Russia-ukraine war @5 months : 5 నెలలు దాటినా కొనసాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం

ఐదు నెలలుగా సాగుతున్న యుక్రెయిన్ యుద్దానికి ముగింపు కనిపించడం లేదు. యుక్రెయిన్‌ నగరాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ రష్యా ముందుకు కదులుతోంది. యుక్రెయిన్ ప్రతిఘటన కొనసాగుతోంది. అన్ని దేశాలూ యుద్ధం విరమించాలని కోరుతున్నాయి. కానీ అటు రష్యా కానీ ఇటు యుక్రెయిన్ కానీ వెనక్కి తగ్గడం లేదు.

Russia-ukraine war @5 months : 5 నెలలు దాటినా కొనసాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం
ad

Russia-ukraine war @5 months : ఐదు నెలలుగా సాగుతున్న యుక్రెయిన్ యుద్దానికి ముగింపు కనిపించడం లేదు. యుక్రెయిన్‌ నగరాలను ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటూ రష్యా ముందుకు కదులుతోంది. యుక్రెయిన్ ప్రతిఘటన కొనసాగుతోంది. అన్ని దేశాలూ యుద్ధం విరమించాలని కోరుతున్నాయి. కానీ అటు రష్యా కానీ ఇటు యుక్రెయిన్ కానీ వెనక్కి తగ్గడం లేదు. ఫలితమేంటో తెలియని పోరు కోసం శక్తియుక్తులన్నీ వెచ్చిస్తున్నాయి. రెండు వైపులా అపారనష్టం తప్ప మరేమీ మిగల్చని యుద్ధం..మరింత భీతావహంగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

ఐదు నెలల క్రితం ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై స్పెషల్ మిలటరీ ఆపరేషన్ ప్రారంభిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినప్పుడు..యుద్ధం ఇంత సుదీర్ఘకాలం కొనసాగుతుందని ఎవరూ ఊహించలేదు. యుద్ధం మొదలైన రోజే కీవ్‌లో రష్యా బలగాలు ప్రవేశించాయన్న వార్తలొచ్చాయి. ఇక జెలన్‌స్కీ పదవినుంచి దిగిపోతారని, యుక్రెయిన్ రష్యా వశమవుతుందని అంతా భావించారు. కానీ పాశ్చాత్య దేశాలు అందించిన సహకారంతో యుక్రెయిన్ ప్రతిఘటన మొదలుపెట్టింది. ఫలితంగా యుద్ధం మొదలై ఐదు నెలలు దాటినా…పోరాటం ముగియ లేదు సరికదా..మరింత భీకరంగా కొనసాగుతోంది.

నెలన్నర రోజుల పాటు యుక్రెయిన్ రాజధాని కీవ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో యుద్ధం చేసిన రష్యా తర్వాత వ్యూహం మార్చి తూర్పు యుక్రెయిన్‌పై దృష్టిపెట్టాయి. మిలటరీ ఆపరేషన్‌కు ముందే డాన్ బాస్ ప్రాంతాన్ని స్వతంత్రంగా గుర్తించినట్టు ప్రకటించిన రష్యా…దాన్ని స్వాధీనం చేసుకునేందుకు భీకర దాడులకు దిగింది. రెండున్నర నెలలుగా తూర్పు యుక్రెయిన్ నగరాల్లో రష్యా బలగాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా డాన్‌బాస్‌లో కీలక నగరమైన సివిరోడొంటెస్క్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని రష్యా బలగాలతో పాటు యుక్రెయిన్ మేయర్ కూడా ధృవీకరించారు. నగరం నుంచి యుక్రెయిన్ బలగాలు వెనుతిరగాల్సిందిగా ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది. యుక్రెయిన్‌కు పాశ్యాత్య దేశాలు సహకరిస్తున్నాయని ఆరోపిస్తున్న రష్యా సివిరోడొంటెస్క్ నగరంలో 80 మంది పోలిష్ ఫైటర్లను హతమార్చామని తెలిపింది.

ఈ నగరంలో వారాల పాటు రష్యా షెల్లింగ్ కొనసాగింది. యుక్రెయిన్‌లో అత్యంత రక్తపాతం జరిగిన నగరాల్లో సివిరో డొంటెస్క్ ఒకటి. షెల్లింగ్ నుంచి తప్పించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో అజోట్ కెమికల్ ప్లాంట్‌లో తలదాచుకున్నారు. సివిరోడొంటెస్క్ స్వాధీనంతో దాదాపు లుహాన్స్క్ మొత్తంపై రష్యా నియంత్రణ సాధించినట్టయింది. డొంటెస్క్‌లో చాలా భాగం ఇప్పటికే రష్యా వశమయింది. ఒకప్పుడు 10లక్షలమంది పౌరులుండే సివిరో డొంటెస్క్‌ ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. 90శాతం భవనాలు ధ్వంసమయ్యాయి.యుక్రయిన్ సైన్యంతో పాటు నగర పౌరులు రష్యా బలగాలతో పోరాడినప్పటికీ ఫలితంలేకుండా పోయింది.

బెలారస్ ద్వారా బలగాలను యుక్రెయిన్‌లోకి తరలించిన రష్యా ఆ దేశానికి అణ్వస్త్ర ఆయుధాలు సైతం అందించేందుకు సిద్ధమయింది. ఇస్కందర్-ఎం మిస్సైళ్లను బెలారస్‌కు అందిస్తామని పుతిన్ హామీఇచ్చారు. మరోవైపు యుక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సాయం నిలిపివేయొద్దని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ విజ్ఞప్తిచేశారు. యుద్ధంలో యుక్రెయిన్ తప్పక గెలిచితీరుతుందని, పాశ్చాత్య దేశాలు అండగా నిలవాలని కోరారు.
యుక్రెయిన్ యుద్ధం ఐదు నెలల నుంచి కొనసాగుతున్న తరుణంలో జీ 7 సదస్సుపై అందరి దృష్టి నెలకొంది. జర్మనీలో జరుగుతున్న సదస్సులో యుద్ధం, ప్రపంచ దేశాలపై ప్రభావం అనే అంశంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది.

యుద్ధంలో కోల్పోయిన నగరాలన్నింటినీ యుక్రెయిన్ తిరిగి స్వాధీనం చేసుకుంటుందని జెలన్‌స్కీ విశ్వాసం వ్యక్తంచేశారు. సుదీర్ఘకాలంగా రష్యా బలగాలతో పోరాడడం కష్టంగానే ఉందని ఆయన అంగీకరించారు. యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందో , ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో తెలియదని, కానీ విజయం సాధించేవరకు పోరాడతామని జెలన్‌స్కీ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో యుద్ధం కొనసాగించడం అన్ని రకాలుగా కష్టతరమైనదని, అయినప్పటికీ రష్యా దాడులు తమ స్థైర్యాన్ని దెబ్బతీయలేవని అన్నారు.

యూరోపియన్ యూనియన్‌లో యుక్రెయిన్‌కు క్యాండిడేట్ స్టేటస్ ఇవ్వడానికి ఈయూ అంగీకరించడంపై జెలన్‌స్కీ సంతృప్తి వ్యక్తంచేశారు. మొత్తం యూరప్‌కే ఇది మంచి పరిణామమని ఈయూ అభివర్థించింది. అయితే ఈయూ నిర్ణయంపై రష్యా అభ్యంతరం వ్యక్తంచేసింది. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే..రష్యా, యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడప్పుడే ముగిసే సూచన కనిపించడం లేదు. ఆలస్యంగా అయినా లక్ష్యం సాధించాలని రష్యా భావిస్తోంది. తూర్పు యుక్రెయిన్‌ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని తర్వాత మరో ప్రాంతంపై దృష్టిపెట్టేలా వ్యూహరచన చేస్తోంది. సుదీర్ఘకాలం యుద్దం కొనసాగించాలన్నది మాస్కో ఆలోచన. మరి యుక్రెయిన్‌కు ఇప్పటిదాకా ఆయుధాల పరంగా, ఆర్థికంగా సాయం అందించిన పాశ్యాత్య దేశాలు.. మరింతకాలం ఈ సాయం కొనసాగిస్తాయా లేక…ఇంతటితో వదిలేస్తాయా అన్నదే యుద్ధ ఫలితాన్ని నిర్దేశించనుంది.