అపూర్వ ఘట్టం : కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం

  • Published By: madhu ,Published On : May 29, 2020 / 12:35 AM IST
అపూర్వ ఘట్టం : కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు ప్రారంభోత్సవం

తెలంగాణలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా నిలుస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో అత్యధిక ఎత్తుకు గోదావరి నీళ్లు చేరబోతున్నాయి. గోదారమ్మ వందల కిలోమీటర్లు ప్రయాణించి సాగు భూములను సస్యశ్యామలం చేసేందుకు కొండపోచమ్మ రిజర్వాయర్‌కు చేరుకోబోతోంది. సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో… సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలం పాములపర్తి వద్ద నిర్మించిన రిజర్వాయర్‌ను 2020, మే 29వ తేదీ శుక్రవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించబోతున్నారు. మరోవైపు… ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా గ్రామ సర్పంచ్‌, దేవాలయ ఛైర్మన్‌ ఆధ్వర్యంలో కొండపోచమ్మ ఆలయంలో చండీయాగం నిర్వహిస్తున్నారు. వేకువజామున 4.30కి ప్రారంభమైన యాగం కొనసాగుతోంది.

కొండపోచమ్మ సాగర్‌కు గోదారమ్మను తరలించేందుకు మర్కుక్ పంప్‌ హౌజ్ వద్ద స్వీచ్ ఆన్‌ చేయనున్నారు సీఎం కేసీఆర్. అంతకుముందు సుదర్శనయాగం, గంగమ్మ పూజలు తదితర కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్‌స్వామితోపాటు రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి హాజరుకానున్నారు. అలాగే.. మెదక్, యాదాద్రి జిల్లాల్లోని శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జెడ్పీ ఛైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించారు. 

మర్కుక్ నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీటి ఎత్తిపోసేందుకు 34 మెగావాట్ల సామర్ధ్యంగల 6 మోటార్లు బిగించారు. తుక్కాపూర్‌లో 2 పంపులు, అక్కారంలో 2 పంపులు, మర్కూక్‌లో 2 పంపులు ఏకకాలంలో నడిచేలా కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు ఏర్పాట్లుచేశారు. ఒక్కోమోటరు 1250క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తాయి. ఎగువన ఉన్న నీటి సామర్థ్యం మేరకు కొండపోచమ్మసాగర్‌లో నీటిని నిల్వ చేసేందుకు అధికారులు సిద్ధమవడంతో… మర్కుక్ నుంచి సుమారు అరకిలోమీటరు ఎత్తులో ఉన్న కొండపోచమ్మ సాగర్‌లోకి నీటిని ఎత్తిపోసే అపూర్వఘట్టం ఆవిష్కరించబడనుంది.

Read: కొండపోచమ్మ ప్రాజెక్టు ప్రారంభ ఆహ్వానం: చిన జీయర్‌ను కలిసిన కేసీఆర్