కాలుకి రింగ్, దానిపై కోడ్.. బోర్డర్ లో పావురం కలకలం, ఇది పాకిస్తాన్ కుట్రేనా

భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఓ పావురం కలకలం రేపింది. పలు అనుమానాలకు తావిచ్చింది.

  • Published By: naveen ,Published On : May 26, 2020 / 03:54 AM IST
కాలుకి రింగ్, దానిపై కోడ్.. బోర్డర్ లో పావురం కలకలం, ఇది పాకిస్తాన్ కుట్రేనా

భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఓ పావురం కలకలం రేపింది. పలు అనుమానాలకు తావిచ్చింది.

భారత్, పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో ఓ పావురం కలకలం రేపింది. పలు అనుమానాలకు తావిచ్చింది. భారత సైన్యాన్ని అప్రమత్తం చేసింది. పాకిస్తాన్ కుట్ర కోణాలను బయటపెట్టింది. గూఢచర్యం సందేహాలను తెరపైకి తెచ్చింది. గూఢచర్యం కోసం పాకిస్తాన్‌ కపోతాల సాయం తీసుకుంటోందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. కరోనా ప్రబలుతున్న వేళ భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు పాక్ ఏమైనా ఎత్తులు వేస్తుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి.

కపోతం కాలికి రింగ్, దానిపై కోడ్:
జమ్మూ-కశ్మీర్‌లోని కథువా జిల్లాలో స్థానికులు ఓ పావురాన్ని పట్టుకున్నారు. ఈ కపోతం.. పాక్ బోర్డర్ నుంచి ఎగురుతూ వచ్చింది. అంతర్జాతీయ సరిహద్దును దాటి, హీరానగర్‌ సెక్టార్‌లోని మాన్యారి గ్రామాన్ని చేరింది. పావురం తీరును అనుమానించిన స్థానికులు వెంటనే దాన్ని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. తెల్లని పావురానికి కాళ్ళ భాగంలో గులాబీ రంగు పూసి ఉంది. చూడటానికి సాధారణంగా ఉన్నా, దాని కాలికి ఒక రింగ్ ఉంది. దానిపై కోడింగ్ తో కూడిన నెంబర్లు ఉన్నాయి. దీంతో అది పాకిస్థాన్ గూఢచార కపోతంగా కథువా జిల్లా ఎస్పీ శైలేంద్ర మిశ్రా నిర్ధారించారు. దాన్ని వెంటనే ఆర్మీ అధికారులకు అప్పగించారు. రింగ్ పై ఉన్న నెంబర్లు సంకేత సందేశమై ఉండొచ్చని, ఈ రహస్యాన్ని ఛేదించేందుకు భద్రతా సంస్థలు ప్రయత్నిస్తున్నాయన్నారు. గూఢచర్యం కోసం పాకిస్థాన్‌ ఈ కపోతాన్ని వాడినట్లు సందేహాలు వ్యక్తం చేశారు.

కోడ్ ను డీకోడ్ చేసే పనిలో ఆర్మీ:
దీనిపై ఆర్మీ అధికారులు లోతైన దర్యాఫ్తు స్టార్ట్ చేశారు. పావురంపై ఉన్న కోడ్‌ను డీకోడ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రపంచమంతా కరోనా వైరస్‌ను కట్టడి చేసే చర్యల్లో నిమగ్నమై ఉంటే.. దాయాది దేశం మాత్రం తన వక్రబుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. జమ్మూకశ్మీర్‌లో పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

కరోనా వేళ భారత్ లో విధ్వంసం సృష్టించేందుకు కుట్ర:
కరోనా వైరస్ పంజా విసురుతున్న సమయాన్ని అదనుగా చూసి కశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ఎగదోయడానికి పాక్ వైపు నుంచి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో సరిహద్దుల వెంబడి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతూ పాక్‌ కవ్వింపు చర్యలకు దిగుతోంది. అంతేగాక భారత్‌లో అంతర్భాగమైన పీఓకేలోని గిల్గిట్‌ బాల్టిస్థాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది. పాక్ సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఎన్నికల దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.

పాక్ ప్రయత్నాలను ఎండగట్టడానికి భారత్ సిద్ధమైంది. గిల్గిట్ బాల్టిస్థాన్‌కు సంబంధించి తీర్పులు వెలువరించే హక్కు పాక్ సుప్రీం కోర్టుకు లేదని పాక్ రాయబారికి భారత విదేశాంగ శాఖ అందించిన దౌత్యపరమైన లేఖలో స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పాక్ ఉగ్రవాద సంస్థలు మరింత రెచ్చిపోతున్నట్లు తెలుస్తోంది.

కశ్మీర్ లో కరోనా వైరస్ వ్యాప్తికి ప్రయత్నాలు:
కొన్ని ఉగ్రవాద సంస్థలు కశ్మీర్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. కశ్మీర్‌లో కల్లోలం చేయడానికి వచ్చిన హిజ్బుల్ ముజాహిదీన్‌ గ్రూప్ కి చెందిన కొంత మంది టాప్ కమాండర్లను ఇటీవల భారత భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన విషయం తెలిసిందే. భారత్ కరోనా సంక్షోభం నుంచి బయటపడే సమయానికి కశ్మీర్‌లోకి చొచ్చుకుపోవాలని ఉగ్రవాద సంస్థలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అంతర్జాతీయ సరిహద్దులో గూఢచర్యం చేసేందుకు ఓ పావురానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి భారత భూభాగంలోకి పంపించినట్లు అధికారులు భావిస్తున్నారు. కశ్మీర్‌‌లో ఆ పావురం ఎవరిని కలిసింది? అది తెచ్చిన సమాచారం ఏంటి? దానికి బదులుగా పంపిన కోడ్ ఏంటి? తదితర అంశాలను ఆర్మీకి చెందిన నిపుణులు విశ్లేషించే పనిలో ఉన్నారు.

Read:ఆకలికి ఆగలేక.. రైల్వే స్టేషన్‌లో ఫుడ్ ప్యాకెట్లను ఎత్తుకెళ్లిన వలస కార్మికులు