Forbes 400 List : 25 ఏళ్లలో తొలిసారి..అమెరికా ధనవంతుల జాబితాలో ట్రంప్ కు దక్కని చోటు

అమెరికా మాజీ అధ్యక్షుడు,రియల్ ఎస్టేట్ కింగ్.. డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Forbes 400 List : 25 ఏళ్లలో తొలిసారి..అమెరికా ధనవంతుల జాబితాలో ట్రంప్ కు దక్కని చోటు

Trump (1)

Forbes 400 List అమెరికా మాజీ అధ్యక్షుడు,రియల్ ఎస్టేట్ కింగ్.. డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజిన్ తాజాగా రూపొందించిన 400 మంది అత్యంత ధనవంతులైన అమెరికన్ల జాబితాలో ట్రంప్ కు చోటు దక్కలేదు. గడచిన 25 ఏళ్లలో తొలిసారి ట్రంప్ కి ఈ జాబితాలో చోటు కోల్పోవడం గమనార్హం.

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం కరోనా సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ట్రంప్.. 600 మిలియన్ డాలర్లు సంపదను కోల్పోయాడు. ప్రస్తుతం ట్రంప్ సంపద విలువ 2.5 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకోవాలంటే మరో 400 మిలియన్ డాలర్లు అవసరమని ఫోర్బ్స్‌ వ్యాఖ్యానించింది.

2016లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన కొత్తలో పరస్పర విరుద్ధ ప్రయోజనాల నుంచి దూరంగా ఉండాలంటే రియల్ ఎస్టేట్ ఆస్తులను వికేంద్రీకరించాలని ఫెడరల్ ఎథిక్స్ అధికారులు ట్రంప్ కి సూచించారు. అలా చేసి ఉంటే విస్తృత ఆదాయాన్నిచ్చే ఫండ్లలో పెట్టుబడి పెట్టేందుకు ఆయనకు అవకాశం లభించేది. అయితే వాటిని అట్టిపెట్టుకునేందుకే ట్రంప్ మొగ్గుచూపారు. ఒకవేళ అలా చేయకుండా ఉంటే రుణభారం పోను 3.5 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులను ట్రంప్ కలిగి ఉండేవారని ఫోర్బ్స్ పేర్కొంది​.

మొత్తంగా తన ఆస్తులు కరిగిపోవడానికి స్వయంగా ట్రంపే కారణమని ఫోర్బ్స్ అభిప్రాయపడింది. గత ఏడాది చివరిలో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. జోబైడెన్‌ చేతిలో ఓటమి పాలైన తర్వాత కూడా ట్రంప్‌ ఆస్తుల విలువ ఏమాత్రం పెరగలేదు. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, ట్రంప్ దగ్గర ఏడాది క్రితం ఎంత సంపద ఉందో..ఇప్పుడు కూడా అంతే ఉంది. గత ఏడాదికాలంలో ట్రంప్ మొత్తం ఆస్తుల విలువ 2.5 బిల్లియన్ డాలర్లుగా ఉండగా, ప్రస్తుత గణాంకాల ప్రకారం నికర విలువ యధాతథంగా ఉన్నట్లు తెలిపింది.

30 ఏళ్లలో తొలిసారి పడిపోయిన బిల్ గేట్స్ ర్యాంకు

ఇక,ఫోర్బ్-400 జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్(57).. 201 బిలియన్ డాలర్ల సంపదతో మొదటిస్థానంలో నిలిచారు. 190.5బిలియన్ డాలర్ల సంపదతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్(50) రెండో స్థానంలో నిలవగా..134.5 బిలియన్ డాలర్ల సంపదతో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్(37) మూడో స్థానంలో నిలిచారు. 30 ఏళ్లలో తొలిసారిగా ఫోర్బ్స్ జాబితాలో..మైక్రోస్టాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ర్యాంక్ కిందకు పడిపోయింది. 1991 నుంచి అమెరికాలోని అత్యంత సంపన్నులల్లో నెం.1 లేదా నెం.2గా కొనసాగుతూ వచ్చిన బిల్ గేట్స్ స్థానం ఈసారి 4కి పడిపోయింది. బిల్ గేట్స్ సంపద 134 బిలియన్ డాలర్లకి పడిపోయింది.

ఫోర్బ్స్ 400 జాబితాలో..తొలిసారిగా మొత్తం ఏడుగురు క్రిప్టో బిలియనీర్లు చోటు దక్కించుకున్నారు. ఇందులో ఆరుగురు కొత్తవారు ఉన్నారు.

ALSO READ రసాయన శాస్త్రంలో ఇద్దరికి నోబెల్