నాపై చర్యలు తీసుకుంటే ఖబడ్డార్ : పాక్ కు.. టెర్రరిస్ట్ మసూద్ వార్నింగ్

  • Published By: venkaiahnaidu ,Published On : February 22, 2019 / 11:22 AM IST
నాపై చర్యలు తీసుకుంటే ఖబడ్డార్ : పాక్ కు.. టెర్రరిస్ట్ మసూద్ వార్నింగ్

పుల్వామా ఉగ్రదాడితో పాక్ తో ఇక చర్చల అన్న మాటను పక్కనబెట్టిన భారత్ కఠిన చర్యలకు దిగుతోంది.  ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేందుకు దౌత్యపరంగా కూడా భారత్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ సమయంలో తనకు మూడిందనే విషయాన్ని పసిగట్టిన ఉగ్రసంస్థ జైషే మహమద్ చీఫ్ మసూద్ అజార్.. భారత్ ఒత్తిళ్లకు తలొగ్గి తనపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పాక్ ప్రభుత్వాన్ని, ఆర్మీని, ఐఎస్ఐని హెచ్చరించాడు. మసూద్ అజార్ పాక్ ప్రభుత్వంతో పాటు మీడియాను హెచ్చరిస్తున్న ఓ ఆడియో క్లిప్ రిలీజ్ అయింది.  ఆ ఆడియో సందేశంలో..భారత ప్రధాని బెదిరింపులకు ప్రతిగా పాక్ ప్రధాని స్పందన చాలా పేలవంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే భారత్ కు పాక్ భయపడుతున్నట్లుగా ఉంది.

పాక్ స్పందనతో తాను చాలా నిరాశకు గురయ్యానని అజార్ తెలిపారు. అదేవిధంగా పుల్వామా దాడి త్వరలో భారత్ లో జరుగనున్న ఎన్నికల్లో మోడీకి లాభం చేకూర్చనుంది అంటూ పాక్ మీడియాలో వస్తున్న విశ్లేషణలను అజార్ ఖండించాడు. కాశ్మీర్ లో ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం చర్చలు ఫలిస్తున్నాయన్న మోడీ వాదన..ఈ దాడితో తేలిపోయిందని మసూద్ అజార్ అభిప్రాయపడ్డాడు.

పాక్ పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న సమయంలో తనపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో పాక్ ప్రభుత్వం అని మసూద్ అజార్ భయపడుతున్నాడని, అందుకే పాక్ ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాడని ఓ సీనియర్ అధికారి తెలిపారు. మరోవైపు మసూద్ అజార్ ని ఏక్యరాజ్య సమితి  గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. మసూద్ అజార్ విషయంలో భారత నిర్ణయాన్ని పలు దేశాలు బహిరంగానే సపోర్ట్ చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం మసూద్ ని గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించేందుకు వీల్లేకుండా అడ్డుకుంటోంది.