ట్రంప్.. గాంధీని అవమానించాడంటోన్న ఒవైసీ

ట్రంప్.. గాంధీని అవమానించాడంటోన్న ఒవైసీ

ఏఐఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బుధవారం ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించారు. పీఎం నరేంద్ర మోడీని పొగిడే క్రమంలో భారత జాతిపిత మహాత్మగాంధీని అవమానించాడన్నారు. చదువురాని డొనాల్డ్ ట్రంప్ భారత చరిత్ర గురించి ఏమీ తెలియకుండానే స్పందించాడని అమెరికా ప్రెసిడెంట్ భారత గౌరవాన్ని భంగపరిచాడని ఆరోపించారు.

‘ట్రంప్‌కు స్వాతంత్ర్య పోరాటం గురించి ఏమీ తెలియదు. మోడీ జాతిపిత ఎప్పటికీ కాలేడు. అందుకని మహాత్మగాంధీతో అతణ్ని ఎప్పటికీ పోల్చలేం. జవహర్ లాల్, సర్దార్ పటేల్ లాంటి వాళ్లకే అలాంటి పేరు ఇవ్వడం లేదు. ఇది అతని తెలివికే వదిలేస్తున్నా. కానీ, నేను మోడీ జాతిపిత అనే టైటిల్‌ను ఒప్పుకోను. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ వివరణ ఇస్తారని ఆశిస్తున్నా’ అని అన్నాడు. 

పీఎం మోడీ, అమెరికన్ సంగీతకారుడు ఎల్విస్ ప్రెస్లీల మధ్య పోలిక గురించి మాట్లాడుతూ.. ‘వారిద్దరి మధ్యా చిన్నపాటి బంధం ఉంది. ఎల్విస్ పాటలతో ఆకట్టుకుంటాడు. మోడీ కూడా స్పీచ్‌లతో ప్రజలతో ఆకట్టుకుంటాడని పోల్చాడు. కానీ, నా ప్రధానిని ఓ గాయకునితో పోల్చి గౌరవం తగ్గించడం నాకు నచ్చడం లేదు’ అన్నాడు. 

‘ట్రంప్ ఒక డబుల్ గేమ్ ఆడుతున్నాడు. అతను మోడీతో పాటు ఇమ్రాన్ ఖాన్‌ను కూడా పొగుడుతున్నాడు. మనం ట్రంప్ డబుల్ గేమ్‌ను పసిగట్టాలి’ అని ఒవైసీ ట్రంప్ వ్యాఖ్యలపై సంచలన ఆరోపణలు చేశారు.