Liz Truss -Rishi Sunak : లిజ్ ట్రస్‌పై సొంతపార్టీలోనే వ్యతిరేకత .. రిషి సునాక్ బ్రిటన్ పీఎం అవుతారంటూ వస్తున్న వార్తలు నిజమవుతాయా?

యూకే ప్రధాని లిజ్ ట్రస్‌పై సొంతపార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. దీంతో ఆమెతో పోటీ పడి ఓడిని రిషి సునాక్ బ్రిటన్ పీఎం అవుతారంటూ వస్తున్న వార్తలు నిజమవుతాయా?

Liz Truss -Rishi Sunak : లిజ్ ట్రస్‌పై సొంతపార్టీలోనే వ్యతిరేకత .. రిషి సునాక్ బ్రిటన్ పీఎం అవుతారంటూ వస్తున్న వార్తలు నిజమవుతాయా?

Liz Truss -Rishi Sunak

Liz Truss -Rishi Sunak : ఇటీవల బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీ అధినేత లిజ్ ట్రస్ బాధ్యతలు స్వీకరించారు. మాజీ మంత్రి రిషి సునాక్ ప్రధాని పదవి రేసులో ఆమెకు గట్టి పోటీ ఇచ్చి ఓటమిపాలయ్యారు. ఈక్రమంలో లిజ్ ట్రస్ అధికారం చేపట్టిన కొన్నిరోజులకే సొంత పార్టీలో సంక్షోభం నెలకొంది. ఆర్థిక మార్కెట్లలోనూ ట్రస్ విధానాల పట్ల వ్యతిరేకత నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో రిషి సునక్ బ్రిటన్ ప్రధాని అవుతారంటూ వస్తున్న వార్తలు నిజమవుతాయా? అనే పరిస్థితులు నెలకొన్నాయి. బ్రిటన్ రాజకీయాల్లో గతవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తన సన్నిహితుడు క్వాసీ కార్టెంగ్ ను ఆర్థికమంత్రి పదవి నుంచి లిజ్ ట్రస్ తప్పించారు. ట్రస్ ఆర్థిక విధానాల అమలు బాధ్యతలను క్వాసీనే పర్యవేక్షిస్తున్నాడు. ఇటీవల ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్ తీవ్ర విమర్శలపాలైంది.

ఇటువంటి పరిస్థితుల్లో లిజ్ ట్రస్‌ను నమ్మడం వల్ల నష్టం జరిగిందని కన్సర్వేటివ్ పార్టీ నేతలు అనుకుంటున్నారా..? రిషి సునక్‌ను ఎన్నుకుని ఉంటే బాగుండేదన్న అంతర్మథనంలో ఉన్నారా..? మహిళా ప్రధాని, ఎన్నికై ఎక్కువరోజులు గడవలేదు వంటి మొహమాటాలను పక్కనబెట్టి మరీ..ట్రస్‌ను తప్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారా..? బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గట్టెక్కడానికి ఇంతకుమించి మరో దారి లేదన్న నిర్ణయానికి వచ్చేశారా..? తాజా పరిణామాలు చూస్తుంటే అంతే అనిపిస్తోంది. అనూహ్య పరిణామాలేమైనా జరిగితే తప్ప లిజ్ ట్రస్ ఎక్కువ కాలం పదవిలో కొనసాగే అవకాశం కనిపించడం లేదు.

లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాని బాధ్యతలు చేపట్టి రెండు నెలలైనా కాలేదు. కానీ ఆమెను ప్రధానిగా ఎన్నుకున్న కన్సర్వేటివ్ పార్టీలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ఏ హామీలైతే…ఆమెను రిషి సునక్‌ను వెనక్కి నెట్టి ప్రధాని రేసులో గెలుపొందేలా చేసాయో అవే హామీలు ఆమె పదవిని ప్రమాదంలోకి నెడుతున్నాయి.

కరోనా కాలంలో ఆర్థిక మంత్రిగా రిషి సునక్ తీసుకున్న నిర్ణయాలు…బ్రిటన్‌ ప్రజలకు ఆయనపై నమ్మకాన్ని పెంచాయి. ఆ అనుభవంతోనే కన్సర్వేటివ్ పార్టీ నేత ఎన్నికల్లో రిషి అలవికాని హామీలు ఏవీ ఇవ్వలేదు. లిజ్ ట్రస్ హామీల తర్వాత పన్నుల కోతలపై విధానాలను మార్చుకోవాల్సిందిగా మద్దతుదారుల నుంచి రిషి సునక్‌పై ఒత్తిడి పెరిగింది. ఓటమి తప్పదన్న హెచ్చరికలూ వినిపించాయి. అయినా సరే ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చేదాకా పన్నుల కోతలు ఉండబోవని సునక్ తేల్చిచెప్పారు. ఒకవేళ పన్నుల్లో కోతపెడితే ఆర్థిక వ్యవస్థ పతనం కావొచ్చనీ హెచ్చరించారు. కానీ కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు ఈ హెచ్చరికలను పక్కనపెట్టి..లిజ్‌ ట్రస్‌నే నమ్మి ఆమెకు పట్టం కట్టారు.

కానీ లిజ్ ట్రస్ ప్రధాని అయ్యాక ప్రవేశపెట్టిన తొలి మినీ బడ్జెట్‌తో ఆమె పాలన, అనుభవరాహిత్యంపై విమర్శలు మొదలయ్యాయి. కార్పొరేషన్ ట్యాక్స్‌ను 25శాతం నుంచి 19శాతానికి తగ్గించడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. బ్యాంక్ ఆఫ్‌ ఇంగ్లండ్ గవర్నర్ రంగంలోకి దిగి పరస్థితిని చక్కదిద్దాల్సివచ్చింది. ఇప్పుడు దేశాన్ని ఆర్థికమాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. ఇలాంటి తప్పుడు నిర్ణయం లిజ్ ట్రస్ ఇంకొక్కటి తీసుకున్నా..బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం ఖాయమన్న భయాందోళన వ్యక్తమవుతోంది. మరో తప్పటడుగు పడుకుండా…ట్రస్‌ను తప్పించమే మేలన్న అభిప్రాయంలోకి వెళ్లిపోతున్నారు కన్సర్వేటివ్ ఎంపీలు.

అయితే ప్రమాదాన్ని వెంటనే గ్రహించిన లిజ్ ట్రస్…తన తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేశారు. మొట్ట మొదటగా ఆర్థికమంత్రి క్వాసీని తప్పించి జెరెమీ హంట్‌కు ఆ బాధ్యతలు కట్టబెట్టారు. 19శాతానికి తగ్గించిన కార్పొరేషన్ ట్యాక్స్‌పై యు టర్న్ తీసుకున్నారు. ఆ పన్నును ఎప్పటిలానే 25శాతం కొనసాగిస్తానని చెప్పారు. కానీ ఈ నిర్ణయం ఆమెపై ఎంపీల్లో పోయిన నమ్మకాన్ని తిరిగి నిలబెట్టటానికి ఉపయోగపడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త ఆర్థిక మంత్రి హంట్ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనులు ప్రారంభించారు. రానున్న రోజుల్లో అత్యంత క్లిష్టమైన నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాలు ఖర్చు నియంత్రణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

లిజ్ ట్రస్, ఆమె మంత్రి వర్గం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నా…పార్టీ మాత్రం ప్రధాని మార్పుపై ఆలోచనలు చేస్తోంది. ఎన్నికలకు ముందు అలవికాని హామీల జోలికి వెళ్లని రిషి సునక్‌తో పాటు ఇతర నేతల పేర్లు పరిశీలిస్తోంది. లిజ్ ట్రస్ హామీలు ఆర్థిక వ్యవస్థను కూలదోస్తాయని చేసిన హెచ్చరిక..రిషి సునక్‌వైపు ఎక్కువమంది మొగ్గేలా చేస్తోంది. నిజానికి సభ్యుల ఎన్నికల్లో రిషి ఓడిపోయారు కానీ….మెజార్టీ ఎంపీలు ఆయన్నే గెలిపించారు.

హౌస్ ఆఫ్ కామన్స్ లీడర్ పెన్నీ మోర్డౌంట్, రక్షణ శాఖ మంత్రి బెన్ వాలెస్ పేర్లు కూడా రేసులో ఎక్కువగా వినిపిస్తున్నాయి. కన్సర్వేటివ్ పార్టీ నిబంధనల ప్రకారం ఏడాది వరకు లిజ్ ట్రస్‌ను పదవి నుంచి తొలగించే వీలుండదు. కానీ బ్రిటన్‌ ఆర్థిక వ్యవస్థ మరింత పతనం కాకుండా ఉండాలంటే నిబంధనలు మార్చైనా సరే ట్రస్‌ను తప్పించాలని కొందరు ఎంపీలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బ్రిటన్ ద్రవ్యోల్బణం అదుపు తప్పింది. నిత్యావసరాలు, చమురు ధరల భారం సామాన్యులు మోయలేకపోతున్నారు. ఈ శీతాకాలంలో ధరాభారంతో బ్రిటన్ ప్రజల జీవితంపై పెను ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో ట్రస్ ఎక్కువకాలంలో పదవిలో కొనసాగకపోవడమే మంచిదని కన్సర్వేటివ్ ఎంపీలు అనుకుంటే మాత్రం అతి తక్కువకాలం ప్రధానిగా ఉన్న మహిళగా లిజ్ ట్రస్ నిలిచిపోతారు.

కాగా ఇటీవల ఎన్నికల్లో పోరాడిన ఓడిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్… తాజా పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల కిందట ఆయన ఏర్పాటు చేసిన రెండు విందు కార్యక్రమాలు ఈ కోవలోకే వస్తాయని బ్రిటన్ మీడియా పేర్కొంది.