Russia Invasion : యుక్రెయిన్‌లో ర‌ష్యా ర‌క్తపాతం

తూర్పు యుక్రెయిన్‌లోని నగరాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా... పశ్చిమ యుక్రెయిన్‌లోని నగరాలపై వైమానిక దాడులతో నిప్పుల వాన కురిపిస్తోంది.

Russia Invasion : యుక్రెయిన్‌లో ర‌ష్యా ర‌క్తపాతం

Ukraine (1)

Russia invasion of Ukraine : యుక్రెయిన్‌లో ర‌ష్యా ర‌క్తపాతం సృష్టిస్తోంది. స‌రిహ‌ద్దు దాటి యుక్రెయిన్‌లోకి ప్రవేశించిన ర‌ష్యా బ‌ల‌గాలు దాడులతో విరుచుకుపడుతున్నాయి. సైనిక, వైమానిక, ఓడరేవులు, కీలక, వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా రష్యన్‌ సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు యుక్రెయిన్‌కు చెందిన 83 సైనిక స్థావరాలను.. 11 ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్లు రష్యా సైన్యం ప్రకటించింది. ఓ సైనిక హెలికాప్టర్‌తో పాటు నాలుగు డ్రోన్లను కూడా కూల్చివేసినట్లు తెలిపింది. తూర్పు యుక్రెయిన్‌లోని నగరాల్లో బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా… పశ్చిమ యుక్రెయిన్‌లోని నగరాలపై వైమానిక దాడులతో నిప్పుల వాన కురిపిస్తోంది. కీవ్‌లోని యుక్రెయిన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయంపైనా క్రెమ్లిన్‌ దళాలు దాడిచేశాయి. దీంతో ఎయిర్‌ రెయిడ్‌ సైరన్ల శబ్దాలతో ప్రధాన నగరాలు మార్మోగిపోతున్నాయి.

ఓవైపు రష్యా దాడులు, మరోవైపు వాటిని ఎదుర్కొనేందుకు యుక్రెయిన్‌ ప్రయత్నాలతో.. ఇరువైపులా ప్రాణనష్టం సంభవించింది. మొత్తంగా ఇప్పటివరకు వంద మందికిపైగానే మృతి చెందినట్లు తెలుస్తోంది. 40 మందికిపైగా తమ సైనికులు 10 మంది పౌరులు చనిపోయినట్లు ఉక్రెయిన్‌ పేర్కొంది. ఒడెస్సాలోనే 18 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. 50మంది రష్యా ఆక్రమణదారులను చంపినట్లు యుక్రెయిన్‌ ప్రకటించుకుంది. 7 రష్యా విమానాలు, ఓ హెలికాఫ్టర్‌ను కూల్చేసినట్లు వెల్లడించింది. అయితే… తమ యుక్రెయిన్ ప్రకటనను రష్యా తోసిపుచ్చింది. తమ వారెవరూ చనిపోలేదని… ముగ్గురికి మాత్రం గాయాలయ్యాయని ప్రకటించింది.

NATO : యుక్రెయిన్‌కు నాటో భారీ షాక్‌.. బలగాలు పంపట్లేదని ప్రకటన

యుక్రెయిన్ విషయంలో తగ్గేది లేదంటున్న రష్యాపై.. అగ్రరాజ్యం అమెరికా మరోసారి సీరియస్ అయింది. ఇకపై పుతిన్‌తో మాట్లాడేది లేదంటూ.. రష్యాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అదనపు ఆంక్షలు విధించారు. 250 బిలియన్ డాలర్ల గల రష్యన్ ప్రభుత్వ బ్యాంక్ VTB ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రష్యాతో యుద్ధానికి తమ బలగాలు పంపడం లేదన్న బైడెన్‌… టెక్నాలజీ పరంగా రష్యాను దెబ్బతీస్తామన్నారు. రష్యా ఎయిరోస్పేస్ ఇండస్ట్రీతో పాటు స్పేస్ ప్రోగ్రాంను నిర్వీర్యం చేస్తామన్నారు. ఇవాళ 30 దేశాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి తదుపరి ఆంక్షలపై చర్చిస్తామన్నారు బైడెన్.

తొలిరోజు సైనిక చర్య సక్సెస్ అయిందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. యుక్రెయిన్‌లో తమ బలగాలు పట్టు సాధించాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలను మరోసారి హెచ్చరించారు. రష్యా-యుక్రెయిన్ వ్యవహారంలో తలదూరిస్తే ఎంతకైనా తెగిస్తామని తెగేసి చెప్పారు. ఎవరు జోక్యం చేసుకున్నా విపరీత పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు… రష్యా దండయాత్రపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అనేక దేశాలు రష్యాపై ఆంక్షలు విధిస్తున్నాయి.

NATO Condemn : ఉక్రెయిన్‌పై రష్యా దాడిని తీవ్రంగా ఖండించిన నాటో.. సైనిక చర్యను వెంటనే ఉపసంహరించుకోవాలి

యుక్రెయిన్‌పై సైనిక దాడికి స్వస్తి పలకాలని ప్రధాని మోదీ అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో రాత్రి ఫోన్‌లో మాట్లాడిన మోదీ.. త‌క్షణమే హింస‌కు తెర దించాల‌ని కోరారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సూచించారు. అలాగే యుక్రెయిన్‌లో భారతీయుల రక్షణను మోదీ గుర్తు చేశారు. అయితే… యుక్రెయిన్‌లోని తాజా పరిస్థితులను పుతిన్‌ మోదీకి వివరించారు. యుద్ధానికి దారి తీసిన పరిస్థితులపై మోదీతో మాట్లాడారు.