CPR : సీపీఆర్ అంటే ఏమిటి? ఎలా చేయాలి? గుండెపోటు బాధితుల ప్రాణాలు ఎలా కాపాడుతుంది? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వారి ప్రాణాలను కాపాడేందుకు చేసే అత్యవసర ప్రక్రియే సీపీఆర్. What Is CPR

CPR : సీపీఆర్ అంటే ఏమిటి? ఎలా చేయాలి? గుండెపోటు బాధితుల ప్రాణాలు ఎలా కాపాడుతుంది? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు

CPR (Photo : Google)

What Is CPR : గుండెపోటు.. ప్రస్తుత పరిస్థితుల్లో జనాలు ఎక్కువగా ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్య. ఈ మధ్య కాలంలో గుండెపోటు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉన్న వారు సైతం గుండెపోటు బారిన పడుతున్నారు. సడెన్ గా హార్ట్ ఎటాక్ తో కుప్పకూలిపోతున్నారు. చికిత్స అందించడం ఏ మాత్రం ఆలస్యం అయినా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో గుండెపోటు బాధితులను కాపాడేందుకు ఉన్న తక్షణ మార్గం సీపీఆర్. ఈ అత్యవసర చికిత్స ద్వారా బాధితుల ప్రాణాలను కాపాడేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి.

ఇంతకీ సీపీఆర్ అంటే ఏమిటి? ఎలా చేయాలి? ఇది ఏ విధంగా బాధితుల ప్రాణాలు కాపాడుతుంది? సీపీఆర్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు వైద్య నిపుణులు. అత్యవసరంగా చేసే ఈ చికిత్స వల్ల రోగి ప్రాణాలు కాపాడొచ్చని చెబుతున్నారు.

Also Read..Yoga and Gym : యోగా , జిమ్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది?

ఉన్నట్టుండి గుండె ఆగిపోవడాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. 85శాతం సందర్భాల్లో కార్డియాక్ అరెస్ట్ కు కారణం గుండెపోటే అని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. కొన్నిసార్లు ఇతర గుండె జబ్బులు, ఆక్సిజన్ తగ్గిపోవడం, కరెంట్ షాక్, పాము కాటు, భయం లాంటి కారణాలు కూడా కార్డియాక్ అరెస్ట్ కు దారితీస్తాయని వెల్లడించారు. గుండె ఆగిపోయినప్పుడు పక్క వాళ్ళు అందించే ప్రాథమిక చికిత్స వల్ల ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడొచ్చని చెబుతున్నారు. ఆ చికిత్సనే సీపీఆర్ అంటున్నారు. సీపీఆర్ అంటే.. కార్డియోపల్మనరీ రెససిటేషన్ (Cardiopulmonary Resuscitation).

గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు వారి ప్రాణాలను కాపాడేందుకు చేసే అత్యవసర ప్రక్రియే సీపీఆర్. కార్డియాక్ అరెస్ట్ తర్వాత తక్షణమే చేసే CPR ద్వారా జీవించే అవకాశాలను రెట్టింపు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా మనిషి గుండె కొట్టుకోవాల్సిన వేగం నిమిషానికి 60- 100 సార్లు. అయితే, గుండె కొట్టుకునే వ్యవస్థ (కండక్టింగ్ సిస్టమ్)లో లోపం వల్ల గుండె వేగం పెరగడం, తగ్గడం, లేక ఒక్కసారిగా గుండె ఆగిపోవడం జరుగుతుంది. ఎవరికైనా అకస్మాత్తుగా గుండె ఆగిపోతే, పక్కన ఉండే వారు దాన్ని మళ్ళీ కొట్టుకునేలా చేసే ఒక అత్యవసర ప్రక్రియను కార్డియోపల్మనరీ రెససిటేషన్‌గా చెబుతారు.

సీపీఆర్‌లో ప్రధానంగా 3 అంశాలు ఉంటాయి. అవే చెస్ట్ కంప్రెషన్స్, ఎయిర్‌వే పేటెన్సీ, బ్రీతింగ్.

స్పృహ కోల్పోయిన వ్యక్తి రెండు భుజాలను పట్టుకుని ఊపుతూ లేపే ప్రయత్నం చేయాలి. అప్పటికీ లేవకపోతే, గొంతు దగ్గర చేతి వేళ్లతో పల్స్ కోసం చూడాలి. అదీ తెలియకపోతే ఊపిరి తీసుకుంటున్నారా? లేదా? గమనించాలి. ఊపిరి తీసుకోవడం లేదని నిర్ధారణ అయితే ఆ వ్యక్తికి గాలి ఆడేలా చూడాలి. ఒంటి మీదున్న దుస్తులు బిగుతుగా ఉంటే లూజ్ చేయాలి.

Also Read..Wearing Socks : రాత్రి సమయంలో సాక్స్ ధరించి నిద్రపోయే అలవాటుందా ? అయితే ఇన్ఫెక్షన్స్ ముప్పు తప్పదంటున్న నిపుణులు

చెస్ట్ కంప్రెషన్స్
* బాధితుడి పక్కన మోకాళ్ల మీద కూర్చోవాలి.
* ఆ వ్యక్తి రొమ్ము మధ్య ఎముక కింద భాగంలో ఒక చేతి మీద ఒక చెయ్యి పెట్టి, వేళ్ళ మధ్య వేళ్ళను పెట్టి.. మన శరీరం బరువు మొత్తం పడేలా, పైకి లెక్కపెడుతూ నిమిషానికి 100-120 సార్లు ఛాతి మీద ఒత్తాలి.
* ప్రతిసారి 2-2.5 అంగుళాలు లోపలికి, లేక ఛాతిలో మూడవ వంతు లోపలికి వెళ్ళి వచ్చేలాగా నొక్కాలి.
* పక్కటి ఎముకల మీద ఆ బలం పెడితే విరిగిపోతాయని గుర్తు పెట్టుకోవాలి.
* కొన్నిసార్లు సరిగ్గా సీపీఆర్ చేసినప్పటికీ ఆ ఎముకలు విరిగే అవకాశం ఉంటుంది. అయినా కంగారు పడకూడదు. ప్రాణాలు నిలిస్తే అవి సులువుగానే అతుక్కుంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఎయిర్‌వే పేటెన్సీ..
* సాధారణంగా పడుకొని ఉన్నప్పుడు, ఆ వ్యక్తి నాలుక వెనుకకు పడిపోవడం వల్ల, గాలి ద్వారం మూసుకు పోయే ప్రమాదం ఉంటుంది.
* గాలి వెళ్ళే ద్వారం పూర్తిగా తెరిచి ఉండడానికి, ఆ వ్యక్తి తలను వెనక్కి అని, దవడ పైకి లేపి ఉంచాలి.
* దానితో గాలి ద్వారం తెరిచి ఉండడం వల్ల, కొంత వరకు గాలి ఊపిరితిత్తులలోకి వెళ్తుంది.

శ్వాస ఆడేలా చూడటం..
* బాధితుడికి ఊపిరి అందించడానికి ఆక్సిజన్ మాస్క్ వెంటనే అందుబాటులో ఉండకపోవచ్చు. అప్పుడు సన్నటి రుమాలు లేక ఏదైనా క్లాత్ అడ్డుగా పెట్టుకొని గాలి అందించవచ్చు.
* నోరు పూర్తిగా నోటితో మూస్తూ, ముక్కును వేళ్లతో లేదా చెంపతో మూసి, గాలి ద్వారం తెరిచి ఉండేలా తలను పట్టుకొని, ఆ వ్యక్తి ఛాతి పైకి లేచేలా పూర్తిగా ఒక సెకను గాలిని ఊదాలి.
* ప్రతి 30 కంప్రెషన్స్‌కు రెండు సార్లు (30:2) గాలి అందిస్తూ సీపీఆర్‌ను కొనసాగించాలి.
* ఇలా చేయడం చాలా అలసట కలిగిస్తుంది. అందుకే 2 నిమిషాలకు ఒకసారి మరొకరి సాయం తీసుకునే ప్రయత్నం చేయాలి.
* కాసేపటి తర్వాత గుండె కొట్టుకోవడం మొదలైందా లేదా అని మెడ పక్కన వేళ్లు పెట్టి పల్స్ చూడాలి.
* గుండె కొట్టుకోవడం మొదలై, ఊపిరి తీసుకునే వరకు ఇది కొనసాగించాలి.
* అప్పటికీ బాధితుడు స్పృహలోకి రాకపోతే ఒక పక్కకు తిప్పి (రికవరీ పొజిషన్‌లో) పడుకో పెట్టి ఉంచాలి.