Migration Impact on Europe: వలసలతో యూరప్ దేశాలు విలవిల.. నెదర్లాండ్స్‌లో రాజకీయ సంక్షోభం

నెదర్లాండ్స్‌లో వలసలు రాజకీయ సంక్షోభమే సృష్టించాయి. వలసలపై అనుసరించాల్సిన వైఖరిపై అధికార కూటమిలో తలెత్తిన అభిప్రాయభేదాలతో ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని మార్క్ రుట్టే రాజీనామా చేశారు.

Migration Impact on Europe: వలసలతో యూరప్ దేశాలు విలవిల.. నెదర్లాండ్స్‌లో రాజకీయ సంక్షోభం

Migration and Refugee Impact on Europe

Migration and Refugee Impact on Europe: యూరప్ దేశాలను వలసలు అతలాకుతలం చేస్తున్నాయి. మానవతా దృక్పథంతో బాధాతప్త దేశాల నుంచి వలసలను అనుమతించిన అనేక యూరప్ దేశాలు
(European Countries) ఇప్పుడు సమస్యలను కొని తెచ్చుకున్నట్టు భావిస్తున్నాయి. వలస జనాభా (Refugees) పెద్ద సంఖ్యలో పెరగడం రాజకీయాలపై పెను ప్రభావం చూపుతోంది. తాజాగా నెదర్లాండ్స్ (Netherlands) ప్రభుత్వం కుప్పకూలడానికి వలసలపై వైఖరే కారణం. మొత్తంగా ఇతర దేశాల సమస్యలు ఇప్పుడు యూరప్ దేశాల అంతర్గత సమస్యలుగా మారిపోయాయి.

ప్రశాంతతకు మారు పేరుగా ఉండే ఫ్రాన్స్ కొన్నిరోజులుగా అల్లర్లతో అట్టుడుకుతోంది. బెల్జియం, జర్మనీ, పర్యాటక దేశం స్విట్జర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఐదారేళ్లగా వలసలను అనుమతించిన దేశాలన్నీ అంతర్గత సంక్షోభాలకు నిలయంగా మారాయి. నిజానికి ఈ దేశాల్లో కొన్ని మొదట వలసలను ఒప్పుకోలేదు. అప్పట్లో దీనిపై అంతర్జాతీయంగా నిరసన సైతం వ్యక్తమయింది. 2015లో అంతర్యుద్ధంతో సతమతమవుతున్న సిరియా నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో వలసబాట పట్టారు. ప్రమాదకర సముద్ర ప్రయాణాలు చేస్తూ పొరుగు దేశాలకు, యూరప్‌కు చేరుకున్నారు. భారీగా వస్తున్న వలసలను నివారించేందుకు జర్మనీ వంటి దేశాలు కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ సమయంలోనే సిరియా శరణార్థులు ప్రయాణిస్తున్న ఓ పడవ మధ్యదరా సముద్రంలో మునిగిపోయింది. మూడేళ్ల ఐయాన్ అనే సిరియా బాలుడి మృతదేహం టర్కీ బీచ్‌కు కొట్టుకొచ్చింది. బీచ్‌లో నిద్రపోతున్నట్టుగా పడివున్న ఐయాన్ నిర్జీవదేహం యావత్ ప్రపంచాన్ని కుదిపేసింది. వరసలపై యూరప్ దేశాల వైఖరి మారిపోయింది.

సిరియా అంతర్యుద్ధం మొదలైన కొత్తల్లో వలసలను వ్యతిరేకించిన దేశాలు 2015 తర్వాత కాస్త మెతకవైఖరి అవలంబించాయి. ఫలితంగా కల్లోల దేశాల నుంచి వలసలు వెల్లువెత్తాయి. అరబ్ విప్లవమూ భారీ వలసలకు దారితీసింది. సిరియాతో పాటు ట్యునీషియా, లిబియా, ఈజిప్టు, యెమెన్, అల్జీరియా, ఇరాక్, సోమాలియా, సూడాన్, నైజీరియా, ఇటీవలి కల్లోలిత ప్రాంతాలైన అప్ఘానిస్థాన్, యుక్రెయిన్ నుంచి లక్షలాదిగా ప్రజలు యూరప్ దేశాలకు వలస బాట పట్టారు. ఒక్క 2015లోనే 15 లక్షల మంది పలుదేశాలకు వలస వెళ్లడంతో ఆ సంవత్సరాన్ని వలస ఏడాదిగా పిలుస్తున్నారు. తర్వాత వలసలు కొనసాగాయి. అలా వచ్చిన జనాభా, వారి పిల్లలు, బంధువులు కలిసి ఆయా దేశాల్లో వారి సంఖ్య ఊహించని విధంగా పెరిగిపోయింది.

Also Read: క్షణాల్లో కుప్పకూలిన అపార్ట్‌మెంట్ భవనం.. ఎనిమిది మంది మృతి.. వణికించిన సీసీ కెమెరా విజువల్స్

వలస జనాభాపై వివక్ష!
మానవతాదృక్పథంతో వలసలను అనుమతించినప్పటికీ యూరప్ దేశాల్లో వలసజనాభాపై వివక్ష ఉందన్న అభిప్రాయం ఏర్పడింది. తమ పౌరులతో సమానంగా వలస జనాభాను చూడడం ఏ దేశానికీ సాధ్యం కాదు. అయితే దీంతో పాటు ఉద్దేశపూర్వక వివక్షా కలిసి వలసజనాభాలో ఓ విధమైన అసంతృప్తి చెలరేగింది. ఉపాధి అవకాశాలు లేకపోవడం, అవమనాలు, అనుమానాలు, ద్వితీయ పౌరుని తరహాలో వ్యవహరించడం వంటివన్నీ పరిస్థితులను అదుపుతప్పేలా చేశాయి. ఫ్రాన్స్‌లో ట్రాఫిక్ పోలీస్ అధికారి చేతిలో చనిపోయిన నహేల్ తల్లి కూడా ఈ రకమైన ఆరోపణే చేశారు. అరబ్ ముఖంలా ఉన్నందుకే తన కొడుకును కాల్చిచంపారని ఆవేదన వ్యక్తం చేశారు. నహేల్ మొరాకో-అల్జీరియా సంతతికి చెందిన యువకుడు. వలస జనాభాకు, దశాబ్దాలుగా వివక్షకు గురైన జాతుల ప్రజలు జత కలవడంతో ఫ్రాన్స్‌ అల్లకల్లోలమయింది.

Also Read: 500 రోజులు దాటిన రష్యా – యుక్రెయిన్ యుద్ధం.. వార్ ఆగాలంటే అదొక్కటే పరిష్కారం!

ఒక్క ఫ్రాన్సే కాదు.. వలసలను అనుమతించిన అనేక యూరప్ దేశాల్లో ఇదే పరిస్థితి ఉంది. అనేక దేశాల మధ్య శాంతి ప్రయత్నాలు చేసే నార్వే వంటి దేశాల్లోనూ ఇప్పుడు శాంతిభద్రతలు అదుపులో ఉండడం లేదు. మానవహక్కులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే ఆ దేశంలో ఇప్పుడు కాల్పులు సర్వసాధారణంగా మారాయి. స్వీడన్‌లో ఘర్షణలు జరగని రోజుండడం లేదు.

వలసలతో నెదర్లాండ్స్‌లో రాజకీయ సంక్షోభం
నెదర్లాండ్స్‌లో వలసలు రాజకీయ సంక్షోభమే సృష్టించాయి. వలసలపై అనుసరించాల్సిన వైఖరిపై అధికార కూటమిలో తలెత్తిన అభిప్రాయభేదాలతో ప్రభుత్వం కూలిపోయింది. ప్రధాని మార్క్ రుట్టే రాజీనామా చేశారు. నెదర్లాండ్స్‌ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవమున్న నేతగా గుర్తింపు పొందిన మార్క్ రుట్టే వలసలపై మాత్రం అధికార కూటమిలో ఏకాభిప్రాయం సాధించలేకపోయారు. నెదర్లాండ్స్‌లోని వలసల శిబిరాలన్నీ శరణార్థులతో కిక్కిరిసిపోయాయి. వలసల సమస్యకు పరిష్కారం చూపిపస్తానని హామీ ఇచ్చిన మార్క్ రుట్టే.. ఇందులో భాగంగా యుద్ధప్రాంతాల నుంచి వచ్చే శరణార్థులు బంధువుల సంఖ్యను నెలకు 200కు పరిమితం చేయాలన్న ప్రతిపాదన పెట్టారు. ఈ ప్రతిపాదనను అధికార కూటమిలోని పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కూటమి పార్టీల మధ్య విభేదాలు పరిష్కరించలేని స్థితికి చేరాయి. చివరకు మార్క్ రుట్టే రాజీనామా చేయాల్సి వచ్చింది.

Also Read: ఆత్మహత్యకు ప్రేరేపించే విషపూరితమైన మొక్క గురించి మీకు తెలుసా?

యూరప్‌లో అభివృద్ధి చెందిన దేశాలన్నీ వలసల సమస్యతో సతమతమవుతున్నాయి. అనేక దేశాల్లో 50లక్షల పైనే వలస జనాభా ఉందంటే అక్కడి పరిస్థితులను అర్ధం చేసుకోవచ్చు. వలస జనాభా ప్రభావంతో ఆయా దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి.