Israel Palestine Conflict: గాజా ఆసుపత్రి దాడిపై ప్రధాని మోదీ విచారం.. దోషుల్ని విడిచిపెట్టొద్దంటూ హెచ్చరిక

గాజాలోని ఆసుపత్రిపై దాడిలో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఐక్యరాజ్యసమితి, దాని అగ్రనేతలు, ఏజెన్సీలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి

Israel Palestine Conflict: గాజా ఆసుపత్రి దాడిపై ప్రధాని మోదీ విచారం.. దోషుల్ని విడిచిపెట్టొద్దంటూ హెచ్చరిక

Updated On : October 18, 2023 / 3:40 PM IST

Attack on Gaza Hospital: గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిపై జరిగిన దాడిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దోషులు ఎవరైనప్పటికీ వారిని విడిచిపెట్టవద్దని అన్నారు. మంగళవారం (17 అక్టోబర్ 2023) గాజాలోని అల్-అహ్లీ ఆసుపత్రి మీద జరిగిన వైమానిక దాడిలో సుమారు 500 మంది పౌరులు మరణించారు. దీనిపై ప్రధాని తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా స్పందిస్తూ “ఈ యుద్ధంలో పౌరులు మరణించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయం. ఈ దాడికి బాధ్యులను విడిచిపెట్టకూడదు” అని పోస్ట్ చేశారు.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తోంది. ఉపరితల బలగాలు కూడా ఉత్తర గాజాపై దాడి చేస్తున్నాయి. వాస్తవానికి మూడు రోజుల ముందే ఉత్తర గాజాలోని ప్రజలను ఖాళీ చేయమంటూ ఇజ్రాయెల్ ఆదేశించింది. అక్కడున్న ఆసుపత్రిని కూడా ఖాళీ చేయమని హెచ్చరించారు. అనంతరం ఈ దాడి జరిగింది. మంగళవారం అర్థరాత్రి ఈ ఆసుపత్రిపై వైమానిక దాడి జరిగింది. పాలస్తీనాలోని హమాస్ నియంత్రణలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇక్కడ నివసిస్తున్న 500 మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి గాజా ఆస్పత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసి, పౌరులను చంపేశారంటూ విమర్శలు వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Israel Palestine Conflict: ఇజ్రాయెల్ వచ్చి నెతన్యాహూని కలిసిన బైడెన్.. గాజా ఆసుపత్రి మీద దాడిపై ఏమన్నారంటే?

గాజాలోని ఆసుపత్రిపై దాడిలో అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఐక్యరాజ్యసమితి, దాని అగ్రనేతలు, ఏజెన్సీలు తీవ్ర విచారం వ్యక్తం చేశాయి. అలాగే ఈ సంఘటనను తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ ద్వారా స్పందిస్తూ.. గాజాలోని ఆసుపత్రిపై ఈ రోజు జరిగిన దాడిలో వందలాది మంది పాలస్తీనియన్లు మరణించినందుకు తను చాలా బాధపడ్డానని, తాను దానిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాజాలోని ఆసుపత్రులు, వైద్య సిబ్బంది అంతర్జాతీయ మానవతా చట్టం కింద రక్షణ పొందుతారని గటెర్రస్ అన్నారు.