Quan Hongchan : అమ్మ కోసం..14 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని సాధించిన చిన్నారి

అమ్మ కోసం అమ్మ ఆరోగ్యం కోసం ప్రారంభమైన ఓ 14 ఏళ్ల చిన్నారి ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించేదాకా చేరింది. అనారోగ్యానికి గురైన తల్లికి ఏమైనా చేయాలనే తపనతో ఆరంభమైన చైనా చిన్నారి క్వాన్ హాంగ్ చాన్ దేశానికి బంగారు పతకం సాధించేదాకా సాగింది. ఇంతటి ఘనత సాధించిన ఆ చిన్నారి చైనాలో బిగ్గెస్ట్ సెలబ్రిటీ గా మారిపోయింది.

Quan Hongchan : అమ్మ కోసం..14 ఏళ్లకే ఒలింపిక్స్‌లో పసిడి పతకాన్ని సాధించిన చిన్నారి

Uan Hongchan

Quan Hongchan : 14 ఏళ్ల చిన్నారి అంటే స్కూల్ కెళ్లమని అమ్మ చెబితే మారాం చేసే చిరుప్రాయం. కానీ అంత చిన్న వయస్సులోనే అమ్మ కోసం ఏకంగా ఒలింపిక్స్ క్రీడల్లోనే సత్తా చాటి బంగారు పతకాన్ని గెలిచి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అమ్మ కోసమే ఆటల్లోకొచ్చింది. ప్రపంచ క్రీడల్లో పాల్గొనే అర్హత సాధించింది. అంతేకాదు టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని మొత్తం క్రీడా ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. ఇంత చిన్న వయస్సులోనే అమ్మ కోసం..అమ్మ ఆరోగ్యం కోసం ఇంత సాధించిన చైనాకు చెందిన 14 ఏళ్ల చిచ్చర పిడుగు ‘క్వాన్ హాంగ్‌చాన్‘. చైనాలోని గ్వాడాంగ్ ప్రావిన్సులోని ఓ కుగ్రామంలో విరిసిన ‘పసిడి’ పుష్పం క్వాన్ హాంగ్ చాన్.

చిన్నారి క్వాన్‌ అత్యంత సామాన్య కుటుంబంలో పుట్టింది. దీనికి తోడు 2017లో క్వాన్ తల్లికి యాక్సిడెంట్ గురికావటంతో పలు ఆరోగ్యం సమస్యలకు గురైంది. ఆమెకు వైద్యం చేయించటం కుటుంబానికి పెను భారంగా మారింది. తండ్రి చిన్న రైతు. వారికున్న కొద్దిపాటి పొలంలో పండించి పంటపై వచ్చే ఆదాయమే వారికి ఆధారం. కానీ అంత చిన్న వయస్సులోనే క్వాన్ కుటుంబ పరిస్ధితిని అర్థం చేసుకుంది. తల్లి ఆరోగ్య సమస్యలు, ఆర్థిక కష్టాలు వెరసి తానేమైనా చేయాలంటే ఏం చేయాలి? అని ఆ చిన్న బుర్రలో నిరంతరం ఆలోచనలు. అలా స్కూల్ విద్యార్దుల కోసం ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంప్ లో జాయిన్ అయ్యింది. ఆటల్లో పాల్గొంది. అలా డైవింగ్‌లో ఆమె టాలెంట్ వెలుగులోకి వచ్చింది. దాంతోనే ఎలాగైనా క్రీడల్లో రాణించాలని నిర్ణయించుకుంది. తద్వారా కుటుంబానికి తనవంతుగా ఏదైనా చేయాలని అనుకుందా చిన్నారి. డైవింగ్‌ ప్రాక్టీస్ చేస్తుండేది.ప్రతిరోజూ 400 డైవ్‌లు ప్రాక్టీస్ చేసేది. అలా మొదలైన ఆమె చిరు ప్రయాణం చివరికి టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి పతకం గెలుచుకునే దాకా వెళ్లింది. అంటే ఆ చిన్నారి కుటుంబం కోసం ఎంతగా ఆలోచించింది? క్రీడల్లో రాణిస్తే తనకో గుర్తింపుతో పాటు కుటుంబానికి ఎంతో కొంత సహాయంగా ఉండాలని ఆ చిన్నారి ఆలోచన దేశానికే పసిడి పతకం తెచ్చేదాకా వెళ్లింది అంటే ఆమె నిర్ణయం ఎంత పటిష్టమైనదో ఆలోచించుకోవచ్చు.

అలా ఓ అతి సామాన్య కుటుంబంలో పుట్టి అమ్మ కోసం ఆలోచించిన క్వాన్ పసిడి పతకం ఒడిసి పట్టేదాకా ఆమె ప్రయనం కొనసాగింది. అదే పట్టుదల క్వాన్ ను చైనాలో ఓ సెలెబ్రిటీని చేసింది. పసడి పతకంతో చైనాకు పేరు ప్రతిష్ఠలు తెచ్చిన క్వాన్ ను ఆర్థికంగా ఆదుకోవటానికి ఎంతోమంది ముందుకొచ్చారు. భారీ నజరానాలు ప్రకటించారు. ఫ్లాట్లను బహుమానంగా ఇస్తామంటూ ముందుకు వచ్చారు. ‘‘30 వేల డాలర్ల విలువైన కమర్షియల్ కాంప్లెక్స్ కూడా ఇస్తామంటూ ఒక వ్యాపారి ప్రకటించారు. మరి కొందరు ఫ్లాట్ ఇస్తామన్నారు. కానీ అవేవీ మాకొద్దని క్వాన్ తండ్రి మీడియాకు వెల్లడించారు. క్వాన్ తండ్రి తమకున్న కొద్దిపాటి స్థలంలో బత్తాయి పళ్లను పండిస్తుంటారు. వ్యవసాయం మీద వచ్చిన ఆదాయంతోనే కుంటుంబాన్ని పోషిస్తుంటారు.

మరోవైపు.. ఒక్కసారిగా వచ్చిపడ్డ పాపులారిటీతో రాక్‌స్టార్‌గా మారిన క్వాన్‌ను చూసేందుకు చైనా నలువైపుల నుంచి సందర్శకులు ఆమె నివసించే చిన్న గ్రామానికి భారీగా తరలి వస్తున్నారు. క్వాన్‌తో సెల్ఫీలు దిగటానికి..ఇంటర్వ్యూలు తీసుకునేందుకు క్యూకడుతున్నారు. దీంతో క్వాన్ కుటుంబానికి నిద్ర కరువైంది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే చిన్న గ్రామంలో సందర్శకుల హడావుడి అంతా ఇంతా కాదు. వాహనాలు రద్దీ పెరిగింది. దీంతో గ్రామస్థులకు పలు ఇబ్బందులు కూడా వచ్చాయి. ముఖ్యంగా వృద్ధులు ఇబ్బంది పడ్డారు ఆరోగ్య కారణాల వల్ల.

దీంతో క్వాన్ కుటుంబం దయచేసి మా గ్రామానికి ఎవ్వరూ రావద్దు అని విజ్ఞప్తి చేశారు. ‘‘ఇక్కడికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. అయితే.. పోస్టు ద్వారా లేదా ఇతర మార్గాల్లో ప్రజలు మాకు శుభాకాంక్షలు చెబితే చాలు. ఇక్కడిదాకా రావాల్సిన అవసరం లేదు. దీని వల్ల మీకు, మాకూ ఇబ్బంది కలుగుతోంది. మాకు బహుమతులు కూడా అవసరం లేదు.. మా బిడ్డ సాధించిన ఈ ఘనతే మాకు చాలు..మా కుటుంబానికి పేరు ప్రతిష్టలు తెచ్చిన మా బిడ్డే మాకు పెద్ద బహుమానం’’ అని క్వాన్ తండ్రి తెలిపారు.