Sri Lanka Crisis : పెట్రోల్ కోసం రోజంతా క్యూలైన్ లోనే…గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి

శ్రీలంకలో ఇంధన సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రాజధాని కొలంబో శివారు పానదురాలో  డీజిల్ కోసం క్యూలైన్ లో ఉన్న ఆటో డ్రైవర్(53) బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు.

Sri Lanka Crisis : పెట్రోల్ కోసం రోజంతా క్యూలైన్ లోనే…గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి

Srilanka

Sri Lanka Crisis :  శ్రీలంకలో ఇంధన సంక్షోభం కొనసాగుతూనే ఉంది. రాజధాని కొలంబో శివారు పానదురాలో  డీజిల్ కోసం క్యూలైన్ లో ఉన్న ఆటో డ్రైవర్(53) బుధవారం రాత్రి గుండెపోటుతో మరణించాడు. డీజిల్ కోసం ఎదురు చూస్తూ ఆటోలోనే ఉన్న డ్రైవర్ తన వాహనంలోనే గుండె పోటుతో మరణించాడని  అధికారులు తెలిపారు. శ్రీలంకలో కొన్ని నెలలుగా ఇంధన సమస్య వెంటాడుతోంది. పెట్రోల్, డీజిల్  కోసం బంకుల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు.

రోజుల తరబడి క్యూ లైన్లలో నిలబడలేక వాహనాలను బంకుల దగ్గరే వదిలేసి వెళ్లిపోతున్నారు కొందరు ప్రజలు.  శ్రీలంకలో పెట్రోల్‌ కోసం లైన్‌లో నిలబడి చనిపోవడం ఇదే మొదటి సారి కాదు.  ఒక వ్యక్తి ఎండ వేడికి అలసటతో మరణించాడు.  గడిచిన రెండు నెలల కాలంలో కనీసం నలుగురు చనిపోయారు.

కొలంబోకు వాయువ్యంగా ఉన్న పుగోడ అనే ప్రాంతంలో వంటగ్యాస్‌ కోసం క్యూలైన్‌లో నిలబడి బుధవారం 64 ఏండ్ల వృద్ధుడు కూడా మరణించాడు. దేశంలో  సిలోన్ పెట్రోలియం కార్పోరేషన్ ద్వారా 700 మిలియన లీటర్ల డీజిలో లోడ్ వచ్చిందని ఇది ప్రాధాన్యతా క్రమంలో అత్యవసర సేవల కోసం ఉపయోగించే వాహనాలకు పంపిణీ చేస్తామని ప్రధాన మంత్రి రణిల్ విక్రమ్ సింఘే చెప్పారు.

ఈ ఇంధనం మూడు రోజులపాటు సరిపోతుందని… భారత్ నుంచి మరో 500 మిలియన్ డాలర్లకు సరిపడా ఇంధనం త్వరలో వస్తుందని ఆయన తెలిపారు. శ్రీలంకలో ఇంధన కొరత వల్ల రవాణా సౌకర్యాలు కూడా నిలిచిపోయాయని జాతీయ రవాణా సంఘం తెలిపింది.  డాలర్ల కొరత కారణంగా ఇంధనాలు దిగుమతి చేసుకోలేని పరిస్ధితి ఉందని రైల్వే శాఖ తెలిపింది.

శ్రీలంకలో ఆర్ధిక సంక్షోభం కారణంగా ముఖ్యంగా ఆహారం, మందులు,  వంటగ్యాస్, ఇతర ఇంధనాలు, అగ్గిపెట్టెలు వంటి నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడింది. పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండటంతో అనేక ప్రాంతాలలో ప్రజలు రోడ్లపై ఆందోళన చేపట్టారు.

ఇంధనం లేకపోవటంతో 50 శాతానికి పైగా ప్రజా రవాణా వ్యవస్ధ కుంటుపడిందని అధికారులు తెలిపారు. 1948లో స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యంత దారుణమైన ఆర్ధిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కోంటోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Also Read : ATM Cash Theft : ఏటీఎంలలో డబ్బు డిపాజిట్ చేస్తూ చేతివాటం చూపిన వ్యక్తి అరెస్ట్