ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతి!

  • Published By: venkaiahnaidu ,Published On : December 11, 2020 / 09:25 PM IST
ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతి!

Pfizer Covid Vaccine Gets US Experts Nod క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ కోసం ఫార్మా దిగ్గజ సంస్థలు “ఫైజ‌ర్-బయోఎన్ టెక్” కలిసి డెవలప్ చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ అత్య‌వ‌స‌ర వినియోగానికి అమెరికా అనుమ‌తి ఇచ్చింది. ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (FDA)కు చెందిన నిపుణుల క‌మిటీ నిర్వ‌హించిన ఓటింగ్‌ లో ఫైజ‌ర్‌ కు గ్రీన్‌సిగ్న‌ల్ ద‌క్కింది.

20 మందితో ఏర్పాటైన వ్యాక్సిన్లు, సంబంధిత బయోలాజికల్‌ ప్రొడక్టుల సలహా కమిటీ(వీఆర్‌బీపీఏసీ) ఫైజర్‌ వ్యాక్సిన్‌కు 17-4 ఓట్లతో గురువారం ఆమోదముద్ర వేసింది. ఓటింగ్‌ లో పాల్గొన్న 17 మంది అనుకూలంగా ఓటు వేయ‌గా, న‌లుగురు వ్య‌తిరేకించారు. ఫైజ‌ర్‌-బ‌యోఎన్‌టెక్ కోవిడ్‌19 టీకా వ‌ల్ల‌ 16 ఏళ్లు దాటిన వారిలో ఎటువంటి ఇబ్బందులు క‌ల‌గ‌లేద‌ని కమిటీ సభ్యులు గుర్తించారు.

అయితే ప్రభుత్వ సలహా మండలి ఇచ్చిన నివేదిక సూచనలు మాత్రమేనని..‌ఎఫ్‌డీఏ వీటికి కట్టుబడవలసిన అవసరంలేదని నిపుణులు తెలియజేశారు. కాగా.. యూఎస్‌లో పరిస్థితుల ఆధారంగా ఫైజర్‌ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ‌ఎఫ్‌డీఏ వెనువెంటనే అనుమతించే వీలున్నట్లు అంచనా వేశారు

మరోవైపు,జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌తో భాగస్వామ్యంలో ఫైజర్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి బ్రిట‌న్‌, కెన‌డా, బహ్రాయిన్‌, సౌదీ అరేబియాలో ఆమోదం తెలిపాయి. బ్రిట‌న్‌ లో మంగళవారం వాక్సినేషన్ కూడా ప్రారంభమైన విషయం తెలిసిందే. 90 ఏళ్ల బామ్మ‌కు తొలి ఫైజ‌ర్ టీకాను ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే అల‌ర్జీ ఉన్న వాళ్లు ఆ టీకాను వేసుకోవ‌ద్దు అంటూ బ్రిట‌న్ ప్ర‌భుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది.