Bandi Sanjay: బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆ కాలేజీ భవనాన్ని కూల్చేస్తాం, అక్కడ పేదలకు ఇళ్లు కట్టిస్తాం- బండి సంజయ్
48 గంటల్లో ఆ గుడులను పునర్నిర్మించకపోతే వాళ్ల సంగతి చూస్తా. జూబ్లీహిల్స్ పోలింగ్ తర్వాత నేనే గోదావరిఖని వెళ్తా.
Bandi Sanjay: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో భాగంగా షేక్ పేట శివాజీ విగ్రహం వద్ద నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలపై సంచలన ఆరోపణలు చేశారు. మాగంటి గోపీనాథ్ ఆస్తులపై సీఎం రేవంత్, కేటీఆర్ కన్ను పడిందన్నారు. గోపీనాథ్ ఆస్తులను కాజేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఫిర్యాదు చేసినా విచారణ చేయడం లేదన్నారు. ఇదిగో కంప్లయింట్ కాపీ పంపిస్తున్నా. మీకు రోషముంటే, పౌరుషం ముంటే, చీము నెత్తురుంటే.. గోపీనాథ్ మరణంపై విచారణ చేయాలని సీఎం రేవంత్ కి సవాల్ విసిరారు.
గోపీనాథ్ ఆస్తుల కోసం దొంగ నాటకాలు ఆడుతున్న మాగంటి సునీతకు టిక్కెట్ ఇచ్చారని బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు బండి సంజయ్. వాస్తవాలు మాట్లాడుతుంటే తననను మతతత్వవాది అంటున్నారని వాపోయారు. మతతత్వవాది అని బోర్డు ఇస్తే మెడలో వేసుకుని తిరిగేందుకూ తాను వెనుకాడన్నారు. 80శాతం మంది హిందువులారా, మీరంతా ఓటు బ్యాంకుగా మారి దమ్ము చూపండి అని పిలుపునిచ్చారు.
‘జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో షేక్ పేట ఓటర్లు పువ్వు గుర్తుపై గుద్ది షేక్ చేయండి. ఉపఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ. ముస్లింల రాజ్యం కావాలా? హిందువుల రాజ్యం కావాలా? తేల్చుకోండి. హిందుత్వవాదులారా.. గడపగడపకూ తిరిగి బీజేపీకి ఓట్లేయించండి. షేక్ పేటలో ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటయ్యాయ్. ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ వాళ్లు ముస్లింలకు ప్రత్యేకంగా కుట్టు మిషన్లు, మిక్సర్లు, గ్రైండర్లు ఇస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్సే లేదు. జూబ్లీహిల్స్ లో ఉన్నవన్నీ బస్తీలు, మురికవాడలే. కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు అవకాశమిస్తే జూబ్లీహిల్స్ కు చేసిందేమీ లేదు.
కేటీఆర్ నెంబర్ వన్ చోర్. ముడతల చొక్కా, రబ్బర్ చెప్పులేసుకుని తిరిగే కేటీఆర్ కు వేల కోట్లు ఎలా వచ్చాయి? కేసీఆర్ పాలనలో వేల మంది రైతులు చనిపోయిన సంగతి మర్చిపోదామా? పెద్ద చదువులు చదువుకున్నా ఉద్యోగాలు రాక కూలి పని చేసుకున్న విషయం మర్చిపోదామా? ఎంతోమంది శవాలను ఈ భుజాన మోశా. కేసీఆర్ ఇంట్లో మాత్రం అందరికీ కొలువులిచ్చుకున్న విషయం మర్చిపోదామా?
హైడ్రా పేరుతో కూల్చిన ఇళ్లన్నీ హిందువులవే..!
కాంగ్రెస్ కు అవకాశమిస్తే హైడ్రా పేరుతో పేదల ఇళ్లపైకి బుల్డోజర్లు పంపుతోంది. హైడ్రా పేరుతో కూల్చిన ఇళ్లన్నీ హిందువులవే. చెరువును కబ్జా చేసి ఫాతిమా కాలేజీ కడితే మాత్రం దాని జోలికి పోరు. బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా కాలేజీ భవనాన్ని కూల్చేస్తాం. అక్కడ పేదలకు ఇళ్లు కట్టి ఇస్తాం. మోదీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులిస్తుంటే.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. మోదీ తెలంగాణకు సాయం చేస్తుంటే.. కనీసం ఫోటో కూడా పెట్టడం లేదు.
సీఎం రేవంత్ కు ముస్లిం ఓట్లు మాత్రమే కావాలట. కాంగ్రెస్ ను గెలిపిస్తే ఇళ్ల మధ్య ఖబరాస్తన్లు చేస్తారు. కేసీఆర్ కూడా సొంత పైసలతో ముస్లింలకే ఖబరస్తాన్ కట్టిస్తారట. హిందువులను పట్టించుకోరు. బంజారాహిల్స్ పెద్దమ్మ గుడిని కూల్చిన నీచులు కాంగ్రెస్ వాళ్లు. బీజేపీని గెలిపిస్తే అయోధ్య నుండి పూజారులను పిలిపించి పెద్దమ్మ గుడిని కట్టిస్తా. అమిత్ షాను పిలిపించి పూజలు చేయిస్తా.
48 గంటల డెడ్ లైన్..
గోదావరిఖనిలో 46 మైసమ్మ గుడులను కూల్చేశారు. 48 గంటల్లో ఆ గుడులను పునర్నిర్మించకపోతే వాళ్ల సంగతి చూస్తా. జూబ్లీహిల్స్ పోలింగ్ తర్వాత నేనే గోదావరిఖని వెళ్తా. మసీదులను కూల్చివేయిస్తా. కాంగ్రెస్ అంటే ముస్లిం అట, ముస్లిం అంటే కాంగ్రెస్ అట.. సీఎం చెబుతున్నారు. 15 నిమిషాలు టైమిస్తే హిందువులను చంపుతానన్న ఒవైసీని సీఎం తన వెంట తిప్పుకుంటున్నారు. పొరపాటున కాంగ్రెస్ గెలిపిస్తే పార్కులన్నీ ఖబరస్తాన్లు అయితయ్. మీ ఇళ్ల ముందే రక్తం ఏరులై పారుతుంది. మీ ఏరియాలో కూడా మీరు తిరిగే పరిస్థితి ఉండదు. లక్ష ఓట్ల కోసం కాంగ్రెస్ వాళ్లు మసీదులు, దర్గాల చుట్టూ బిచ్చగాళ్లలా తిరుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్లు ఏనాడైనా మీ ఇళ్లకు వచ్చి మీ సమస్యలు అడిగి తెలుసుకున్నారా? హిందువుల ఓట్లే అక్కర్లేదనుకున్నప్పుడు.. మీరెందుకు ఓటేయాలి?” అని బండి సంజయ్ అన్నారు.
