జాగ్రత్తగా ఉండండి : పంజా విసురుతున్న కరోనా వైరస్

  • Published By: madhu ,Published On : February 28, 2020 / 08:00 AM IST
జాగ్రత్తగా ఉండండి : పంజా విసురుతున్న కరోనా వైరస్

కరోనా వైరస్ (Coronavirus) పంజా విసురుతోంది. చైనాలో మొదలైన ఈ మహమ్మారి… 49 దేశాలకు విస్తరించింది. దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీలోనూ  మరణ మృదంగం మోగిస్తోంది. బ్రెజిల్‌లోనూ కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాకాటుకు 2 వేల 858మంది బలవ్వగా… బాధితుల సంఖ్య 83వేలు దాటింది. చైనాతోపాటు ఇతర దేశాల్లోను బాధితులు, మృతుల సంఖ్య పెరగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.

ఒక్క రోజే 44 మంది మృతి : –
చైనాలో మొన్నటివరకు కాస్త తగ్గుముఖం పట్టినట్టు కనిపించిన కరోనా.. మళ్లీ పంజా విసురుతోంది. 2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువారం అధిక సంఖ్యలో కొత్త కేసులు నమోదవడం ఆందోళన రేపుతోంది. గురువారం మరో 44 మంది ప్రాణాలు కోల్పోగా, 335 కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో ఇప్పటివరకు 78వేల 832 కరోనా కేసులు నమోదవగా… అందులో 36వేల128మంది కోలుకున్నారు. 7వేల 952 మంది పరిస్థితి విషమంగా ఉంది.

దక్షిణ కొరియాలో : – 
చైనాతోపాటు… దక్షిణ కొరియాలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. సౌత్ కొరియాలో మొత్తం 2వేల 22 కేసులు నమోదవగా.. ఇప్పటికే 13 మంది చనిపోయారు. అయితే… చైనాను మించి ఇక్కడ కరోనా కేసులు పెరుగుతుండటంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నిన్న ఒక్కరోజే దక్షిణ కొరియాలో కొత్తగా 761మందికి ఆ వైరస్ సోకింది. రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరుగుతాయని భావిస్తున్నారు.

ఇటీలీ, ఇరాన్‌లలో : –
ఇటలీ, ఇరాన్‌లను కూడా ఈ వైరస్ తీవ్రంగా కలవరపెడుతోంది. ప్రాణాంతక వైరస్ బారిన పడి ఇరాన్‌లో ఇప్పటికే 26 మంది మృత్యువాతపడగా.. తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షుల్లో ఒకరైన మసౌమె ఎబ్తేకర్‌కు కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇటలీలోను ఈ వ్యాధి బారినపడి 17మంది మృతిచెందగా… మరో 655 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జపాన్‌లోని  యెకహోమా తీరంలో నిలిచిపోయిన డైమండ్ ప్రిన్సెస్ విహార నౌక (cruise ship Diamond Princess)లోని నలుగురిని కూడా కరోనా బలి తీసుకుంది. మరో 36 మంది పరిస్థితి విషమంగా ఉంది. డైమండ్ ప్రిన్సెస్ నౌకలోని 705 మందికి కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అవగా… ఆ నౌకలోని భారతీయులను నిన్న ఢిల్లీకి తీసుకువచ్చారు. అనంతరం వారిని 14రోజుల పరిశీలన కోసం చావ్లాలోని ఐటీబీపీ శిబిరానికి తరలించారు.

అప్రమత్తమైన అగ్రరాజ్యం : – 
ఆసియా, ఐరోపా, మధ్య ఆసియాలోను కరోనా వైరస్ ప్రబలమవుతున్న వేళ అగ్రరాజ్యం కూడా అప్రమత్తమయ్యింది. ఆ రక్కసిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉండాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అటు సౌదీ అరేబియా కూడా మదీనా సందర్శనకు వచ్చే యాత్రికులను తాత్కాలికంగా నిషేధించింది. కరోనా వైరస్ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు వీసాలను కూడా రద్దుచేసింది. అంతేకాదు… వైరస్ ఉన్నదేశాలకు ప్రయాణాలను వాయిదావేసుకోవాలని తమ పౌరులకు సూచించింది.

Read More : అంకిత్ శర్మ శరీరంపై 400 కత్తిపోట్లు..ఛిద్రమైన పేగులు