. 1980వ దశకంలో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా అఫ్గానిస్తాన్ చేసిన తిరుగుబాటులో హైబతుల్లా కమాండర్ పాత్ర పోషించారు. కానీ ఆయనకు సైనిక కమాండర్ కంటే ఎక్కువగా ఇస్లాం పండితుడుగానే గుర్తింపు ఉంది. 1994 లో, సోవియట్ యూనియన్ అఫ్ఘానిస్తాన్‌ను విడిచిపెట్టిన తర్వాత, హైబతుల్లా తాలిబాన్‌లో చేరాడు. తాలిబన్ ప్రారంభ సభ్యులలో హైబతుల్లా ఒకడు. 1995 లో తాలిబన్లు ఫరా ప్రావిన్స్‌పై నియంత్రణ సాధించిన తర్వాత, అక్కడి పోలీసు విభాగంలో డిప్యూటీగా వ్యవహరించేవారు. ఆ తర్వాత అతను తూర్పు నంగర్‌హార్ ప్రావిన్స్‌లోని తాలిబాన్ సైనిక న్యాయస్థానానికి అధిపతిగా ఆ తరువాత సుప్రీంకోర్టు డిప్యూటీ హెడ్ గా వ్యవహరించారు. దోషులుగా తేలిన హంతకులకు, అక్రమ సంబంధాలు పెట్టుకునేవారికి మరణదండన, దొంగతనం చేసేవారికి చేతులు నరకాలని ఆదేశాలు జారీ చేశారు. తరువాత కాందహార్‌కు వెళ్లాడు. అక్కడ తాలిబాన్ వ్యవస్థాపక నాయకుడు మహమ్మద్ ఒమర్ చూసుకునే జిహాదీ మదరసాలో బోధకుడిగా చేశారు.

తాలిబాన్ల మాజీ చీఫ్ అఖ్తర్ మొహమ్మద్ మన్సూర్‌కు హీబాతుల్లా డిప్యూటీగా కూడా అఖుంజాదా ఉన్నారు. 2016లో జరిగిన అమెరికా డ్రోన్ దాడుల్లో మన్సూర్ చనిపోయారు. ఆయన తన వీలునామాలో హీబాతుల్లాను తన వారసుడుగా ప్రకటించారు. అయితే, ఆయన ఎంపిక ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం అని తాలిబాన్లు చెప్పారు. దాదాపు 60 ఏళ్ల వయసున్న హైబతుల్లా తన జీవితంలో ఎక్కువ భాగం అఫ్గానిస్తాన్‌లోనే గడిపారు. క్వెట్టాలోని తాలిబాన్ల షురాతో కూడా ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.

READTaliban : అప్ఘానిస్తాన్ లో తాలిబన్ పాలన స్టార్ట్..పెత్తనమంతా ఆ నలుగురిదే!