US Gun Culture : అమెరికాలో గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా ‘మార్చ్ ఫర్ అవర్ లైవ్స్’ పేరుతో వేలాదిమంది ర్యాలీ

అమెరికాలో గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. తుపాకి సంస్కృతిని నియంత్రించడానికి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని అమెరికన్లు డిమాండ్ చేస్తున్నారు. మార్చ్ ఫర్ అవర్ లైవ్స్ పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.

US Gun Culture : అమెరికాలో గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా ‘మార్చ్ ఫర్ అవర్ లైవ్స్’ పేరుతో వేలాదిమంది ర్యాలీ

US Gun Culture : అమెరికాలో గన్ కల్చర్‌కు వ్యతిరేకంగా భారీ ఆందోళనలు జరుగుతున్నాయి. తుపాకి సంస్కృతిని నియంత్రించడానికి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని అమెరికన్లు డిమాండ్ చేస్తున్నారు. మార్చ్ ఫర్ అవర్ లైవ్స్ పేరుతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గత నెలలో స్కూల్‌లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 10 మంది చనిపోగా, న్యూయార్క్‌లో ఇటీవల జరిగిన కాల్పుల్లో పదిమంది చనిపోయారు. గన్‌ కల్చర్‌కు వ్యతిరేకంగా అమెరికా గళమెత్తింది. ఆయుధం నుంచి రక్షణ కోరుతూ ఆందోళన బాటపట్టింది. తుపాకి వినియోగానికి వ్యతిరేకంగా కఠిన నిబంధనలు రూపొందించాలని సాధారణ ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు దాకా అందరూ నినదించారు. లక్షలాదిగా తరలివచ్చి ప్రదర్శనల్లో పాల్గొన్నారు.

అమెరికాలో కాల్పుల ఘటనలు సాధారణమే అయినప్పటికీ ఇటీవలి కాలంలో అవి మరింతగా పెరిగాయి. గత నెల చివరివారంలో టెక్సాస్‌లోని ఓ స్కూల్లో దుండగుడు జరిపిన కాల్పుల్లో 19 మంది చిన్నారులు మరణించిన ఘటన మొత్తం ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. అది మర్చిపోకముందే దేశంలో పలుచోట్ల దుండగుల చేతుల్లోని తుపాకులు చెలరేగిపోయాయి. బుఫలో, న్యూయార్క్, ఫిలడెల్ఫియా, స్మిత్‌ బర్గ్‌ వంటి ప్రాంతాల్లో అమాయక ప్రజలు గన్‌ కల్చర్‌కు బలైపోయారు.

Also read : Russia-ukraine war :వీధుల్లో కుళ్లిన శవాలతో భీతావహంగా యుక్రెయిన్..ఓ పక్క రష్యా దాడులు..మరోపక్క కలరా వ్యాధితో అతలాకుతలం

అమెరికా ప్రజలు నరనరానా జీర్ణించుకున్న ఈ తుపాకి సంస్కృతి ఎంత ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తోందో వరుస ఘటనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. హత్యలు, ఆత్మహత్యల రూపంలో తుపాకులు రోజుకు 53 మందిని బలితీసుకుంటున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. 50 ఏళ్ల క్రితమే దేశ ప్రజల భద్రతకు తుపాకి పెనుముప్పుగా మారిందని గుర్తించినప్పటికీ ఆ సంస్కృతిని అంతంచేయడంలో అక్కడి ప్రభుత్వాలు ఘోరంగా విఫలమవుతూనే ఉన్నాయి. అధికారంలో డెమోక్రట్లున్నా, రిపబ్లికన్లున్నా..ప్రభుత్వంపై ఆయుధాల లాబీదే పై చేయి అవుతోంది. తుపాకి స్టేటస్ సింబల్‌, భద్రతా చిహ్నం అన్న భావన అమెరికన్ల నరనరానా జీర్ణించుకోపోయేలా చేసిన ఆయుధాల లాబీ..ఏళ్లు గడిచే కొద్దీ అమ్మకాలు పెంచుకుంటూ పోతోంది. దీంతో జాతీయ రైఫిల్ అసోసియేషన్ చెప్పినట్టాల్లా ప్రభుత్వాలు ఆడాల్సి వస్తోంది. టెక్సాస్ స్కూళ్లో కాల్పుల తర్వాత తుపాకి సంస్కృతిపై అధ్యక్షుడు బైడన్ నిర్వేదం వ్యక్తంచేశారు. ప్రపంచంలో అత్యంత అరుదుగా జరిగే ఇలాంటి ఘటనలు..అమెరికాలో నిత్యకృత్యంగా మారాయని, ఇకనైనా ఈ రక్తపాతానికి ముగింపు పలుకుదామని పిలుపునిచ్చారు. కానీ బైడన్ ఆలోచనలేవీ కార్యరూపం దాల్చలేదు. మళ్లీ మళ్లీ అలాంటివి జరుగుతూనే ఉన్నాయి.

Also read : China-Taiwan : తైవాన్ చైనాలో అంతర్భాగమే..కాదంటే యుద్ధం తప్పదు..ఎవ్వరిని లెక్క చేసేదేలేదంటున్న డ్రాగన్ దేశం

దేశంలో రోజూ ఎక్కడో మూల వినపడుతన్న కాల్పుల మోతలతో అమెరికా ప్రజలు దినదినగండంగా బతుకుతిన్నారు. అందుకే ఆయుధం నుంచి రక్షణ కోరుతూ భారీ ఆందోళనలు జరుపుతున్నారు. జాతీయ రైఫిల్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా నినదిస్తున్నారు. ప్రజలను, పిల్లలను ఆయుధం బారి నుంచి రక్షించేందుకు కఠిన చట్టాలు రూపొందించాలని కాంగ్రెస్‌కు డిమాండ్ చేస్తున్నారు. ఇకనైనా రాజకీయ నేతలు స్పందించకపోతే..వారందరినీ వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. తుపాకి సంస్కృతికి వ్యతిరేకంగా చట్టాలు చేయడం రాజకీయం కాదని, ఇది నైతిక విలువలకు సంబంధించనదని అమెరికా పౌరులంటున్నారు. ఆలోచనలు, ప్రార్థనలతో పని కాదని, ధైర్యంగా వ్యవహరించడం, కార్యాచరణ రూపొందించడమే పరిష్కారమని తెలిపారు.