North Korea Kim Jong Un : మా స్టైల్లోనే మేము కోవిడ్ తో పోరాడతాం.. వ్యాక్సిన్ అక్కర్లేదు

కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని ముందుకు వచ్చిన కొవాక్స్ కూటమికి   నో   చెప్పారు ఉత్తర కొరియా నియంత కిమ్... తమ సొంత స్టైల్లోనే కోవిడ్ ను ఎదుర్కోంటామని ఆయన చెప్పుకొచ్చారు

North Korea Kim Jong Un : మా స్టైల్లోనే మేము కోవిడ్ తో పోరాడతాం.. వ్యాక్సిన్ అక్కర్లేదు

Kim Jong un

North Korea Kim Jong Un :  కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచంమంతా సంక్షోభంలో కూరుకుపోయి దాని బారినుంచి బయటపడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.  అన్నిదేశాలు ఒకవైపు కోవిడ్ ఆంక్షలు అమలు చేస్తూ మరోవైపు వ్యాక్సిన్ పంపిణీకి కృషి చేస్తున్నాయి.  కానీ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మాత్రం తన రూటే సెపరేట్ అంటూ వ్యవహరిస్తున్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ అందిస్తామని ముందుకు వచ్చిన కొవాక్స్ కూటమికి   నో   చెప్పారు ఉత్తర కొరియా నియంత కిమ్… తమ సొంత స్టైల్లోనే కోవిడ్ ను ఎదుర్కోంటామని ఆయన చెప్పుకొచ్చారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  ప్రపంచమంతా కరోనావైరస్ వ్యాపించినా తమ దేశంలో ఇంతవరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కిమ్ ప్రకటించారు.  దీనిపై ప్రపంచ దేశాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

దేశంలోకి కరోనా ప్రవేశించకుండా కఠిన నివారణ చర్యలు తీసుకోవటం అత్యంత ముఖ్యమైన పని అని గుర్తుంచుకోండి. ఒక్క క్షణం కూడా అలసత్వం వహించకూడదు అని కిమ్ జోంగ్ ఉన్ అక్కడి అధికారులకు ఆదేశించారు. కరోనా దేశంలోకి ప్రవేశించకుండా ఉండేందుకు అవసరమైతే సాంకేతిక మార్గాలను అనుసరించటంతోపాటు వైద్య సిబ్బందికి, పారా మెడికల్  సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని అన్నారు.

కరోనా నివారణకు తయారు చేసిన వ్యాక్సిన్ ను ప్రపంచంలోని అన్ని దేశాలకు అందించాలనే ఉద్దేశ్యంతో  ఏర్పాటైన కోవాక్స్ కూటమి వ్యాక్సిన్ లను సమకూర్చుకుని అన్ని దేశాలకు సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా యునిసెఫ్ 30 లక్షల సినోవాక్ డోసులను ఉత్తర కొరియాకు అందించేందుకు ముందుకు రాగా …అధినేత కిమ్ తిరస్కరించారు. అంతేకాదు అవసరమైతే ప్రపంచదేశాలు వీటిని వినియోగించుకోవచ్చని ఉచిత సలహా కూడా ఇచ్చారు.

కాగా…. సినోవాక్ పనితీరుపై పలు అనుమానాలు రావటం… ఆస్ట్రా జెన్ కా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రక్తం గడ్డకడుతోందనే వార్తల కారణంగానే ఉత్తర కొరియా వీటిని తిరస్కరించిందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కొవాక్స్‌ కార్యక్రమం ద్వారా సమర్థవంతమైన వ్యాక్సిన్‌ పొందాలని ఉత్తర కొరియా భావిస్తున్నట్లు తెలుస్తోందని.. లేదా నేరుగా చైనా నుంచి వ్యాక్సిన్‌ను సేకరించే అవకాశం ఉందని సియోల్‌లోని ఎవ్‌హా వుమెన్స్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ లీఫ్‌-ఎరిక్‌ ఈస్లీ తెలిపారు. సురక్షిత వ్యాక్సిన్‌లనే తమ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో కిమ్‌ జోంగ్‌ ఉన్నట్లు తెలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఉత్తర కొరియా దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించకుండా అధినేత తీవ్ర ఆంక్షలు అమలు చేస్తున్నారు. వీటి కారణంగా ఆర్ధిక వ్యవస్ధ దిగజారిపోయి ఆహార కొరత ఏర్పడిందని తెలుస్తోంది. అయినప్పటికీ సరిహద్దులను మూసి వేయటంతో పాటు కోవిడ్ ఆంక్షలను కొనసాగిస్తున్నారు, మరో వైపు ఇతర దేశాలనుంచి తమ దేశానికి వచ్చేవారికి కఠినమైన క్వారంటైన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇలాంటి క్లిష్టసమయంలో పౌరులు సహకరించాలని కిమ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో నెలకొన్న మానవ హక్కుల పరిస్ధితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర కోరియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టటంతోపాటు ఇతరదేశాల రాయబార సిబ్బందిని కూడా అనుమతించాలని ఐక్యరాజ్యసమితి ఉత్తర కొరియాకు సూచించింది.