Sri Lanka Crisis: రాజపక్సే నివాసంలో మద్యం బాటిళ్లు.. ఆందోళన కారులు ఏం చేశారో తెలుసా? వీడియోలు వైరల్

కొలంబోలోని శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్సే అధికారిక నివాసంలోకి వేలాది మంది నిరసనకారులు పోలీసు బారికేడ్లను ఛేదించుకుని ప్రవేశించారు. శ్రీలంక జెండాలు, హెల్మెట్‌లతో భారీ సంఖ్యలో తరలివచ్చి గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Sri Lanka Crisis: రాజపక్సే నివాసంలో మద్యం బాటిళ్లు.. ఆందోళన కారులు ఏం చేశారో తెలుసా? వీడియోలు వైరల్

Srilanka Crises

Sri Lanka Crisis: కొలంబోలోని శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే అధికారిక నివాసంలోకి వేలాది మంది నిరసనకారులు పోలీసు బారికేడ్లను ఛేదించుకుని ప్రవేశించారు. శ్రీలంక జెండాలు, హెల్మెట్‌లతో భారీ సంఖ్యలో తరలివచ్చి గొటబయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వేలాదిగా ఆందోళన కారులు అధ్యక్షుడి నివాసం వద్దకు చేరుకోవటంతో వారిని అడ్డుకోవటం భద్రతా సిబ్బంది వల్ల కాలేదు. దీంతో భద్రతా సిబ్బందిని తోసుకుంటూ ఆందోళన కారులు అధ్యక్షుడి నివాసంలోకి దూసుకెళ్లారు. అయితే అప్పటికే ఆ నివాసం నుంచి గొటబయ రాజపక్సే పరారయ్యారు. అయితే అధ్యక్షుడి నివాసంలోకి దూసుకెళ్లిన ఆందోళన కారులు అన్ని రూంలలోకి వెళ్లి వస్తువులను చిందరవందర చేశారు.

Sri Lanka crisis: శ్రీ‌లంక‌లో క‌ల‌క‌లం.. ఇంటి నుంచి అధ్య‌క్షుడు రాజ‌ప‌క్స ప‌రారీ

అధ్యక్షుడి నివాసంలోని స్విమ్మింగ్ పూల్ వద్దకు వెళ్లిన నిరసన కారులు స్విమ్మింగ్ పూల్‌లోకి దూకి కొద్దిసేపు తమ నిరసనను తెలపడం వీడియోలో కనిపించింది. మరో వీడియోలో వంట గదిలోకి వెళ్లి అక్కడి ఆహార పదార్థాలు తింటూ కనిపించారు. అదే రూంలో మద్యం బాటిళ్లుకూడా ఉండటంతో వాటిని తీసుకొని ఆందోళన కారులు తాగుతుండటం వీడియోలో కనిపించింది.

అధ్యక్షుడి నివాసంలోకి వెళ్లిన ఆందోళన కారులు మరింత ఆగ్రహంతో ఊగిపోయారు. వస్తువులను విసిరివేయడం వీడియోలో కనిపించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. ఇదిలాఉంటే నిరసన కార్యక్రమాల్లో ఆ దేశ మాజీ క్రికెటర్ జయసూర్య కూడా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కొద్ది నెలలుగా శ్రీలంక తీవ్ర విదేశీ మారకద్రవ్య కొరతతో కొట్టుమిట్టాడుతోంది. దీని ఫలితంగా దాదాపు ఏడు దశాబ్దాలలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఆ దేశం ఎదుర్కొంటుంది. గత నాలుగు నెలలుగా ఆ దేశంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. గతనెల రోజుల క్రితం ఆందోళన కారులు ప్రధాని మహిందా రాజపక్సే ఇంటిని ముట్టడించడంతో ఆయన అక్కడి నుంచి ఆర్మీసిబ్బంది సహాయంతో సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఆయన రాజీనామా చేయడంతో ప్రధానిగా రణిల్ విక్రమసింఘే బాధ్యతలు చేపట్టారు. అయినా ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం అదుపులోకి రాలేదు.

రాజపక్స సోదరుల వల్లే దేశంకు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆ దేశంలోని అధికశాతం మంది ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే నివాసంలోకి పెద్ద సంఖ్యలో ఆందోళనకారులు దూసుకెళ్లారు. పరిస్థితి అదుపు తప్పుతుందని ఇంటెలిజెన్స్ నివేదికలు హెచ్చరించడంతో గత రాత్రి లంక అధ్యక్షుడు రాజపక్సేను ఆర్మీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. ఆయన ఆకస్మిక నిష్క్రమణతో ఆయన పదవిలో కొనసాగాలని భావిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శ్రీలంకలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్సేకు చెందిన వాహన కాన్వాయ్‌ కూడా వీడియోలు చూపించాయి, అయితే అతను దేశం విడిచి వెళ్లాడా? లేదా అనే దానిపై ఎటువంటి నిర్ధారణ లేదు.