CHINA Population fall : భారీ స్థాయిలో తగ్గిపోతున్న చైనా జనాభా.. 61 ఏళ్లలో ఇదే మొదటిసారి

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది అంటే ఠక్కున  చెప్పేస్తాం ‘చైనా’అని. కానీ..ఇప్పుడా పరిస్థితి లేదు.  పాపులేషన్ విషయంలో.. చైనా లెక్క తప్పుతోంది. చైనా కంటే ఎక్కవ జనాభాకలిగిన దేశంగా భారత్ అవతరించబోతోంది. చైనాలో జనాభా తగ్గిపోతోంది. జననాల రేటు భారీ స్థాయిలో తగ్గిపోతోంది. 60 ఏళ్లలో చైనాలో జనాభా తగ్గడం ఇదే తొలిసారి.

CHINA Population fall : భారీ స్థాయిలో తగ్గిపోతున్న చైనా జనాభా.. 61 ఏళ్లలో ఇదే మొదటిసారి

CHINA Population fall

CHINA Population fall : ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది అంటే ఠక్కున  చెప్పేస్తాం ‘చైనా’అని. కానీ..ఇప్పుడా పరిస్థితి లేదు.  పాపులేషన్ విషయంలో.. చైనా లెక్క తప్పుతోంది. చైనా కంటే ఎక్కవ జనాభాకలిగిన దేశంగా భారత్ అవతరించబోతోంది. చైనాలో జనాభా తగ్గిపోతోంది. జననాల రేటు భారీ స్థాయిలో తగ్గిపోతోంది. 60 ఏళ్లలో చైనాలో జనాభా తగ్గడం ఇదే తొలిసారి. ఇప్పటికే.. యువత శాతం తగ్గి తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్న చైనాకు.. జననాల రేటు పడిపోవడం, జనాభా తగ్గిపోవడం లాంటివి.. ఆందోళనకరంగా మారాయ్. అయితే.. ఇది భవిష్యత్తులో చైనాకు మేలు చేస్తుందా? ఊహించని సంక్షోభంలో ముంచేస్తుందా?

2022 డిసెంబర్ 31 నాటికి.. చైనా జనాభా 141 కోట్ల 17 లక్షల 50 వేలు. అంతకుముందు ఏడాది 2021తో పోలిస్తే.. ఆ దేశ జనాభా ఏకంగా 8 లక్షల 50 వేలు తగ్గింది. చైనాలో జనాభా తగ్గడమనేది కొత్తమీ కానప్పటికీ.. 1961 తర్వాత మరణాల కన్నా జననాల సంఖ్య తక్కువగా ఉండడం ఇదే తొలిసారి. చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన ఈ లెక్కలు.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయ్. 1950 నుంచి ఎన్‌బీఎస్ చైనా వార్షిక జనాభా అంచనాలను అందిస్తోంది. తాజా డేటాను పరిశీలిస్తే.. 1960-1961లో జనాభా వరుసగా క్షీణించిన తర్వాత.. తొలిసారి 2022లో జనాభా తగ్గుదల కనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఇది చైనాలో పాపులేషన్ క్రైసిస్ దిశగా వెళుతోందనే చర్చ జరుగుతోంది.

1960లో మావో జెడాంగ్ విధానాలు, గ్రేట్ లీఫ్ ఫార్వార్డ్‌తో పాటు బలమైన చైనీస్ ఆర్థిక వ్యవస్థను నెలకొల్పేందుకు.. బలవంతపు పారిశ్రామికీకరణ విధానాల కోసం చేసిన ప్రయత్నాల కారణంగా.. అప్పుడు కరవు పరిస్థితులు ఏర్పడ్డాయి. జనాభాలోనూ క్షీణత కనిపించింది. అయితే.. 2022లో చైనా జనాభాలో తగ్గుదల పూర్తిగా ఊహించిన స్థాయిలోనే ఉంది. గతేడాది ఐక్యరాజ్యసమితి అంచనా వేసినట్లుగానే.. మన పొరుగు దేశంలో పాపులేషన్ తగ్గింది. అంతేకాదు.. ఈ ఏడాది ముగిసేనాటికి.. భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను రీప్లేస్ చేస్తుందని కూడా యూఎన్ అంచనా వేసింది. చైనా జనాభా ఇప్పటి నుంచి తగ్గుతూనే ఉంటుంది. అంతేకాదు.. ప్రపంచ జనాభాలో దాని వాటి 2021లో 18 శాతంగా ఉంది. ఇది.. 2050 నాటికి 13 శాతానికి, 2100 నాటికి 7 శాతానికి తగ్గుతుందనే అంచనాలున్నాయి.

ఒకప్పుడు.. జనాభా పెరిగిపోతోందని.. వన్ చైల్డ్ పాలసీని ఎంతో కఠినంగా అమలు చేసింది చైనా. ఇప్పుడు జనాభా పడిపోతుండటంతో ఏం చేయాలో తెలియక.. దయచేసి ఎక్కువ మంది పిల్లలను కనండని.. చైనా జంటలను బతిమాలుతోంది. దశాబ్దాల పాటు దేశంలోని కుటుంబాలను ఒక బిడ్డకు మాత్రమే పరిమితం చేసిన తర్వాత.. ఇప్పుడు అక్కడి ప్రభుత్వం ఇస్తున్న సందేశం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చైనాలో జనాభా క్షీణతకు.. జననాల రేటు స్థిరంగా తగ్గిపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అనేక దశాబ్దాలుగా.. ఆ దేశంలో మరణాల రేటు చాలా వరకు స్థిరంగా ఉండేది. కానీ.. ఇప్పుడు జననాల కంటే మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయ్. 2022లోనూ ఇదే సీన్ కనిపించింది. 1976 తర్వాత.. ఇలా జరగడం ఇదే తొలిసారి. ప్రతి వెయ్యి మందిలో మరణాల రేటు 7.18గా నమోదైంది. 1976లో ఇది 7.37గా రికార్డ్ అయింది. 2022లో 1000 మంది మహిళలకు.. జాతీయ జననాల రేటు 6.77‌గా రికార్డ్ అయింది. 2021లో ఇది 7.52గా ఉండేది. ఇప్పుడు జననాల రేటు తగ్గుతోందని బాధపడుతున్నా.. మొదట్లో దానినే సక్సెస్ స్టోరీగా భావించింది డ్రాగన్.

దేశ జనాభాను నియంత్రించేందుకు 1980ల కాలంలో వన్ చైల్డ్ పాలసీని అమలు చేసింది చైనా. దాని ప్రకారం.. దంపతులు ఒకే బిడ్డకు జన్మనివ్వాలి. ఈ విధానం కొన్నేళ్లకు వికటించింది. చైనా జనాభాలో వృద్ధుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. పని చేసే యువత సంఖ్య భారీగా తగ్గిపోయింది. దాంతో.. 2016లో అధికారికంగా ఇద్దరు పిల్లలను కనొచ్చంటూ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. కానీ..పరిస్థితులు మారలేదు. దీంతో.. 2021కి వచ్చేసరికి మూడో బిడ్డను కూడా కనొచ్చంటూ జిన్‌పింగ్ సర్కార్‌ అనుమతించింది. అయినప్పటికీ.. జననాల రేటు తగ్గుతూనే ఉంది. ఇందుకు.. చైనా జంటల ఆలోచనా తీరులో వచ్చిన మార్పే కారణంగా తెలుస్తోంది. అక్కడి ప్రజలు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇందుకు.. పిల్లల పోషణ భారంతో పాటు వారి జీవనానికి అవసరమయ్యే ఖర్చులు పెరిగిపోతాయనే అభద్రతాభావంలో ఉన్నారు. ఆ భయం వల్లే యువ జంటలు ఎక్కువ మంది పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదు. మారుతున్న కాలానికి అనుగుణంగా.. ఆర్థికపరమైన ఆందోళనలతో.. చాలా మంది దంపతులు.. ఒక బిడ్డను కనడానికే ఇష్టపడుతున్నారు.

మరోవైపు.. మూడేళ్లుగా చైనాను కోవిడ్ అతలాకుతలం చేస్తోంది. వైరస్ వల్ల.. ఆ దేశంలో లక్షలాది మరణాలు సంభవించినట్లు సమాచారముంది. చైనా ప్రభుత్వం మరణాలకు సంబంధించిన వాస్తవ లెక్కలు.. బయటకు చెప్పకపోయినా.. అక్కడ ఊహించని స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయనే టాక్ ఉంది. ఒక్క జనాభాలోనే కాదు.. చైనా వృద్ధిలోనూ క్షీణత కనిపిస్తోంది. 2022లో.. చైనాలో జీడీపీ వృద్ధి 3 శాతంగా నమోదైంది. గడిచిన 50 ఏళ్లలో.. ఆ దేశానికి ఇదే రెండో అత్యల్వ వృద్ధి. ఇటీవల.. అక్కడ జీరో కోవిడ్ పాలసీని ఎత్తేయడంతో.. ఈ మాత్రం వృద్ధినైనా చైనా సాధించగలిగింది. లేకపోతే.. పరిస్థితి మరీ దారుణంగా ఉండేదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.

జనాభా తగ్గుదలతో.. చైనా ఊహించని స్థాయిలో ఆర్థికపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పేద ఆసియా దేశం నుంచి ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది చైనా. డ్రాగన్ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పు.. ఆధునిక పెట్టుబడిదారీ చరిత్రలోనే కీలక మలుపుగా చెప్పొచ్చు. చైనా.. ప్రపంచ కర్మాగారంగా స్థిరపడటానికి, ఆర్థిక వృద్ధికి.. భారీ స్థాయిలో చదువుకున్న యువత, చౌకగా దొరికిన కార్మికులే మూల కారణాలుగా చెప్పొచ్చు. అయితే.. ప్రస్తుతం చైనాలో పెరుగుతున్న వృద్ధాప్యం, పడిపోతున్న జనాభా.. తన ఆర్థిక వృద్ధిని స్థిరంగా కొనసాగించేందుకు అవసరమైన, చౌకగా దొరికే కార్మికులు దొరకడం కష్టమవుతుంది. అందుకే.. జనాభా తగ్గుదల విషయంలో చైనా ఇంతలా ఆందోళన చెందుతోంది.